mt_logo

టీ-హబ్ ఒక అద్భుతం : అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి

హైదరాబాద్‌లో ఉండి పోయి రెండు, మూడేండ్ల తర్వాత వచ్చిన వాళ్ళు  అరే! ఇది హైదరాబాదేనా.! అని ఆశ్చర్యపోతున్నారు. మనం అమెరికా, బ్రిటన్‌లో ఉన్నామా..? అని ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతున్నారు. మొన్నటికిమొన్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇలాగే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇతర దేశాల ప్రముఖులు ఇక్కడికి వస్తే.. తమ నగరాల్లో ఉన్నట్టే ఉన్నదంటూ ప్రశంసిస్తున్నారు. తాజాగా, అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెటి కూడా ‘హైదరాబాద్‌ అపురూపం’ అని కొనియాడారు. శుక్రవారం నగరంలో పర్యటించిన ఆయన టీహబ్‌ను సందర్శించి అబ్బురపడ్డారు. భవిష్యత్తు అంతా ఇక్కడే కనిపిస్తున్నదన్నారు.’హైదారాబాద్‌లో ఇది నా తొలి పర్యటన. ఇందుకు నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా. భవిష్యత్తు ఏదీ? అని అడిగితే.. భవిష్యత్తును చూడాలి అని అనుకుంటే.. అంతా హైదరాబాద్‌లోనే కనిపిస్తున్నది అన్నారు. 

 టీహబ్‌ లాంటి ప్రదేశంలో కనిపిస్తున్నది, ప్రజల ఉత్సాహంలో కనిపిస్తున్నది, ఇక్కడి వృద్ధి, నిర్మాణ రంగంలో కనిపిస్తున్నది. టీ-హబ్‌ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. కాలిఫోర్నియా నుంచి వచ్చినవాడిగా.. అత్యంత ప్రతిభావంతులు, సృజనాత్మకత కలిగిన ఆంత్రప్రెన్యూర్లను కలుసుకోవటాన్ని గొప్పగా భావిస్తున్నాన్నారు. ఇక్కడ కూడా కాలిఫోర్నియాలో ఉన్న అనుభూతినే పొందుతున్నా,  ఇది అతి త్వరలోనే భారత ప్రీమియర్‌ స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌గా మారుతుందంటే ఏమాత్రం ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌లోనే కాకుండా ఆలోచనలు, కలలకు తెలంగాణ వాస్తవ రూపం ఇస్తున్నదని, దాన్ని ఉద్యోగాల కల్పనలో చూపిస్తున్నదని కొనియాడారు. అంతేకాదు.. తన ట్విట్టర్‌ ఖాతాలోనూ హైదరాబాద్‌, టీహబ్‌ విశేషాలను ఎరిక్‌ పంచుకొన్నారు.

ఈ మధ్యే ప్రారంభించిన యూఎస్‌ కాన్సులేట్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను ఆయన తన బృందంతో కలిసి సందర్శించారు. దీనిపై మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన అందమైన అమెరికన్‌ కాన్సులేట్‌ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుంటే విన్నాను. ఇప్పుడు దాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. హైదరాబాద్‌ అందరి కోసం సృష్టించిన నగరం’ అని ఎరిక్‌ పొగిడారు. అమెరికా-భారత్‌ భాగస్వామ్య మూలాలు ఇరు దేశాల ప్రజల లోతైన సంబంధాన్ని తెలుపుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారని, దాన్ని హైదరాబాద్‌లో కండ్ల నిండా చూస్తున్నానని తెలిపారు.

హైదరాబాద్‌ పాతనగరాన్ని సందర్శించిన ఎరిక్‌ గార్సెటి చౌమహల్లా ప్యాలెస్‌లో విందు ఆరగించారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ  చారిత్రక హైదరాబాద్‌ పాతనగరంలో తొలిసారి అడుగుపెట్టా. చౌమహల్లా ప్యాలెస్‌లో రుచికరమైన ఆహారాన్ని ఆరగించా’ అని ట్వీట్‌ చేశారు.  గత నెల 28న విజయవాడలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ’22 ఏండ్ల తర్వాత నేను హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చినప్పుడు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వైపు వెళ్లా, నేను భారత్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అన్నది అర్థం కాలేదు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.