
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య ఓ కలే. నిరుపేద, సాధారణ మధ్యతరగతి విద్యార్థులకు అదొక బ్రహ్మపదార్థం. ఎగువ మధ్యతరగతి, ధనికుల పిల్లలు డబ్బులు పెట్టి ఉక్రెయిన్, పిలిప్పిన్స్, చైనా, రష్యాలాంటి దేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ పూర్తిచేసేవారు. మధ్యతరగతివారికి ఇది ఆర్థికంగా పెనుభారంగా ఉండేది. తెలంగాణ బిడ్డలు ఎన్నో తిప్పలుపడి వైద్య విద్య పూర్తిచేయాల్సిన దుస్థితి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య కేవలం ఐదు మాత్రమే. ఇందులోనూ ఉస్మానియా, కాకతీయ, గాంధీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంలో ఉమ్మడి పాలకుల పాత్ర కించిత్తు కూడా లేదు. అంటే సమైక్య పాలనలో తెలంగాణలో ఏర్పాటైన కాలేజీలు కేవలం రెండు మాత్రమే.
తెలంగాణ ఉద్యమ సయంలో ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు కావాలని ఉద్యమ నేత కేసీఆర్ పట్టుబట్టారు. దీంతో సమైక్య సర్కారు కంటితుడుపు చర్యగా ఆదిలాబాద్ రిమ్స్ (2008), నిజామాబాద్ కాలేజీ (2013) ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ బిడ్డలు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విజన్‌తో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఉమ్మడి పాలనలో కేవలం రెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటయితే.. సీఎం కేసీఆర్ పాలనలో పదేండ్లలోనే 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో నిరుపేద బిడ్డకు కూడా వైద్యవిద్యను చేరువ చేశారు. సొంత నిధులతో ఒకే ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం దేశంలో ఇంకెక్కడా జరగలేదు. దేశ వైద్య విద్య చరిత్రలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది.
అటు వైద్యవిద్య.. ఇటు మెరుగైన వైద్యం
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్యవిప్లవానికి తెరలేపారు. ఆదినుంచీ రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఉన్నచోటే మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగానే పల్లె, బస్తీ, కొత్త పీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. టీ డయాగ్నొస్టిక్స్‌తో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే, మారుమూల ప్రాంతాలకు స్పెషాలిటీ వైద్యం అందజేయాలనే బృహత్ సంకల్పంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నిరుడు ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. శుక్రవారం (సెప్టెంబర్ 15)న మరో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వీటిని సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాంలో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వీటితో కలుపుకొని తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరనున్నది. అలాగే, కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ సర్కారు తన సొంత నిధులతో జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది.
రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డనాటినుంచీ తెలంగాణ సర్కారు వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టిపెట్టింది. అటు తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య అందుబాటులోకి రావడంతోపాటు మారుమూల ప్రాంతాల ప్రజలకూ సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించాలని జిల్లాకో మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టడంతో ఈఎస్‌ఐ, ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా.. ప్రభుత్వ విభాగంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,915కు పెరిగాయి. పీజీ సీట్లు సైతం 1,300లకు పైగా పెరిగాయి. మొత్తంగా చూసుకొంటే స్వరాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగాయి. రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నది.
-తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్నవి- 2,950 ఎంబీబీఎస్ సీట్లు
-ప్రభుత్వ విభాగంలో ఉన్న సీట్లు- 850
-అందుబాటులో ఉన్న పీజీ వైద్య సీట్లు-1,180
-అందులో ప్రభుత్వ విభాగంలో ఉన్న సీట్లు- 515
-2023 నాటికి తెలంగాణలో మెడికల్ కాలేజీల సంఖ్య- 26
-2023 నాటికి తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య- 3,690
అన్ని సీట్లూ తెలంగాణ బిడ్డలకేతెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ సర్కారు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడమేకాదు..అందులో వంద శాతం సీట్లూ వారికే దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకొన్నది. 2014జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా)లోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణలు చేసింది. ఉత్తర్వులు కూడా జారీ చేయగా, ఈ నిర్ణయం సరైందని హైకోర్టు సైతం తీర్పుచెప్పింది. దీంతో తెలంగాణ బిడ్డలకు వందశాతం అంటే మరో 520 సీట్లూ దక్కాయి. ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు మరో 1,300 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఇక్కడి విద్యార్థులకు ప్రతి ఏటా 1,820 ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. ఈ చర్యలతో ప్రభుత్వ, ప్రైవేటుతో కలిపి ఏటా పది వేల మంది వైద్య విద్యార్థులను తయారు చేసే స్థాయికి నేడు తెలంగాణ ఎదిగింది.