mt_logo

లక్షమంది యువతకు టాస్క్ శిక్షణ

తెలంగాణ వ్యాప్తంగా లక్షమంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)తో టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. బుధవారం టీ హబ్‌లో టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ నిర్వహించిన టెలికాం మంథన్‌- 2022 కార్యక్రమంలో జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిజిటలైజేషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన నిపుణులకు టెలికాం రంగంలోనూ విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఐటీ రంగానికి అనుబంధంగా ఉన్న టెలికమ్యూనికేషన్‌ రంగం అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ప్రస్తుతం 4జీ నుంచి 5జీకి మారుతున్న తరుణంలో టెలికాంలో నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం చాలా ఉంటుందని తెలిపారు. దీన్ని భర్తీ చేసేందుకు టెలికాం సెక్టార్‌ కౌన్సిల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నదన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిటీలో టెలికాం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్ :

జాతీయ స్థాయిలో టెలికాం రంగంలో నైపుణ్యం కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్న టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ నగరంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా టీఎస్‌ఎస్‌సీ సీఈవో అరవింద్‌ బాలి మాట్లాడుతూ.. టెలికాం రంగంపై నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. ప్రస్తుతం 4జీ నుంచి 5జీ టెక్నాలజీకి టెలికమ్యూనికేషన్‌ రంగం మారుతున్న నేపథ్యంలో అనుభవజ్ఞులైన, నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం టెలికాం రంగానికి ఉన్నదన్నారు. ఇందుకోసం తమ సంస్థ ప్రత్యేకంగా ఇండస్ట్రీకి అవసరమయ్యేలా మానవవనరులను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రకరకాల పరిశోధనలు, పలు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఇలాంటి చోట టెలికాం రంగానికి సంబంధించిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నైపుణ్యం కలిగిన నిపుణులు ఈ రంగానికి అవసరమవుతారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *