mt_logo

బిర‌బిరా కాళేశ్వ‌ర జ‌లాలు..ఎస్పారెస్పీ కాలువ ప‌రుగులు

-సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో కాలంకాకున్నా నిండుకుండ‌ల్లా చెరువులు

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ముఖ్య‌మంత్రి  కేసీఆర్‌ నైజం. వరద కాలువ ద్వారా దిగువకు మాత్రమే పారే నీళ్లను కాళేశ్వ‌ర జ‌లాల ఎత్తిపోత‌ల‌తో ఎదురెక్కించి రైతన్నల ఇబ్బందులను తీర్చిన కేసీఆర్‌ అసాధారణ వ్యక్తి. కేసీఆర్‌ పరిపాలనలో తెలంగాణ రైతాంగం మోములో సంతోషం వెల్లివిరుస్తున్న‌ది. ఇప్ప‌టికే రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటల కొనుగోళ్లతో రైతులకు ఆపద్బాంధవుడిగా మారిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పవిత్రమైన జలాలను 300 కిలోమీటర్ల మేర ఎత్తిపోత‌ల‌ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో పోసి రైతుల పంట పండిస్తున్నారు. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో జూలై నెల స‌గం గ‌డిచినా చినుకు జాడ‌లేక‌పోయినా.. వ‌ర్షం చుక్క ప‌డ‌క‌పోయినా మ‌న ఎస్సారెస్పీ కాలువ జీవ‌ధార‌గా మారింది. కాళేశ్వ‌ర జ‌లాల ఎత్తిపోత‌ల‌తో కాలువ ప‌రుగులు పెడుతున్న‌ది. ఈ కాలువ ప‌రివాహ‌క ప్రాంత జ‌ల‌వ‌నరుల్లో నీళ్లు నాట్య‌మాడుతున్నాయి. కాలువ 122 కిలోమీట‌ర్ల పొడ‌వునా ఉన్న చెరువుల్లో జ‌లాలు చేరి, త‌డ‌లు కొడుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన తూముల ద్వారా కాళేశ్వ‌ర జలాలు ఎలాంటి న‌ష్టం లేకుండా డైరెక్ట్‌గా చెరువుల్లోకి చేరిపోతున్నాయి. వరద కాలువ ద్వారా చెరువులను ఎప్పటికప్పుడు నింపుకోవడంతో రైతులకు వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

తూములు క‌ట్టి.. నీళ్ల‌ను ప‌ట్టి

వ‌ర్షాలు లేన‌ప్పుడు నిర్జీవంగా మారిపోతున్న వ‌ద‌ర కాలువ‌ను రీడిజైనింగ్‌లో భాగంగా సీఎం కేసీఆర్ స‌జీవ‌ధార‌గా మార్చేశారు. ఎస్సారెస్పీ పున‌ర్జీవ ప‌థ‌కంలో భాగంగా దీని రూపురేఖ‌లే మార్చేశారు. తూముల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయించారు. గ‌తంలో అశాస్త్రీయంగా ఉన్న 16 తూముల మ‌ర‌మ్మ‌తుల‌తోపాటు మ‌రిన్ని నిర్మించారు.  ఇప్పుడు తూముల సంఖ్య 34కు పెరిగిపోయింది. కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల‌తో దిగువ‌నుంచి ఎగువ‌కు ఎదురెక్కి వ‌స్తున్న జ‌లాలు ఈ 34 తూముల ద్వారా నేరుగా 53 చెరువుల్లోకి వెళ్తున్నాయి. ఒక్కో చెరువు నిండుకుండ‌లా మారి మ‌త్త‌డి దుంకుతున్నాయ‌. మ‌రో రెండు, మూడు రోజుల్లో చెరువుల‌న్నీ పూర్తిస్థాయిలో నిండ‌నున్నాయి. మ‌రోవైపు  లక్ష్మి బరాజ్‌ ద్వారా ఎత్తిపోస్తున్న కాళేశ్వరం జలాలు నలుదిశలా పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం వరకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 2 టీఎంసీల కాళేశ్వరం జలాలు చేరాయి. ఇంకా కాళేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. కాలంకాకున్న ఎదురెక్కి వ‌స్తున్న జ‌లాల‌ను చూసి అన్న‌దాత‌లు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు తెలంగాణ స‌ర్కారుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.