mt_logo

ఒకవైపు కారు-మరొకవైపు బేకార్ గాల్లు: మంత్రి కేటీఆర్

భారత రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిల్యా నాయక్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు చేరారు. ఈ సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మాట్లాడారు. ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి తనకు డబ్బులు సంపాదించే ఏటియంగా వాడుతున్నారని అన్నారు. ఓటుకు నోటు అంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు… నోటుకు సీటు… రేటెంత అంటూ మాట్లాడుతున్నాడు, ఫేక్ సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ… తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆ పార్టీకి కొత్త కాదు.. గతంలో కూడా ఇలాంటి సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి చిత్తుగా ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్ కున్నదని తేల్చి చెప్పారు. 

సన్నాసులమని కాంగ్రెస్ ఓటు అడుగుతుందా?

ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతాం.. గడ్డాలు గీసుకోమంటూ సవాలు చేసిన, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట తప్పారని పేర్కొన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నా కరెంటు ఇయ్యలేని సన్నాసులమని కాంగ్రెస్ ఓటు అడుగుతుందా? అని ప్రశ్నించారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న తాగునీటి ఇబ్బందులు తీర్చలేని చేతకాని వాళ్ళ మంటూ ఓటు అడుగుతారా?  24 గంటల కరెంటు రైతులకు ఇవ్వలేని ఆలోచన మాకు రాలేదు అని ఓటు అడుగుతారా? కాంగ్రెస్‌కి ఓటు ఎందుకు వేయ్యాలో చెప్పాలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నేతల ఎదిగారు కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. 

మన వేలుతో మన కండ్లని పొడుచుకోవద్దు

60 ఏళ్ల పాటు ప్రజలకు ఏం చేయని కాంగ్రెస్ పార్టీని మరోసారి ఎందుకు గెలిపించాలని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన వేలుతో మన కండ్లని పొడుచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ జమానాలో ఉన్న కరెంటు కోతలు వ్యవసాయ సంక్షోభం,  రైతు ఆత్మహత్యలు, తాగునీటి కొరత వంటి దుర్భర పరిస్థితుల్లో మళ్లీ కావాలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 

ఒకవైపు స్కీములు – మరోవైపు స్కాములు 

రేవంత్ రెడ్డి అన్న మూడు గంటల కరెంట్ కావాలా… లేదా 24 గంటల ఉచిత విద్యుత్తు కావాలా తెలంగాణ  రైతులు అలోచించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం దాదాపు అన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిందని తెలిపారు. ఒకవైపు స్కీములు తెచ్చిన బీఆర్ఎస్ ఉన్నది… మరోవైపు స్కాములు తెచ్చిన కాంగ్రెస్ ఉన్నది,  ఒకవైపు కారు ఉన్నది… మరొకవైపు బేకార్ గాల్లు ఉన్నారు ఏవరికి ఓటేయాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. 

ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదు 

కేసీఆర్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచారని గుర్తు చేశారు. కేసీఆర్ మరోసారి తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందుతారన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నదన్నారు.  ఇప్పటిదాకా 33 నియోజకవర్గాల్లో తిరిగినా.. నాకు ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదని స్పష్టం చేశారు. ఒక్క దేవరకొండలోనే 600 కోట్లతో ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి రానున్న ప్రభుత్వంలో దేవరకొండ ప్రజలకు సాగునీరు అందించి వారి రుణం తీర్చుకుంటాం అన్నారు. 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండను పట్టించుకోలేదని తెలిపారు. 

బీజేపీ ఎన్నికల హంగామా స్టార్ట్

ఈరోజు మిషన్ భగీరథ ద్వారా హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ప్రజలకు అందుతున్న నాణ్యమైన తాగునీరే దేవరకొండలోని తండాలోని గిరిజనులకు కూడా అందుతున్నది. గిరిజనుల రిజర్వేషన్ 6 నుంచి 10% పెరిగిందని అన్నారు. ప్రత్యేకంగా తండాలను గ్రామపంచాయతీలు చేసి వేలాది మంది గిరిజనులకు రాజకీయ అవకాశాలు స్వపరిపాలన అధికారం అందించామని గుర్తు చేశారు. 9 సంవత్సరాల నిద్రపోయి గిరిజన యూనివర్సిటీ అంటూ బీజేపీ ఎన్నికల హంగామా స్టార్ట్ చేసింది. 

అమిత్ షాకు కేటీఆర్ సవాల్

రైతు ఆత్మహత్యలపైన అబద్ధం ఆడిన అమిత్ షాకు కేటీఆర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్లో చెప్పిన సమాచారాన్ని కాదని కేంద్ర మంత్రి అబద్ధాలు ఆడారని తెలిపారు. అమిత్ షా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నల్గొండ జిల్లా నుంచి ఫ్లోరోసిస్‌ని తరిమి, సాగునీటి జలాలు అందించి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి అద్భుతమైన మందిరాన్ని పునర్ నిర్మించిన కేసీఆర్ గారికి ఓటేయాలా లేదా నల్గొండకి తరతరాలుగా అన్యాయం చేసిన కాంగ్రెస్‌కి ఓటేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బిల్యా నాయక్ కలిసిన తర్వాత అక్కడ ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం అని పేర్కొన్నారు.