- సర్కారు చర్యలతో చెరువులకు పూర్వ వైభవం
- కుటుంబ సమేతంగా సేదతీరేలా సౌకర్యాలు
- మినీ ట్యాంక్‌బండ్‌తో సందర్శకుల తాకిడి

హైదరాబాద్ మహానగరంలో అనేక చెరువులున్నా.. సమైక్య పాలకుల నిర్లక్ష్యం.. కబ్జాలతో కాలగర్భంలో కలిసిపోయే స్థితికి చేరుకొన్నాయి. చాలాచోట్ల రూపురేఖలను కోల్పోయాయి. నగరవాసులకు నీటిని, ఆహ్లాదాన్ని అందించాల్సిన తటాకాలు పూడికలు, పిచ్చిమొక్కలతో కళావిహీనంగా మారిపోయాయి. కానీ, స్వరాష్ట్రంలో చెరువులకు పునరుజ్జీవం కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. లేక్ సిటీగా పేరొందిన మహానగరంలోనూ చెరువులకు పూర్వవైభవం సంతరించేలా తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. మిషన్ కాకతీయ పథకంతో చెరువులన్నీ సుందరీకరణకు నోచుకొన్నాయి. దాదాపు 510.5 కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులను తెలంగాణ సర్కారు అభివృద్ధి చేస్తున్నది. చెరువుల సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్, ఎంట్రన్స్ ప్లాజా, లైటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వలస పక్షులను ఆకర్షించేలా బ్యూటిఫికేషన్, పరిసర ప్రాంతాలలో ఆహ్లాదం, ఆనందాన్ని పంచే పూల మొక్కలు, వాకర్స్, పర్యాటకులకు వీలుగా బెంచీలు తదితర బ్యూటిఫికేషన్ పనులు చేపట్టి పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. చెరువు స్థలాలు కబ్జాలు కాకుండా 1170 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. మొదటి దశలో భాగంగా సుమారు రూ.100 కోట్లతో హెచ్‌ఎండీఏ 20 చెరువులను అభివృద్ధి చేసింది. సర్కారు స్ఫూర్తిని అందుకున్న కార్పొరేట్, నిర్మాణ రంగ సంస్థలు సామాజిక బాధ్యతగా 50 చెరువులను దత్తత తీసుకున్నాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒకే రోజు ఒప్పందం చేసుకోవడం విశేషం.
చెరువుల పునరుద్ధరణ ఇలా..
-చెరువుల పూడికతీత, కాలువ పునరుద్ధరణ, కట్ట, అలుగు, తూములకు మరమ్మతులు, సీఎం అండ్ సీడీ పనులకు మరమ్మతులు
-చెరువుకట్ట నుంచి నీటి ఊటలను తగ్గించడం ద్వారా నేల నీటిని నిలుపుకునే సామర్థ్యం పెంపు
-పూడికతీత ద్వారా భూగర్భ జలాల పెరుగుదల. తాగునీటి సౌకర్యం మెరుగు
-పూడికతీత కారణంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం భూగర్భ జలంలో ఫ్లోరైడ్ శాతం గణనీయంగా తగ్గినట్లు నివేదికలో తేలింది.
-మురుగునీటిని మళ్లించడంతో ఆయా చెరువుల్లోకి వర్షపు నీరు, వరద నీరు మాత్రమే చేరుతున్నది.
-ప్రతి చెరువులో అలుగు,తూమును ఏర్పాటు చేశారు. దీంతో చెరువు చుట్టు పక్కన ఉన్న కాలనీలను ముంపు నుంచి నియంత్రించడం జరుగుతుంది.
-చెరువు కట్ట ఆధునీకరణ, తూము మరమ్మతు పనులతో వర్షాకాలంలో చెరువు కట్టలు తెగకుండా నీరు నిండుతాయి. లోతట్టు ప్రాంతాలకు నీటి ముంపు నుంచి ఉపశమనం కలుగుతుంది.
-ఫెన్సింగ్ పనులు చేపట్టడంతో చెరువులను కబ్జాల నుంచి కాపాడవచ్చు
-సుందరీకరణ పనులతో కాలనీ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలుగుతుంది.
-2014-15 నుంచి 2023-24 సంవత్సరం వరకు చేపట్టిన పనుల వివరాలు
మంజూరైన నిధులు -రూ.345.81కోట్లు
పనుల సంఖ్య- 355
ఇప్పటి వరకు ఖర్చు చేసినవి -రూ.108.29కోట్లు
పూర్తయిన పనులు- 191
పురోగతిలో ఉన్న పనులు -144
స్థానిక, కోర్టు సమస్యలతో నిలిచిపోయిన పనులు- 20

మిషన్ కాకతీయలో..
మంజూరైన నిధులు – రూ.282.63 కోట్లు
పనుల సంఖ్య- 19
మొత్తం ఖర్చు -రూ.132.21 కోట్లు
పూర్తయిన పనులు- 8
పురోగతిలో ఉన్న పనులు- 11
చారిత్రక చెరువులకు నయాలుక్
చెరువుల పరిరక్షణ, సుందరీకరణే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందుకోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ప్రత్యేకంగా పనిచేస్తున్నది. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నిజాం నవాబులు పాలించిన సమయంలో నగరాన్ని ముత్యాల నగరంగా, లేక్ సిటీగా పిలిచే వారు. అలాంటి నగరంలో ఇప్పటికీ ముత్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నా, చెరువులు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో కబ్జాలకు గురై కనుమరుగైపోయిన పరిస్థితి. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం గ్రేటర్ చుట్టూ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులకు పూర్వ వైభవాన్నే కాదు… వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నది. మొదటి దశలో భాగంగా గత ఏడాది 20 చెరువులను అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.100 కోట్లను హెచ్‌ఎండీఏ ఖర్చు చేసింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మరిన్ని చెరువుల పరిరక్షణ, సుందరీకరణపై ప్రత్యేక ప్రణాళికను హెచ్‌ఎండీఏ అధికారులు రూపొందించారు. అదేవిధంగా సుందరీకరణకు నిధుల కొరత సమస్య లేకుండా చేయడంతో పాటు కార్పొరేట్ కంపెనీలకు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్( సీఎస్‌ఆర్) నిధులతో చెరువుల సుందరీకరణలో పాలు పంచుకునేలా చేయనున్నారు.