తన నోటి దురుసు కారణంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చీవాట్లు తిన్నాడు.. ఈసారి ఏకంగా సుప్రీం కోర్టు చేతిలోనే. ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. బహుశా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్స్‌పై సుప్రీం కోర్టు జడ్జీలు ఈ స్థాయిలో వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారేమో.
రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ధర్మాసనం.. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రేవంత్‌కు తగునా అని ప్రశ్నించింది.
రేవంత్ ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని, కనుక ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలని వేసిన పిటీషన్ మీద ఇవ్వాళ సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వ్యాఖ్యనించిన న్యాయమూర్తులు.. సర్వోన్నత న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదని హితవు పలికారు.
ఇలాంటి విమర్శలని తాము ఎలాగో పట్టించుకోమని.. కాకుంటే ఆర్డర్ ఇచ్చేముందు రాజకీయ పార్టీని సంప్రదించాలా అని వారు అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ తన తీరును మార్చుకోవాలని హెచ్చరిస్తూ.. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుకి గౌరవం ఇవ్వకుంటే ఎలా అని మండిపడ్డారు.
ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా.. రేవంత్ రెడ్డికి కౌన్సెలింగ్ ఇవ్వాలని రేవంత్ తరపు న్యాయవాదులకు న్యాయమూర్తులు సూచించారు. ఈ నేపథ్యంలో.. ఓటుకు నోటు కేసు బదిలీ విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే.. ఇవ్వాళ సుప్రీం కోర్టులో తన ఓటుకు నోటు కేసు విచారణ పెట్టుకుని, నిన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మజూరు చేయడం మీద రేవంత్ రెడ్డి ఏకంగా సుప్రీం కోర్టు మీద చేసిన అడ్డగోలు వ్యాఖ్యలు చివరకు ఆయన మెడకే చుట్టుకున్నట్టు కనిపిస్తోంది.
రేవంత్ పక్షాన వాదిస్తున్న న్యాయవాది ఏదో సర్దిచెప్పటానికి ప్రయత్నిస్తే న్యాయమూర్తి “మాకవన్నీ చెప్పకండి. ఆయన ప్రవర్తన ఇలా ఉంటే ఆయనను వేరే రాష్ట్రంలో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పండి. ఆయనకు, ఈ దేశపు అత్యున్నత కోర్టు అయిన సుప్రీం కోర్టు అంటేనే గౌరవం లేదు. ఈ కేసు సోమవారానికి వాయిదా వేస్తున్నాను” అని అన్నారు
సో, ఇవ్వాళ సుప్రీం కోర్టులో రేవంత్‌కు పడిన అక్షింతలు చూశాక రేవంత్ నోటి దురుసే తన మెడకు చుట్టుకుంది అన్న భావన కలిగింది. మొత్తానికి.. సుప్రీం కోర్టు మీద వ్యాఖ్యల వల్ల ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ ఇరుకున పడ్డట్టే అని పలువురు విశ్లేషిస్తున్నారు.