- వేద/శాస్త్ర పండితులకు గౌరవ భృతి
- ధూప దీప నైవేద్యం
- విప్రహిత బ్రాహ్మణ సదనం
- సాంప్రదాయ పాఠశాల-కంచి కామకోటి పీఠం
మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్యాత్మికతను మించిన మరో మార్గం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆది నుండి అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. ‘భిన్నత్వంలో ఏకత్వమే’ ఈ దేశానికి బలం అని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ దిశగా అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూతనిస్తున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్ధిల్లుతున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21 (బుధవారం) న రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. భిన్న మతాల భక్తి, ఆధ్యాత్మక రంగాల వైభవానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ
వేదహిత-వేద పాఠశాల
సంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం కరువవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని వేద పాఠశాలలకు ఆలంబనగా రూ.2.00 లక్షలు ఆర్ధిక సహాయం అందించే పథకం. అర్హత ఉన్న వేద పాఠశాలలు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా 32 వేద పాఠశాలలు లబ్ది పొందగా, రూ. 59,50,000 లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
వేదహిత-వేద విద్యార్థులు
ఈ పథకం ద్వారా తెలంగాణలోని వేద పాఠశాలల్లో వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా నెలకు రూ.250/- భత్యం, స్మార్తం పూర్తి చేసిన విద్యార్థుల జీవనోపాధి కొరకు రూ.3.00 లక్షల ఆర్థిక సహాయం, అలాగే ఆగమం, క్రమాంతం, ఘనాంతం వేద విద్య పూర్తి చేసిన వారికి రూ.5.00 లక్షలు ఆర్థిక సహాయంగా అందిస్తారు. అర్హులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన విద్యార్థుల సంఖ్య 245, ఖర్చు చేసిన మొత్తం రూ. 15,52,500
వేద/శాస్త్ర పండితులకు గౌరవ భృతి:
సంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం కరువవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని వేద శాస్త్ర విద్యలలో నిష్ణాతులైన 75 సంవత్సరాలు పైబడిన వారికి రూ.2,500/- నెలసరి గౌరవ భృతి ఇచ్చే పథకం. ఈ పథకం ద్వారా మే 2023 నాటికి ఉన్న లబ్దిదారుల సంఖ్య 64 కాగా, ఇందుకోసం ఖర్చు చేసిన మొత్తం రూ. 53,65,000.
ధూప దీప నైవేద్యం
ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణకు నెలకు రూ. 2,500 చొప్పున 1805 దేవాలయాలకు చెల్లించేవారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1840 దేవాలయాలకు ఈ పథకాన్ని వర్తింప చేయడంతో మే 2023 నాటికి ఈ పథకం కింద లబ్ధి పొందే దేవాలయాల సంఖ్య 3,645 కు చేరింది. ఈ పథకం కింద నెలవారి ఇచ్చే మొత్తాన్ని రూ. 4,000 ల నుండి రూ. 6,000 లకు పెంచారు. ఈ మొత్తంలో నుంచి రూ. 4,000 అర్చకులకు వేతనం గా, రోజూ నిర్వహించే ధూప దీప నైవేద్య పూజా కార్యక్రమాలకు రూ. 2,000 లు ఇస్తారు. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 26.25 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా బీద బ్రాహ్మణులకు స్వయం ఉపాధిని కల్పించే విధంగా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించేలా ఆర్థిక చేయూతనిచ్చే పథకం.
విప్రహిత బ్రాహ్మణ సదనం
సాంస్కృతిక, సంప్రదాయ, సామాజిక, వైదిక పరమైన మరియు బ్రాహ్మణ సమాజ హిత కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అన్ని వసతులతో కూడిన భవన నిర్మాణానికై ప్రభుత్వం భూమి, నిధులను సమకూర్చుతున్నది. భవన నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో గరిష్టంగా 75 % బ్రాహ్మణ పరిషత్ ద్వారా ప్రభుత్వం భరిస్తుంది, మిగిలినది దాతలు, స్థానిక బ్రాహ్మణ సమాజం భరించాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి తక్కువ కాకుండా ఉచిత పద్దతిన పరిషత్ కు భూ యాజమాన్య హక్కులు కల్పించిన సందర్భంలో బ్రాహ్మణ సదనం పథకం క్రింద బ్రాహ్మణ పరిషత్ ఖర్చు భరిస్తుంది.
విప్రహిత బ్రాహ్మణ సదనం, గోపన్ పల్లి:
ఈ పథకం క్రింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోపన్ పల్లి గ్రామం, శేరిలింగంపల్లి మండలం, రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సదనం నిర్మాణానికి 6 ఎకరాల 10 గుంటల భూమిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాహ్మణ సమాజానికి విస్తృత ప్రయోజనాల కల్పించే దృష్టితో దీన్ని నిర్మించారు. ఈ భవనంలో మూడంతస్తుల కళ్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం ఉన్నాయి. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర్ రావు మే 31 న ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో గరిష్టంగా 75% పరిషత్తు భరించగా, మిగిలిన ఖర్చును దాతలు, స్థానిక బ్రాహ్మణ సమాజం భరించారు. బ్రాహ్మణ పరిషత్ భవనం, భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి కేంద్రంగా పనిచేస్తుంది. సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్ సెంటర్ గా సేవలందిస్తుంది. దీంట్లో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి ఆధ్యాత్మిక గ్రంథాల సాహిత్యం తో కూడిన గ్రంథాలయాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. మే 2023 నాటికి బ్రాహ్మణ సదనానికి ప్రభుత్వం రూ 12.00 కోట్ల వరకు ఖర్చు పెట్టింది.
బ్రాహ్మణ సదనం, సూర్యాపేట
సూర్యాపేట జిల్లాలో బ్రాహ్మణ సదనం నిర్మాణం సూర్యాపేట నివాసి డా. ఏ. రామయ్య గారు ఒక ఎకరం భూమిని స్వచ్ఛందంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు భూ యాజమాన్య హక్కు ను కల్పిస్తూ రిజిస్టర్ చేశారు. సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ పరిధి లో ఉన్న ఈ ఒక ఎకరం భూమిలో బ్రాహ్మణ సదనం నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.2.00 కోట్లు మంజూరు చేసింది. ఈ భవనం ప్రారంభమై సేవలందిస్తోంది.
బ్రాహ్మణ పరిషత్ భవనం, సిద్దిపేట:
సిద్దిపేటలోని బ్రాహ్మణ పరిషత్ భవన నవీకరణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 50.00 మంజూరు చేసింది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మే 2023 వరకు రూ. 35.00 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది.
బ్రాహ్మణ భవనం, ఖమ్మం:
ఖమ్మం జిల్లాలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 75.00 లక్షలను మంజూరు చేసింది.
అపర కర్మ భవనం, మధిర, ఖమ్మం జిల్లా:
మధిర పట్టణంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 73.00 లక్షలు మంజూరు చేసింది.
సాంప్రదాయ పాఠశాల-కంచి కామకోటి పీఠం
కంచి కామకోటి మఠాధిపతి ఆధ్వర్యంలో ‘ప్రత్యేక చారిటబుల్ ట్రస్ట్’ అనే ఒక ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నాగోల్ లో ఒక సంప్రదాయ పాఠశాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నది. సాధారణ విద్యను అభ్యసించడం వలన భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే లలిత కళలు, నృత్యం, సంగీతం, యోగ, కుట్లు మరియు అల్లికలు వంటి కళల యందు బ్రాహ్మణ బాలికలు నైపుణ్యం కలిగి ఉండకపోవడం వల్ల ఈ కళలకు ఆదరణ లేకుండా పోయింది. ఇవి భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. వీటిని పునరుద్దించాలని, భవిష్యత్ తరాలకు ఈ కళలను, సంప్రదాయాలను అందించాలని అవి అంతరించి పోకుండా చూడాలని ఒక మహదాశయంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష చారిటబుల్ ట్రస్ట్ వారి ఈ ఆశయం మేరకు నాగోల్ లో ఏర్పరచిన సంప్రదాయ పాఠశాలకు సంవత్సరానికి 3.00 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయుటకు ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలలో సంప్రదాయ విద్యతో పాటు సాధారణ విద్య కూడా నేర్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా మే 2023 వరకు 100 మంది విద్యార్థినులు లబ్ధి పొందారు. ప్రభుత్వం రూ. 12 లక్షలు ఖర్చు చేసింది. తెలంగాణ బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు పోటీ పరీక్షల నిమిత్తం ఆర్థిక సహాయం అందించే పథకం. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉద్యోగార్థులైన బ్రాహ్మణ నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే పోటీ పరీక్షలకు కోచింగ్, స్టడీ మెటీరియల్ కొరకు ఆర్థిక సహాయం అందిస్తారు. వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే పేద నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బి. సి స్టడీ సెంటర్లలో కోచింగ్ తీసుకొనవచ్చును. ఈ పథకం ద్వారా 2 జూన్ 2023 నాటికి 89 మంది లబ్ధి పొందారు.
అక్షయ నిధి
తెలంగాణాలోని సామాజిక సేవా దృక్పథం ఉన్న దాతల నుంచి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విరాళాలు స్వీకరించి వాటిని తిరిగి బ్రాహ్మణుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది. ఈ నిధికి ప్రభుత్వం కూడా కొంత సహకరిస్తుంది.
బోనాల పండుగ
పాలు, బెల్లం తో కలిపి వండిన అన్నాన్ని రాగి లేదా ఇత్తడి లేదా మట్టి కుండలలో పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ కుండలను పసుపు,కుంకుమ, వేప మండలతో అలంకరిస్తారు. కొన్నిచోట్ల ఈ కుండల పై దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఇలా అలంకరించిన కుండనే ‘బోనం’ అంటారు. బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో సుమారు పదహారు రోజులు జరుగుతుంది. ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళి దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీలోని ‘షాలిబండ’లో కొలువై ఉన్న అక్కన-మాదన్న మహంకాళీ దేవాయం, ‘లాల్ దర్వాజా’ లోని మహాంకాళీ అమ్మవారి దేవాలయం మొదలైన పలు ప్రధాన దేవాలయాలలో కనుల పండుగగా జరుగుతుంది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం వైభవోపేతంగా బోనాల పండుగను నిర్వహిస్తున్నది.
తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర
సమ్మక్క సారక్క జాతర ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ప్రతి రెండేండ్లకు ఒకసారి నిర్వహించే ఈ జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక భక్తులు పాల్గొనే జాతర ఇదే. నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతరకు 1 కోటి 50 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తున్నారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర నిధులతో జాతర నిర్వహించేవారు. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర నిర్వహణ ఏర్పాట్ల కోసం 2016 (ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు) లో రూ.178 కోట్లు, 2018 (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3)లో రూ.102 కోట్లు, 2020 (ఫిబ్రవరి 5 నుంచి 8)లో రూ.81 కోట్లు, 2022 లో రూ. 75 కోట్లు కేటాయించింది.
ఘనంగా గోదావరి పుష్కరాల నిర్వహణ
ప్రకృతితో మానవ జీవితం పెనవేసుకున్నదనడానికి పుష్కరాలు ఒక గొప్ప ఉదాహరణ. జీవకోటిని బతికించే నీటి జాడలను నదీమ తల్లులను దేవత రూపంలో కొలిచే గొప్ప సంస్కృతి భారతదేశానిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుపుకొనే తొలి గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం 2015లో జులై 14 నుండి 25 వరకు ఘనంగా నిర్వహించింది.
గొప్పగా కృష్ణా పుష్కరాల నిర్వహణ
తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా కృష్ణా పుష్కరాలు 2016 ఆగష్టు 12 నుంచి 23 వరకు జరిగాయి. ఈ పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. పాలమూరు జిల్లావ్యాప్తంగా 52 ఘాట్లు ఏర్పాటు చేయగా దాదాపు 1.84 కోట్ల భక్తులు, నల్లగొండ జిల్లాలోని 28 పుష్కర స్నాన వాటికల్లో 72 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు.
యాదగిరి గుట్ట అభివృద్ధి – ఆలయ నిర్మాణం
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు ప్రతిరూపంగా వాస్తు శిల్పులు, స్థపతులు, ఆధ్యాత్మికతకు అద్దంపట్టేలా రాతి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ద్రవిడ వాస్తు శైలి కి జీవం పోసిన కాకతీయ, పల్లవ, హోయసాల, చాళుక్య శిల్ప కళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం రూపుదిద్దుకుంది. ఈ ఆలయాన్ని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు 28 మార్చి 2022 న వైభవోపేతంగా ప్రారంభించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పూనికతో యాదాద్రి క్షేత్రం మహిమాన్వితంగా వెలుగొందుతున్నది. యాదాద్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటిడిఏ) ను ఏర్పాటు చేసింది.
భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, ఆలయ శిల్పకళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుట మయ్యేలా యాదాద్రి ఆలయం రూపుదిద్దుకున్నది. దేవస్థానం పునర్నిర్మాణం లో భాగంగా నూతన ప్రధానాలయంలో సప్త రాజగోపురాలను నిర్మించారు. ఆలయం కోసం ఏకంగా రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలను వినియోగించారు. 1,200 మంది శిల్పులు రాత్రింబవళ్లు పని చేసి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. వెయ్యేళ్ల పాటు నిలిచేలా ఇంటర్‌లాకింగ్ పరిజ్ఞానం, బరువు సమతూకం అయ్యేలా డిజైన్ చేసి ఆలయాన్ని నిర్మించారు. పిడుగు పాటుతో నష్టం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు.
అద్భుత శిల్పకళా సౌందర్యం తో యాదాద్రి దేవాలయం భక్తులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. నిత్యం వేలాదిమంది భక్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని పునీతులవుతున్నారు.
శబరిమలలో తెలంగాణ భవన్ కోసం 5 ఎకరాల స్థలం
శబరిమల క్షేత్రానికి వెళ్లే తెలంగాణ భక్తుల కోసం తెలంగాణ భవన్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో అక్కడ భవన సముదాయం నిర్మించేందుకు 5 ఎకరాల స్థలం కేటాయించింది కేరళ ప్రభుత్వం. కేరళ విద్యాశాఖ మంత్రి పీ.కే.అబ్ దరూబ్ 2015 ఫిబ్రవరి 13న సచివాలయంలో సీఎం కేసీఆర్ ను కలిసి 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు.
ఐదు రోజుల పాటు అయుత చండీయాగం నిర్వహణ
ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర్ రావు వ్యక్తిగత హోదాలో అత్యంత భక్తి శ్రద్ధలతో 2015 డిసెంబర్ 23 నుంచి 27 వరకు అయిదు రోజుల పాటు అయుత చండీయాగం నిర్వహించారు. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి ఆధ్వర్యంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన 15 వందల మంది రుత్వికులు ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది.
శ్రీ సహస్ర మహా చండీ యాగం : (21 జనవరి, 2019 నుండి 25 జనవరి 2019 వరకు)
దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ లోక కల్యాణార్థం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శ్రీ సహస్ర మహా చండీయాగాన్ని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలోని యజ్ఞవాటికలో 21 జనవరి, 2019 నుంచి 25 జనవరి 2019 వరకు వేదోక్తంగా నిర్వహించారు.
విశాఖ పట్టణం నుంచి ప్రత్యేకంగా తరలివచ్చిన శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో ఈ యజ్ఞం నిర్వహించారు.
అధికారికంగా రంజాన్ పండుగ నిర్వహణ
గంగా జమున తెహజీబ్ కు ప్రతిరూపంగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, సామాజిక స్వరూపాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. మొహర్రమ్, పీర్ల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయింది. అనేక దర్గాలకు హిందువులు వెళ్తారు. దేశంలో మైనారిటీలుగా గుర్తింపు పొందిన ముస్లింలకు భరోసానిస్తూ వారి సంప్రదాయాలు, విశ్వాసాలను గౌరవిస్తూ రంజాన్ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. అదే విధంగా 2015 నుంచి ప్రతి ఏటా రంజాన్ పండుగను పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో దావత్ ఎ ఇఫ్తార్ కార్యక్రమాన్ని, 2017 నుంచి పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో బట్టల పంపిణీ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా పాల్గొంటున్నారు.
షాదీ ముబారక్ పథకం
రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం మైనార్టీ ఆడ పిల్లల వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించే సదుద్దేశంతో 2014 అక్టోబర్ 2 నుండి షాదీ ముబారక్ అనే ప్రయోజనాత్మకమైన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద షాదీ సమయంలో వధువుకు రూ. 1,00,116 లను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తున్నది. గడిచిన 9 ఏళ్ళలో 2,55,518 మంది పెళ్లిళ్లకు 2,130.95 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
అనీస్ ఉల్ గుర్బా భవన నిర్మాణం
ముస్లిం అనాథలకోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 39 కోట్లతో అనీస్ ఉల్ గుర్బా భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.
అజ్మీర్ లో రుబాత్ (అతిథి గృహం)
ముస్లింల పవిత్ర దర్గా రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద తెలంగాణ నుంచి సందర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రుబాత్ (అతిథి గృహం) నిర్మించేందుకు రూ. 5 కోట్లు కేటాయించింది. భూమి సమీకరణకు సంబంధించి అజ్మీర్ డెవలప్ మెంట్ అథారిటిని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించింది.
ఇమాం మౌజంలకు గౌరవ వేతనం
ముస్లింల ప్రార్థనా స్థలాలు అయిన మసీదులు, మదర్సాల్లో ఉండే ఇమామ్, మౌజమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5,000 ల గౌరవ వేతనాన్ని అందిస్తున్నది. రాష్ట్రంలోని 10 వేల మందికి ఈ గౌరవ వేతనాన్ని అందిస్తూ సమాజంలో వారికి గౌరవప్రదమైన హోదాను, గౌరవాన్ని కల్పిస్తున్నది.
హజ్ యాత్రికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు
హజ్ యాత్రికులకు ప్రయాణ ఏర్పాట్లు, యోగక్షేమాలను చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. మక్కా, మదీనాలకు హజ్ యాత్రను నిర్వహించే నిమిత్తం రాష్ట్ర హజ్ కమిటీకి ప్రభుత్వం రూ.3 కోట్ల గ్రాంటును ఇచ్చింది. భారత హజ్ కమిటీతో తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సమన్వయం కలిగి వుండి దరఖాస్తులు స్వీకరణ, ఆమోదం, టికెటింగ్, బోర్డింగు, లాడ్జింగ్, ఇతర రవాణా అవసరాలకు ఏర్పాట్లు చేస్తున్నది.
అజ్మీర్ దర్గా వద్ద రూ. 5 కోట్లతో వసతి గృహం
తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అజ్మీర్ దర్గా లో వసతి గృహాన్ని నిర్మిస్తానని మొక్కుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ తర్వాత 2015 ఫిబ్రవరి 4న దర్గా నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికుల కోసం ఈ వసతి గృహాన్ని నిర్మించనున్నారు.
ఇతర కార్యక్రమాలు
•పాతబస్తీలోని మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ, నవీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 8.48 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి.
•మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కొత్తూర్ లోని జహంగీర్ పీర్ దర్గా సమగ్రాభివృద్ధి అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
•హైదరాబాద్ లోని కోకాపేట్ లో బర్హానా షా సాహిబ్ ఖిబ్లా పరిసరాల్లో ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, మహిళా సాధికారత కేంద్రం స్థాపనకు ప్రభుత్వం రూ. 20 కోట్లను మంజూరు చేసింది.
•హైదరాబాద్ లోని కోకాపేటలో రూ. 40 కోట్లతో తెలంగాణ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ స్థాపనకు రూ. 40 కోట్లు మంజూరు చేశారు.
అధికారికంగా క్రిస్మస్ పండుగ
రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రతీ ఏటా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నది. క్రిస్మస్ విందుకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరవుతారు. వీరితో పాటు క్రిస్టియన్ మత పెద్దలను, 12 వేల మంది క్రిస్టియన్లను ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని చర్చిలలో ఒక్కో చర్చికి రూ. 2 లక్షల చొప్పున కేటాయించి క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది.
క్రిస్మస్ (బట్టల పంపిణీ) కానుకలు
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఏడాది క్రైస్తవులకు కొత్త బట్టలను పంపిణీ చేస్తున్నది. 2022 క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.85 లక్షల మందికి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేసింది.
క్రిస్టియన్ ఆత్మగౌరవ భవనం నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన
కోకాపేట్ లో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ. 10 కోట్లతో క్రిస్టియన్ భవన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీంతో పాటు చర్చీలు, గ్రేవ్ యార్డుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నది.
చర్చీల నిర్మాణాలకు అనుమతులు సులభతరం, పునరుద్ధరణకు చర్యలు
చర్చీల నిర్మాణ అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు చర్చీల నిర్మాణానికి కఠిన నిబంధనలు ఉండేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, ప్రభుత్వం స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వీలును కల్పించింది. దీంతో కొత్తగా ఎన్నో చర్చిలు నిర్మితమయ్యాయి. మరికొన్ని చర్చిలకు మరమ్మతులు చేసి, ప్రహరీ గోడలు నిర్మించారు.
సిక్కుల కోసం గురుద్వారా నిర్మాణం
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం, నార్సింగి గ్రామంలో సిక్కు గురుద్వారా నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లకు పైగా విలువైన 3 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. గురునానక్ 548 వ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలో నవంబర్ 4, 2017న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గురుద్వారా స్థల పత్రాలను సిక్కు మత గురువులకు అందజేశారు.
ఈ కార్యక్రమాలతో పాటు సందర్భానుసారం ప్రభుత్వం పలు ఉత్సవాలు, కార్యక్రమాలకు నిధులను విడుదల చేస్తూ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా చర్యలు చేపడుతున్నది.