mt_logo

లాభాల్లో ఉన్న విజయ డైరీని నష్టాల్లోకి నెట్టిన రేవంత్ సర్కార్!

బీఆర్ఎస్ హయంలో లాభాల బాటలో పయనించిన తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) ఇప్పుడు తీవ్ర నష్టాలను ఎదురుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డైరీకి నిధుల కొరతతో పాటు ఉత్పత్తుల అమ్మకాలు తగ్గడం ఇందుకు కారణం.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అయిదేళ్లపాటు డివిడెండ్ సైతం అందించిన విజయ డైరీకి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుండి సమస్యలు మొదలయ్యాయి. ప్రతిరోజు సుమారు లక్షన్నర మంది రైతుల నుంచి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ సేకరిస్తోంది. ఇందుకు ప్రతి రోజు రైతులకు కనీసం రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు బిల్లులు చెల్లించాలి.

ఆది నుంచి ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లించే విధానం ఉండేది. నిధుల సమస్య వల్ల గత మార్చి నుంచి 15 రోజుల్లోపు చెల్లింపులు జరగడం లేదు.. నిధుల లభ్యత ఆధారంగా ఇస్తున్నారు. ప్రస్తుతం రెండు నెలలకు సంబంధించి రూ.120 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది, మరోవైపు, పాలు సరఫరా చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లీటర్‌కు రూ.4 చొప్పున రాయితీని 2014లో ప్రకటించింది. వాటిని కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం లేదు. తద్వారా.. బిల్లులు, ప్రోత్సాహకాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

విజయ డెయిరీ నెయ్యి, పాల పొడి, వెన్న, మజ్జిగ, దూద్ వేడా, లస్సీ, పెరుగు, ఐస్‌క్రీం తదితరాలను ఉత్పత్తి చేస్తోంది. ఆరు నెలలుగా వీటి విక్రయాలు మందగించాయి. రాష్ట్రంలోని దేవాలయాలు ఇతర ప్రాంతాల నుంచి, ప్రైవేటు డెయిరీల నుంచి ఉత్పత్తులు కొంటున్నాయి. దేవాలయాలు విజయ నెయ్యినే కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డెయిరీ అధికారులు కోరారు.

రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో కేసీఆర్ ప్రభుత్వం రూ. 246 కోట్లతో విజయ డెయిరీ ఆధ్వర్యంలో మెగా డెయిరీని నిర్మించారు. 9 టన్నుల నెయ్యితో పాటు ఇతర ఉత్పత్తుల తయారీకి భారీ సామర్థ్యంతో డెయిరీని నిర్మించినా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. మెగా డైరీ కోసం రూ. 100 కోట్ల గ్రాంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజయ డెయిరీ అభ్యర్థించినా ఇంకా నిధులు విడుదల కాలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలనాపరమైన లోపాలు వెరసి పాడి రైతులు పాలిట శాపంగా మారాయి. బీఆర్ఎస్ హయంలో దిగ్విజయంగా నడిచిన విజయ డైరీ.. ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయింది.