mt_logo

అర లక్ష దాటిన వెనుకబడిన వర్గాల 1 లక్ష సహాయం దరఖాస్తులు

  • దరఖాస్తుదారు ఎవర్నీ ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదు
  • పూర్తిగా https://tsobmms.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్లోనే అప్లికేషన్ ప్రక్రియ
  • రెండు సంవత్సరాల క్రితం ఆదాయ సర్టిఫికెట్లు పనిచేస్తాయి
  • ఇన్కం సర్టిఫికెట్ల జారీకోసం కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోండి
  • సరళమైన అప్లికేషన్ ని మొబైల్ నుండి పూర్తి చేసుకోవచ్చు

హైదరాబాద్, జూన్ 12:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం ఇప్పటి వరకు దాదాపు 53 వేలు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. నేడు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో ఇదే అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కులవృత్తులకు ఘన వైభవం తీసుకొచ్చి వారి జీవితాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ గారు సంకల్పించారని, వారి కులవృత్తికి ఉపయోగపడే ముడిసరుకు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు గానూ ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా లక్ష రూపాయల సహాయం ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈనెల 20 వరకూ పథకానికి సంపూర్ణంగా ఆన్లైన్ ద్వారానే https://tsobmms.cgg.gov.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని దరఖాస్తుదారులకు మరోసారి సూచించారు, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ ప్రత్యక్షంగా కలువాల్సిన అవసరం లేదన్న మంత్రి, ఆదాయ పత్రాలు సైతం 2021 ఏప్రిల్ నుండి జారీ చేసినవి చెల్లుబాటవుతాయన్నారు. జిల్లా కలెక్టర్లు సైతం అవసరార్థుల ఇన్కం సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చాలా సరళంగా ఉన్న అప్లికేషన్ ఫారంను దరఖాస్తుదారులు తమ స్మార్ట్ ఫోన్ల నుండి సమర్పించవచ్చని సూచించారు.