mt_logo

నామ్ బదల్నేసే కుచ్ నహీ హోతా…కామ్ బదల్నా చాహియే

ఇప్పుడు దేశ ప్రజలకు ‘ పేర్లతో పనిలేదు.. పని చేయగలిగిన వాల్లతోనే పని (నామ్ దారీ నహీ కామ్ దారీ హోనా చాహియే) అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంకా కూడా…పార్టీ ఫౌండర్లు సిద్ధాంతకర్తలు తాతల తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేసే పరిస్థితులు చెల్లవని చెప్పారు. ఈ స్వతంత్ర భారతదేశంలో కేంద్రంలోని పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి నిర్లక్ష్యం గానే  కొనసాగుతున్నదని,  దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని, ఈ దిశగా  చైతన్యమై,  పార్టీలను కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకోవాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.  

బీఆర్ఎస్  పార్టీలోకి మహారాష్ట్ర తో పాటు మధ్యప్రదేశ్ నుంచి కూడా చేరికలు ఊపందుకున్నాయి.  బీఆర్ఎస్  పార్టీ విధానాలు, పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నేతలు,  మేధావి, సామాజిక తదితర వర్గాలు పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుంచి పలువురు రాజకీయ నాయకులు చేరిన సందర్భంగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఈ దేశంలో ప్రకృతి ప్రసాదించిన నీరు, వ్యవసాయ యోగ్యమైన భూమి,  విద్యుత్ కు అవసరమైన బొగ్గు నిల్వలు, వ్యవసాయానికి అవసరమైన సమతల శీతోష్ణస్థితి సూర్యరశ్మి తదితర ప్రకృతి వనరులన్నీ అందుబాటులో వున్నాయని వివరించారు. అన్నీ వున్నా కూడా ఇంకా దేశ రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయమన్నారు. కేంద్రంలోని పాలకులకు లక్ష్యశుద్ధి లోపించడమే ఇందుకు కారణమన్నారు. దళితులు బహుజనులు సహా అన్ని వర్గాలు 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం  చేశారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా చైతన్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 

నామ్ బదల్నేసే కుచ్ నహీ హోతా…కామ్ బదల్నా చాహియే

‘‘ వొక పార్టీని వోడించి ఇంకో పార్టీని గెలిపిస్తే ఆ పార్టీల పేర్లే మారుతాయి. ఆ నాయకుల పేర్లు మారుతాయి …కానీ ప్రజలకు వొరిగేదేమీ లేదు. ఈ నేపథ్యంలో పనివిధానం లో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే (నామ్ బదల్నేసే కుచ్ నహీ హోతా…కామ్ బదల్నా చాహియే) అని స్పష్టం  చేశారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే గెలిచిన రెండేండ్లల్లో భారతదేశ ప్రజలకు రైతాంగానికి అవసరమైన విద్యుత్తును 24 గంటలు అందచేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పార్టీ  కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, భారత దేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ అని స్పష్టం చేశారు.  మన వోటును పని చేయనివాల్లకు కాకుండా మన కోసం పనిచేసుకునే వాల్లకు వేసుకుంటేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ప్రస్థుతం తెలంగాణ లో దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపిన ముఖ్యమంత్రి తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు రైతుబంధు రైతుబీమా ఉచిత విద్యుత్ ఆసరా ఫించన్లు వంటి పథకాల గురించి వివరించారు. తెలంగాణలో అమలవుతున్నప్పుడు మధ్యప్రదేశ్ లో ఎందుకు అమలు కావని ప్రశ్నించారు.  ఇదే ప్రశ్నను కేంద్రాన్ని అడగాలన్నారు. మన కష్టాలను ఇతరులు తీర్చరని మనమే తీర్చుకోవాల్సి వుంటుందన్నారు.

ఈ దేశంలో ఏడు దశాబ్దాలు దాటినా ఆదీవాసీలు దళితులు బహుజనులు పీడితులుగానే కొనసాగాల్సిన దుస్థితి ఇంకెన్నాళ్లు..అని ప్రశ్నించారు. ఇప్పటికే ఉత్తరభారతంలో కనీస జీవన విలువలు లేకుండా వివక్షకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశం మార్పు కోరుకుంటున్నదని, ఈ దిశగా బుద్ధిజీవులు ఆలోచన చేయాలన్నారు.  మేధావి వర్గం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కలిసిరావాలన్నారు. ‘దిల్ వాలే దిమాఖ్ వాలే’ ఐక్యం కావాల్సిన అవసరమున్నదన్నారు. తప్పుడు వాగ్దానాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలవరించడంలో ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. త్వరలోనే మధ్యప్రదేశ్ భోపాల్ లో బీఆర్ఎస్ పార్టీకి స్వంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. మధ్యప్రదేశలోని అన్ని నియోజకవర్గాల్లో వాహనాలను ఏర్పాటు చేసుకుని పార్టీ భావజాలాన్ని ప్రచార సామాగ్రిని గ్రామ గ్రామన తిప్పాలని ప్రజలను చైతన్యం చేయాలని అధినేత స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలోరైతు దళిత మహిళ యువ బీసీ వంటి 9 కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.