
హైదరాబాద్: సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణలో వైద్య విప్లవం వచ్చింది. పీహెచ్‌సీలు, పల్లె, బస్తీ దవాఖానలతో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుతున్నది. ప్రతి దవాఖానలో పడకల సంఖ్యతోపాటు మౌలిక వసతులు పెరుగుతున్నాయి. నగరానికి నలుమూలలా మల్టీ స్పెషాలిటీ దవాఖానలు సిద్ధమవుతున్నాయి. జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాలతో అటు తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య చేరువకావడంతోపాటు నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నది తెలంగాణ సర్కారు. టీ డయాగ్నొస్టిక్ కేంద్రాలతో ఉచితంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తుండడంతో నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకొన్న ప్రజలే నేడు ప్రభుత్వ దవాఖానలకు క్యూకడుతున్నారు. తాజాగా, తెలంగాణ సర్కారు మరో ముందడుగు వేసి, తెలంగాణ ప్రజలకు రోబోటిక్ చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. నిమ్స్‌ను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా రూ.48 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. ఇందులో రూ. 31.5 కోట్ల విలువైన అత్యాధునిక రోబో కూడా ఉండటం విశేషం. మిగతా వాటిలో రూ. 16.5 కోట్ల విలువైన సర్జికల్ న్యూరో, సర్జికల్ యూరాలజీ విభాగాలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయి.
నిమ్స్‌లో అత్యాధునిక రోబోటిక్ యంత్రాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
అత్యాధునిక రోబో యంత్రం ప్రత్యేకతలు
-ఈ పరికరాలతో అన్ని రకాల శస్త్రచికిత్సలతోపాటు న్యూరో, స్పైన్, క్యాన్సర్, గ్యాస్ట్రో, యూరాలజీకి సంబంధించిన ఆపరేషన్లు అతి తక్కువ సమయంలో చేసే వీలుంటుంది.
-కోత లేకుండా చిన్నపాటి రంధ్రాల ద్వారా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సులభంగా పూర్తిచేయవచ్చు. -రోబో సర్జరీ వల్ల రోగికి రక్తస్రావం జరగదు. ఫలితంగా ఆపరేషన్ సమయంలో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు.
-నిమ్స్ చరిత్రలోనే ఇది ఖరీదైన యంత్రం. ఇంత అత్యాధునిక రోబో కార్పొరేట్ దవాఖానల్లోనూ లేదు. -యూరినరీ బ్లాడర్, రెక్టమ్ క్యాన్సర్ వంటి శస్త్రచికిత్సలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
-ఈ రోబోతో చేసే ఆపరేషన్ల కచ్చితత్వం, సక్సెస్‌రేట్ 90 శాతానికిపైగానే ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు తావుండదు.