హైదరాబాద్: ఐటీ రంగంలో తెలంగాణను పరుగులుపెట్టిస్తున్న ఆ శాఖ మంత్రి కే తారకరామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించేందుకు ఆయనకు జర్మనీ నుంచి ఆహ్వానం అందింది. జర్మనీలోని బెర్లిన్ నగరంలో సెప్టెంబర్ 14న నిర్వహించే ‘గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్’ (జీటీఐపీఏ) వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని కోరుతూ ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్’ (ఐటీఐఎఫ్) మంత్రి కేటీర్‌ను ఆహ్వానించింది. తెలంగాణలో పెట్టుబడులను సాధించేందుకు తెలంగాణ సర్కారు అనుసరించిన వ్యూహాలు, సాధించిన విజయాలు, డిజిటల్ టెక్నాలజీ విస్తరణపై ప్రజెంటేషన్ ఇవ్వాలని కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు ఐటీఐఎఫ్ ఉపాధ్యక్షుడు స్టీఫెన్ ఎజెల్ లేఖ రాశారు. కాగా, ఈ జీటీఐపీఏ సదస్సులో ప్రపంచంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని, వివిధ అంశాలపై చర్చించనున్నారు. గ్లోబలైజేషన్, వాణిజ్యం, ఆవిష్కరణ విధాన సమస్యలపై ప్రపంచ నిపుణులతో కలిసి మంత్రి కేటీఆర్ చర్చల్లో పాల్గొననున్నారు.