హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 2వ విడత పంపిణీకి సంబంధించి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2వ విడతలో 13,300 ఇండ్ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగనుంది.
లబ్ధిదారులను ఎంతో పారదర్శకంగా ఎన్ఐసీ (NIC) ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ డ్రా కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కమిషనర్, మూడు జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారు.
గత నెల 24 వ తేదీన మొదటి విడతలో 11,700 మంది లబ్ధిదారులను ఇదే పద్ధతిలో ఎంపిక చేసి ఈ నెల 2వ తేదీన 8 ప్రాంతాలలో ఇండ్లను మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ నెల 15 వ తేదీన నిర్వహించే ఆన్ లైన్ డ్రా లో ఎంపికైన లబ్ధిదారులకు 21వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి, ఇతర మంత్రుల చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుంది.