- కార్మికుడి కార్డు రెన్యువల్ పదేళ్లకు పెంపు.
- లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు బీమా పెంపు.
- డిజిటల్ కార్డు రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహణ.
- క్యాంపు కార్యాలయంలో కార్మిక కార్డు సేవలు సద్వినియోగం చేసుకోవాలి.
- 5లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు
సిద్ధిపేట: నా శక్తినంతా ఉపయోగిస్తా.. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తా. మీ వెంట, మీకు తోడుగా ఉంటా. మీరంతా ఐక్యంగా ఉండాలి. మీ దీవెనలు. మీ ఆశీర్వాదం నాపై ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఏ ప్రగతి కైనా మూలాధారం కార్మికుడు. ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా నడిచేది కార్మికుడి కష్టం మీదనే. సంపాదించే ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కేనని రాష్ట్ర మంత్రి హరీశ్ చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మీ భవన నిర్మాణ రంగ కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఇచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్ లో ఆదివారం మధ్యాహ్నం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అధ్యక్షత, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు కార్డు కలిగి ఉండాలని, అందుకు అవసరమైన డబ్బులు తానే వెచ్చిస్తున్నట్లు, కార్డు ఉంటేనే మీరు లబ్ధి పొందే అవకాశం ఉన్నదని, అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్డు పొందాలని, ఇందు కోసం క్యాంపు కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు, అవసరమైతే మీ అనువైన సమయం అమావాస్య రోజున ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయిస్తానని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మీ కుటుంబం బరువు బాధ్యత మీ పై ఆధారపడి ఉన్న సంగతి మరువద్దని, సిగరెట్లు కాల్చొద్దని, నిత్యం శ్రమించి రాత్రిపూట దూపకు అలవాటు కావొద్దని, తక్కువ చేస్తూ మీ ఆరోగ్యం కాపాడుకోవాలని కార్మికులకు ఆరోగ్య మంత్రి సూత్రాలు చెప్పారు.
రైతుభీమా తరహాలో కార్మిక బీమా చేయాలని నిర్ణయించినట్టు మంత్రి ప్రకటించారు. డిజిటల్ కార్డుల రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ చేపడుతామని చెప్పారు. ఈ మేరకు అప్పటికప్పుడే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కమిషనర్ రాణి కౌముదితో చర్చించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఓ ఏజెన్సీ ద్వారా సభ్యత్వం పొందిన కార్మికుడి వేలిముద్ర సేకరించి, నామిని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, దాంతో సమగ్రమైన సమాచారం కలిగి ఉండటంతో అర్హులైన మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలం అందుతుందని అవగాహన కల్పించారు. ఒక్కసారి డిజిటల్ కార్డు చేసుకుంటే ఐదేళ్ల వరకే పరిమితం అయిందని, తిరిగి రెన్యూవల్ బాధలకు మీరు పడుతున్న బాధలు గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం పదేళ్లకు పెంచిందని చెప్పారు. ఇది వరకూ లక్షన్నర ఉన్న భవన నిర్మాణ కార్మికుడి బీమా ఇక నుంచి రూ.3 లక్షలకు పెంపునకు సీఎం కేసీఆర్ చర్చించి కృషి చేస్తానని మంత్రి హరీశ్ హామీనిచ్చారు.
– కార్మిక-ఆరోగ్య శాఖ ఒప్పందం
– 5లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు
ఇటీవల కార్మిక-ఆరోగ్య శాఖ కార్మికుడి వైద్య సేవలపై చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నది. రూ.5లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వర్తించేలా చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్ వెల్లడించారు. అలాగే క్యాన్సర్, గుండె చికిత్సలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య బీమా వర్తించేలా ఈ ఆగస్టు నెల నుంచి అమలు కాబోతున్నదని తెలిపారు.
సిద్ధిపేటలో కార్మిక భవన్ కు ఎకరం స్థలం కేటాయింపు
సిద్ధిపేట శివారు మందపల్లిలో కార్మిక భవన్ నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి హరీశ్ ప్రకటించారు. సిద్ధిపేటలో ఎల్అండ్ టీ, సెట్విన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రం, న్యాక్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, వాటి ద్వారా మీలో నైపుణ్యాలను పెంచుకోవచ్చునని, ఆయా శిక్షణ కేంద్రాల్లో వెళ్లేలా మీ పిల్లలను ప్రోత్సహించాలని, ఆ శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆసక్తికరంగా ఫోన్ లైన్ లో మంత్రుల సంభాషణ
సిద్దిపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో ఆసక్తికరంగా ఫోన్ లైన్ లో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఆరోగ్య మంత్రి హరీశ్ సంభాషణ జరిపారు. ఈ మేరకు కార్మికులను ఉద్దేశించి కష్టపడి. పాలు అమ్మిన, పూలు అమ్మిన, ఎమ్మెల్యేగా, మీ కార్మిక మంత్రిగా ఇవాళ మీతో మాట్లాడుతున్నానని అక్కడి సభలో కార్మికులందరినీ ఉత్సాహపరిచారు. మంత్రి హరీశ్ సూచన మేరకు సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలో జిల్లాకో కార్మిక భవన్ మంజూర్ కార్మిక మంత్రిగా డిక్లేర్ చేస్తున్నా అంటూ చెప్పారు.