mt_logo

సింగ‌రేణి కార్మికుల‌కు భారీ బోనస్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న వేళ నేడు “సంక్షేమ సంబురాల దినోత్సవం” రోజున ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర్ రావు గారు మంచిర్యాల జిల్లా పర్యటన చేపట్టారు.. అనంతరం పలు నూతన సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా  మంచిర్యాల్ బహిరంగ సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ గారు ప్రసంగించారు.  సంక్షేమంలో, వ్యవసాయంలో అన్నింటిలోనూ తెలంగాణ దూసుకుపోతున్నదని అన్నారు. సింగరేణిది 134 ఏండ్ల చరిత్ర. వాస్తవానికి సింగరేణి మన సొంత ఆస్తి. ఆనాటి నిజాం కాలంలో మొదలైన సంస్థ. వేలాది మందికి అన్నం పెట్టి సాదినటువంటి సంస్థ సింగరేణి. ఈ సింగరేణిని కాంగ్రెస్ పార్టీ హయాంలో సర్వనాశనం చేసారన్నారు. పరిపాలన చేతకాక, ఆగమాగం పట్టిచ్చి కేంద్రం ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి, అప్పులు కట్టలేక మన సొంత కంపెనీని 49 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఆ విధంగా సింగరేణిని భ్రష్టు పట్టించారు. కార్మికులు హక్కుల కోసం నినదిస్తే అణచివేశారు. చాలా భయంకరంగా రాచి రంపాన పెట్టారన్నారు. 

2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు కార్మికులకు ఇచ్చే బోనస కేవలం 18 శాతం. యాభై  అరవై కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచేది. తెలంగాన వచ్చినాక సింగరేణి నడక, శైలి మారిందన్నారు. 2014 లో సింగరేణి టర్నోవర్ 11 వేల కోట్ల రూపాయలు  మాత్రమే ఉండేది, నేడు తెలంగాణ బిడ్డల ఆధ్వర్యంలో సింగరేణి టర్నోవర్ ను 33 వేల కోట్ల రూపాయలకు పెంచుకున్నామని తెలిపారు. సింగరేణికి గతంలో కేవలం మూడు వందలు నాలుగు వందల కోట్ల రూపాయల లాభాలు మాత్రమే వచ్చేవి. అప్పుడు కార్మికులకు బోనస్ చాలా తక్కువగా వచ్చేది. ఈ సంవత్సరం 2,184 కోట్ల రూపాయల లాభం వచ్చింది, గతంలో దసరాకు కార్మికులకు యాభై అరవై కోట్ల రూపాయల బోనస్ వచ్చేది. వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు మనం పంచబోతున్న బోనస్ 700 కోట్ల రూపాయలు. అంటే ఆనాడు కంపెనీకి వచ్చే లాభం కంటే డబుల్ త్రిబుల్ బోనస్ గా కార్మికులకు ఇస్తున్నామని గుర్తు చేసారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు పది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కల్పించిన ఉద్యోగాలు కేవలం 6,453. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక డిపెండెంట్ హక్కును తిరిగి పునరుద్ధరించి, 19,463 ఉద్యోగాలు సింగరేణిలో మనం కల్పించాం. అదే విధంగా 15,256 డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేసారు. గతంలో సింగరేణిలో కార్మికులు చనిపోతే 1 లక్ష రూపాయలు పరిహారంగా అందించి చేతులు దులుపుకున్నద,. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి వారి కుటుంబాలను ఆదుకుంటున్నదని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుండా రిటైర్మెంట్ తీసుకున్న వారికి 25 లక్షల రూపాయలు ఇచ్చే వసతి కల్పించాం. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ నిండా ముంచడానికి కంకణం కట్టుకుంది, మోడీ గారు ఇక్కడకొచ్చి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయమని చెప్పి, ఆ తర్వాత బెంగుళూరు పోయి టెండర్లు పిలిచిన విషయం మీ అందరికీ తెలిసిందే అని గుర్తు చేసారు. “చోటే మియాతో చోటే మియా.. బడే మియా సుభాన్ అల్లా “ అన్నట్లు సగం కాంగ్రెస్, సగం బీజేపీ సింగరేణిని చాలా ఘోర స్థితికి దిగజార్చే ప్రయత్నాలకు పోతున్నదన్నారు.