
నాటినుంచి తెలుగు తెరపై మన యాసను పలికిస్తున్న విలక్షణ నటుడు ఆయన. సమైక్య పాలనలో మన యాసను ఈసడించుకొన్న తరుణంలో ఏదో ఒక పాత్ర ద్వారా మన యాసను పలికించిన రచయిత ఆయన..తెలంగాణ యాస మాట్లాడుతూ..రాస్తూ తెరమీద మనయాసకు పట్టం కట్టిన సినీ నటుడు తనికెళ్ల భరణి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తన మనసులోని మాటలు పంచుకొన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ యాసకు స్వర్ణయుగం వచ్చిందని చెప్తున్నారు. భాషను, యాస, కవులు, కళాకారులను ఆదరించడంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాయలు అని కీర్తించారు. మరి సమైక్య పాలనలో వెక్కిరించబడ్డ తెలంగాణ యాసకు స్వరాష్ట్రంలో ఎలాంటి ఆదరణ లభించిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
మా నాన్న ఉపాధి కోసం 1934లో హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్ సమీప టెంకపేటలో ఓ పిల్లవాడికి చదువులు చెప్పేవారు. స్వదేశీ ఖాదీ భండార్, రైల్వేలో పనిచేశారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాన. దీంతో సహజంగానే తెలంగాణ యాస అబ్బింది. ఇంట్లో ఆంధ్ర యాసే ఉండేది. బయటికి వస్తే మాత్రం ‘క్యారే..’ అంటూ ఉర్దూ భాష, తెలంగాణ యాస కలగలిపి మాట్లాడేవాణ్ని. నా మొదటి నాటిక ‘గ్రహణం పట్టిన రాత్రి’ తెలంగాణ యాసలో రాశాను. ఓ కవి సమ్మేళనంలో తెలంగాణ యాసలోనే కవిత వినిపించాను.
సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ యాస వెక్కిరింతలకు గురవడం నేను చూశాను. నా మనసు చివుక్కుమంది. కారణం ఏమిటంటే.. తెలంగాణ యాస రాసేవాడికి రాదు, తీసేవాడికి రాదు, చేసేవాడికి అసలే రాదు. అవగాహన లేకుండా శ్రీకాకుళం మాండలికంలో మాట్లాడినా జోక్‌లానే ఉంటుంది. నేను వేషం వేస్తే పక్కాగా తెలంగాణ యాసలోనే డైలాగ్ చెప్పేవాణ్ని.
మన యాసలో డైలాగ్ విని దర్శకుడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి
‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’ సినిమాకు మాటలు రాసే అవకాశం నాకు దక్కింది. హీరోయిన్‌కు శ్రీకాకుళం యాస పెట్టాలని అనుకున్నారు. అయితే నేను తెలంగాణ అయితేనే రాస్తాను అని చెప్పాను. అప్పుడు దర్శకుడు వై.నాగేశ్వరరావు ‘తెలంగాణలో మాట్లాడితే పాత్రకు సీరియస్‌నెస్ రాదు కదా’ అన్నారు. ‘భావోద్వేగాలు అన్ని భాషలకూ సమానమే’ అని చెప్పి ఒప్పించాను. కోర్టు సీన్‌లో నాయిక ‘గిట్లాంటి బద్మాష్ గాళ్లు రామాయణం కాలంలో ఉంటే సీతను కూడా బద్నాం చేసేవాళ్లు’ అంటూ డైలాగ్ చెబుతుంటే దర్శకుడి కళ్లలో నీళ్లు తిరిగాయి.
‘శివ’లో నానాజీగా
‘శివ’ సినిమాకు నేనే మాటలు రాశాను. ఆ చిత్రంలో నానాజీ పాత్రకు నటుడు దొరకడం కష్టమైంది. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నన్నే నటించమన్నాడు. నానాజీ పక్కా పాతబస్తీ యాదవ్. వదులు లాల్చీ, పైజమా, పెద్ద బొట్టు, మెడలో నల్లతాడుతో పాన్ నముల్తూ వెళ్లి పలకరిస్తే వర్మ ‘మీరేనా’ అంటూ ఆశ్చర్యపోయాడు. ‘దిసీస్ మై నానాజీ’ అన్నాడు. ‘శివ దోస్తులతోని గల్సి హన్మకొండ పెండ్లికి పోతున్నడట’ వంటి డైలాగ్స్ నాకు బాగా పేరు తీసుకొచ్చాయి. తెలంగాణ యాసలో నేను రాసిన ‘శబ్బాష్ రా శంకరా’ శివస్తుతి ఎందరినో ఆకట్టుకుంది.
సక్సెస్ ఫార్ములా
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సినిమాల్లో తెలంగాణ భాష సక్సెస్ ఫార్ములా అయ్యింది. ఒకప్పుడు వివక్షకు గురైన యాస ఇప్పుడు గర్వంగా తలెత్తుకున్నది. కేసీఆర్ పాలనలో తెలంగాణ కళారూపాలకు అనూహ్యమైన స్వేచ్ఛ లభిస్తున్నది. కవులు, కళాకారులు, రచయితలకు స్వర్ణయుగం వచ్చింది. ఒక భావ స్వేచ్ఛ దొరికింది. లోలోపలి సంకెళ్లు పటపటా తెగిపోయాయి. చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. దక్షిణ కాశీగా పిలిచే కందూరు దేవాలయానికి పదీ పదిహేనుసార్లు వెళ్లాను. దారిలో అనేక గ్రామాల్ని చూశాను. ఎన్నడూలేనంత పచ్చదనం.
తెలంగాణ అంతా గంగాజలం
సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఎటు చూసినా జల సంపదే. నా చిన్నప్పుడు మోటబావిలో ఈతకొట్టడం అంటే ఒక కల. కానీ మోట లేదు, బావీ లేదు. ఇప్పుడు ఆ కల సాకారమైంది. ఊళ్లల్లో మేడలు వెలుస్తున్నాయి. కార్లు కనిపిస్తున్నాయి. పొలాల ధరలు పెరిగాయి. ఇదంతా చూస్తుంటే.. ఏదో మ్యాజిక్ జరిగినట్లు తెలంగాణ అభివృద్ధి చెందిందేమో అనిపిస్తున్నది. తెలంగాణ వస్తే ఆంధ్రులు ఇబ్బందులు పడతారని అపోహ పడ్డారు. కానీ అలాంటివి ఏవీ లేవు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ వాళ్లు ప్రేమిస్తే ప్రాణమిస్తారు. తేడా వచ్చినా అట్లనే ఉంటది.
తెలంగాణ రాయలు కేసీఆర్
శ్రీకృష్ణదేవరాయలు పాతికేండ్లు పాలించాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనిపించుకున్నాడు. ఒకవైపు యుద్ధాలు చేస్తూనే కళలను పోషించాడు. కేసీఆర్ కూడా ప్రజారంజక పాలన అందిస్తూనే కళలను ఆదరిస్తున్నారు. రాజు బాగుంటే అన్నీ బాగుంటాయి అన్నట్లు.. కేసీఆర్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నది. బంగారు తెలంగాణ త్వరలో వజ్రాల తెలంగాణ కావాలని కోరుకుంటున్నా.