mt_logo

నిరుపేద ఆరోగ్యానికి భ‌రోసా.. మ‌న బ‌స్తీల్లోనే మెరుగైన వైద్యం.. 

  • ప‌ట్ట‌ణాల్లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో బ‌స్తీ ద‌వాఖాన‌లు 
  • రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానల‌తో సేవ‌లు

నాడు.. నిరుపేద‌ల‌కు వైద్యం అంద‌ని ద్రాక్ష‌.. జ్వ‌రమొచ్చినా.. త‌ల‌నొచ్చినా.. ప్రైవేట్‌కు వెళ్లాల్సిందే. జేబు గుల్ల చేసుకోవాల్సిందే. మందుల‌కు డ‌బ్బ‌లు చెల్లించాల్సిందే. ఇలా ప్ర‌తి కుటుంబం నెల‌కు స‌రాస‌రి సాధార‌ణ‌ వైద్యానికే  వేల రూపాయ‌లు ఖ‌ర్చు చేసేది. సంపాద‌న‌లో స‌గం ద‌వాఖాన‌ల‌కు పెట్టాల్సిన దుస్థితి. కానీ.. స్వ‌రాష్ట్రంలో ఆ తిప్ప‌లు తప్పాయి. నిరుపేద‌ల ఆరోగ్యానికి భ‌రోసా ల‌భించింది. మ‌న బ‌స్తీల్లోనే మెరుగైన వైద్యం అందుతున్న‌ది. 

ప‌ట్ట‌ణాల్లోని పేద‌ల‌కు వైద్యం తిప్ప‌లు తప్పించేందుకు సీఎం కేసీఆర్‌ బస్తీ దవాఖానలకు రూపకల్పన చేశారు. మొదట హైదరాబాద్‌కే పరిమితమైనా.. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో క్రమంగా ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్‌లో 350, మున్సిపాలిటీల్లో 150 కలిపి 500 బస్తీ దవాఖానల ఏర్పాటు లక్ష్యంగా నిర్ధారించుకున్నది. ఒక బస్తీ దవాఖానా 5,000-10,000 జనాభాకు సేవలను అందిస్తుంది. డాక్టర్‌ పర్యవేక్షణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు అందిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 370 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 321 బస్తీదవాఖానాలు సేవలు అందిస్తున్నాయి. మరో 50 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏటా సుమారు 50 లక్షల ఓపీ నమోదవుతున్నది.

-బస్తీ దవాఖానాల్లో 2022 డిసెంబర్‌ వరకు 2,11,23,408 మంది చికిత్స చేసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.94.87 కోట్లు ఖర్చు చేసింది.

-బస్తీ దవాఖానలతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌పై ఓపీ భారం గణనీయంగా తగ్గింది. ఫలితంగా వైద్యులు స్పెషాలిటీ సేవలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

పల్లె పల్లెకో దవాఖాన

ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మండలానికో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండేది. దీంతో పేద ప్రజలు నానా తంటాలు పడేవారు. టీఆర్‌ ఎస్‌ సరారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సైతం దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నది. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను అభివృద్ధి చేస్తున్నది. ఒక్కో పల్లె దవాఖానకు రూ.20 లక్షల వ్యయంతో పకా భవనాలను నిర్మిస్తున్నారు. ప్రతి భవనంలో మూడు బెడ్లతో కూడిన వార్డు రూమ్‌, ఒక వెయిటింగ్‌ హాల్‌, స్టోరేజీ గది, ఒక నర్సింగ్‌ రూమ్‌, ల్యాబ్‌ , రెండు మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నారు. రోగులను వీల్‌చైర్‌లో తరలించేందుకు ర్యాంప్‌ కూడా ఏర్పాటుచేస్తున్నారు.