mt_logo

అడవి పల్లె నేర్పిన అడుగులివి

By: – అరుణ పప్పు

‘అడవి ఒడిలో పెరిగాను. ఆదివాసుల నుంచి మాట్లాడే పద్ధతి నేర్చుకున్నాను. ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సరళంగా చెప్పడం తెలిసిందక్కడే…’అంటున్నారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్. పౌరహక్కుల సంఘాల్లో పనిచేసినా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పాఠాలు చెప్పినా, తెలంగాణ ఉద్యమంలో ఉపన్యాసమై సాగినా ‘అదంతా మా ఊరు నేర్పిన తీరే’ అంటూ గుర్తు చేసుకున్నారాయన. మూడూళ్లలో పెరిగి మూడు భిన్నమైన సంస్కృతుల గురించి వివరిస్తున్న కోదండరామ్ చెబుతున్న విశేషాలు ఆయన మాటల్లోనే….

మా నాన్న సమైక్యవాది

అవును, మీరు చదువుతున్నది నిజమే. మా నాన్న సమైక్యవాది. ‘ఆంధ్రావాళ్లు ఎక్కడున్నా కష్టపడతారు. చొరవ చేస్తారు. వాళ్లనుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలున్నాయి’ అనేవాడు. ‘విడిపోయి చిన్న రాష్ట్రమైతే దాన్ని నిభాయించుకునే శక్తి మనకు లేదేమో’ అని అనుమానపడేవాడు. ‘వాళ్ల కష్టపడే తత్వం, చొరవ అన్నీ మంచివేగాని మనమీద పెత్తనం చేస్తే ఎట్లా’ అని నేనంటే ‘అవునా, అలాగైతే సరే…’ అనేవాడాయన. తొంభయ్యేళ్ల వయసులో చనిపోయే ముందు వరకూ బొంగరంలా తిరుగుతూ పనిచేస్తూనే ఉండేవాడు.

మా సొంతూరు అంటే రెండూళ్ల గురించి చెప్పాలి. మొదటిది కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరు అనే గ్రామం. మా తాతముత్తాతలదా ఊరే. మా నాన్న (జనార్దనరెడ్డి) వాళ్లు ఎనిమిది మంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు. అంతమందిలో పంచుకున్నప్పుడు తగినంత భూవసతి ఏర్పడలేదాయనకు. అందువల్ల గంగ (గోదావరి) దాటి వచ్చి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఫారెస్టు కంట్రాక్టర్ల దగ్గర గుమస్తాగా చేరారు. తర్వాత వ్యాపారస్తుడిగా మారినా, మంచిర్యాల దగ్గర జోగాపురం అనే పల్లెటూళ్లో కొంత భూమి కొనుక్కుని చివరివరకూ రైతుగానే జీవించారు. అక్కడ రెండు గుడిసెలే మా నివాసం. జోగాపురం దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. అంతా కలిపి అరవై డెబ్భై ఇళ్లుండేవేమో. అడవిలో ఉండటం వల్ల ఆదివాసీ కుటుంబాలు ఎక్కువ. ఆ సంస్కృతే ప్రధానంగా కనిపించేది. వాళ్లు ఎక్కువగా అటవీ ఉత్పత్తుల సేకరణ మీదనే ఆధారపడేవారు. వ్యవసాయం తక్కువ.
సరళత్వాన్ని నేర్పింది

మా ఊరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలే లేవు. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకే తప్ప మరో మార్గం లేదు. మహా అయితే ఎడ్లబండి. మంచిర్యాల నుంచి నలభై కిలోమీటర్ల దూరం. కానీ బాట సరిగా లేకపోవడం, అడవిలో దారి తప్పిపోకుండా అడుగుతూఅడుగుతూ వెళ్లేసరికి నాలుగ్గంటల సమయం పట్టేది ప్రయాణానికి. అలాంటి ఊళ్లో మనిషి చంద్రుడి మీద కాలు పెట్టాడన్న వార్త తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి? ‘అంత దూరం ఎట్లా వెళ్తాడు మనిషి? ఇదంతా కట్టుకథలా ఉంది’ అని కొట్టిపారేశారు తప్ప నిజమని నమ్మేవాళ్లు కాదు.

ఏ విషయమైనా సూటిగా స్పష్టంగా మాట్లాడెయ్యటమే తప్ప మార్మికత, సంక్లిష్టత తెలియని వ్యక్తులు మా ఊరివాళ్లు. చెప్పొచ్చేదేమంటే ఆ ఊళ్లో పుట్టి పెరగడం వల్ల నాక్కూడా అదే లక్షణం ఒంటబట్టింది. పౌరహక్కుల సంఘాల్లో పనిచేసినా, ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పినా, ఇప్పుడు ఉద్యమంలోనైనా సరే – ఎంత పెద్ద విషయాన్నయినా అవతలివాళ్లకు అర్థమయేట్టు సరళంగా మార్చి చెప్పడం అనేది నాకు నేర్పింది జోగాపురమే. అక్కడ పెద్ద పండగ అంటే హోలీ. గులాల్ ఒక్కటీ కొనేవాళ్లం. మోదుగపూలను సేకరించి మరగబెట్టి రంగునీళ్లు తయారుచేసుకునేవాళ్లం.

మా ఇంటి ఎదురుగా ఉండే చిన్నక్క నాలుగైదు గంటల పాటు నిర్విరామంగా బతుకమ్మ పాటలు పాడేది. ‘గొట్టాలు’ అని వెదురుతో చేసినవి ఉండేవి. వాటిలో కాగితపు ఉండలు పెట్టి యువతులను గురిచూసి కొట్టేవాళ్లు యువకులు. అదొక సరదా ఆట. కేవలం బతుకమ్మల సమయంలోనే ఆడే ఆట. జోగాపురంలో వినోదమంటే వీధి భాగోతాలే. నాటకాలు, సినిమాలు మాకు తెలియవు. మాకు అన్న వరసయ్యే ఒకాయన హనుమకొండ నుంచి వస్తే మాత్రం మాకు పండగే. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడు ఆయన చూసిన సినిమా కథంతా పాటలు, ఫైట్లతో సహా పూసగుచ్చినట్టు చెప్పేవాడు. మూడు గంటల సినిమా అయితే ఈయన మూడున్నర గంటలు చెప్పేవాడు. దానికోసం ఎంతో ఎదురుచూసేవాళ్లం.

వడ్లు వద్దనేవాళ్లు

జోగాపురం దగ్గర్లోని గుట్టల్లో పుట్టే మత్తడి వాగు ప్రాణహితలో కలుస్తుంది. వర్షాకాలంలో ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చెప్పలేం. ఆదివాసులు కాకుండా ఊళ్లో ‘బారె’లు ఎక్కువ. వీళ్లు మహారాష్ట్ర నుంచి వలస వచ్చినవారు. వీళ్ల వ్యవసాయానికి మత్తడి వాగే జల వనరు. ఎక్కువగా జొన్నలు, పప్పు ధాన్యాలు నువ్వులు, పసుపు, ఆముదం పంటలు పండించేవారు. ఊళ్లో ఉన్న చెరువు పాడుబడి ఉంటే మా నాన్న దాన్ని బాగుచేయించి దానికింద తరిభూములను కొద్దిగా సాగులోకి తీసుకొచ్చారు. కాలం గడుస్తున్న కొద్దీ పొగాకు, కూరగాయలు, ఉల్లి వంటి పంటలు వచ్చాయి. కూలికింద వడ్లు ఇస్తే తీసుకునేవారే కాదు. ‘పని చేసేవాళ్లకు అవి ఆగవు…’ అంటూ జొన్నలే తీసుకునేవాళ్లు. కాలక్రమంలో మా ఊరివాళ్లు కూడా అధిక దిగుబడి వస్తుందని వరివైపే మొగ్గు చూపడం మొదలుపెట్టారు. 70ల తర్వాత భూపరిమితి చట్టాలు వచ్చినప్పుడు మా నాన్న భూములు ఊరిపరం అయ్యాయి. ఆయన దగ్గరుండి అందరికీ పట్టాలు చేయించి ఇచ్చారు. విచిత్రమేమంటే అప్పట్లో ఊరివాళ్లు కూడా జొన్నలైతే బాగా పండుతాయని మెట్ట భూములే కావాలని కోరుకున్నారు!
తేడాలెక్కువ

ముగ్గురు అక్కయ్యలు, నేను, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు వెరసి ఏడుగురు పిల్లలం మేం. మా పెదనాన్న, మేనత్త – ఊటూరులోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అందువల్ల నాకు పదేళ్ల వయసు వచ్చేవరకూ ప్రతి పండగకూ సెలవులకూ ఊటూరెళ్లిపోయేవాళ్లం. అది సంప్రదాయకమైన పల్లెటూరు. కుల వ్యవస్థ, మతాచారాలు, ఆర్థిక తారతమ్యాలు అన్నీ బలంగా ఉండేవి అక్కడ. స్పష్టంగా బైటికి తెలిసేవి కూడా. ఊటూరు – జోగాపురం మధ్యన సుమారు వంద కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. తేడాలు మాత్రం చాలా ఎక్కువ. అంత చిన్న వయసులోనూ మాకు స్పష్టంగా తెలిసేవి. మా ఊరితో పోల్చినప్పుడు ఊటూరు మనుషుల్లో వ్యవసాయంలో, వ్యవహారంలో ఆధునికత కనిపించేది. అక్కడ వైష్ణవం ఎక్కువ.

గురువులు వచ్చి సందేశాలిచ్చేవారు. వాళ్లు మడిగా వంటచేసుకుంటుంటే మాకు వింతగా అనిపించేది. పూజలు చేశాక మా పెదనాన్న, మేనత్త మమ్మల్ని ఆ గురువుల కాళ్లకు మొక్కమనేవారు. మాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మా ఊళ్లో మాకు గురువులు లేరు, కులమత భేదాల్లేవు. ఇక్కడవన్నీ ఎందుకున్నాయో మాకు అర్థమయేది కాదు. వైష్ణవాన్ని స్వీకరించిన మా మేనత్త శివాలయానికి వచ్చేదికాదు. అక్కడి ప్రసాదం ఇస్తే తినేది కాదు. ‘ఎవరైనా దేవుడే కదా. దేవుడికి మొక్కమని చెప్పింది నువ్వే కదా’ అని మేం అడిగితే ఏదో చెప్పి తప్పించుకునేది. ఊటూరు మానేరు ఒడ్డున ఉంటుంది. వర్షాకాలంలో దాన్ని దాటడం కష్టంగా ఉండేది.

పంద్రాగస్టు మనది కాదనేది

నేను 1955లో మా తాతగారింట హనుమకొండలో పుట్టాను. అది నా తల్లి వెంకటమ్మ పుట్టిల్లు. నిజాం పాలన, రజాకార్ల అకృత్యాలు, కమ్యూనిస్టుల సభలు… వీటన్నిటినీ చూసిందామె. అవే మాకు కథలుకథలుగా చెబుతుండేది. రజాకార్లు, వాళ్లను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టులు… వీళ్లిద్దరినీ వెతుకుతూ పోలీసులు ఊళ్లలోకి రావడం, ఆ క్రమంలో జరిగిన హింస – అదంతా మా అమ్మ మాకు చెప్పేది. మా చిన్నప్పుడు స్వాతంత్య్రదినోత్సవం నాడు జెండా వందనానికి పోతుంటే ‘అసలైతె మనకు పంద్రాగస్టు ఏడుంది బిడ్డా? ఇది మనదిగాదు’ అనేది మా అమ్మ.

‘అదేంటమ్మా’ అంటే ‘అవును, మనకు స్వాతంత్య్రం ఈ రోజున వచ్చిందా? పోలీస్ యాక్షన్ జరిగి నిజాం రాజ్యం పోయిన రోజున జెండావందనం చెయ్యాలి’ అనేది. మా నాన్న కొత్తగా ఏ ఊరికి పోయినా అక్కడి చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకునేవాడు. ఆరోజుల్లోనే మా ఇంటికి దినపత్రిక వచ్చేది. పుస్తకాలూ బాగానే చదివేవాడాయన. తాను తెలుసుకోవడమే కాకుండా మమ్మల్ని కూచోబెట్టుకుని అన్నీ తెలియజె ప్పేవారు. మా ఊరి నుంచి కనిపించే గుట్టల గురించి అడిగితే ‘వాటిని బాబేఝరీ గుట్టలంటారు. అక్కడే కొమురం భీమ్ నైజాము రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది…’ అంటూ చెప్పుకొచ్చాడు.

బంధువు కోసం అడవిలో వెతికా

నాన్న తునికాకు కొనడం అమ్మడం చేసేవారు. నాకు పది పన్నెండేళ్ల వయసు నుంచే నన్నూ తనతోపాటు తీసుకెళ్లేవారు. ఎక్కడికెళ్లినా కాలినడక లేదంటే సైకిల్. మా బంధువు రాజారెడ్డి అని ఒకాయన మా ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసేవాడు. ఈ అమ్మకం కేంద్రాలకు వెళ్లొస్తూ ఉన్నప్పుడు ఆయన నాకు వివిధ రకాల ప్రజలను, సమూహాలను పరిచయం చే సేవాడు. వాళ్లతో ఎలా వ్యవహరించాలో విడమరిచి చెప్పేవాడు. అతనేకాదు, మా ఊళ్లోని చాకలి మల్లయ్య, ఇంట్లో వంట చేసే పర్వతాలు – వీళ్లంతా మానవ స్వభావంలోని రకరకాల కోణాల గురించి ఆసక్తికరంగా వివరించి చెప్పేవాళ్లు. ఇప్పుడిట్లా నగరంలో, ఉద్యమంలో భాగంగా వివిధ ప్రజాసమూహాల్లో తిరుగుతున్నప్పుడు నాకు పనికొస్తున్నది మా ఊరు నాకిచ్చిన జ్ఞానమే అనిపిస్తుంది.

మాకు అప్పుడు చదువంటే ఇప్పట్లా మార్కుల గొడవ కాదు. చుట్టుపక్కల అన్ని విషయాలూ బాగా తెలియాలి అన్నదే మా తల్లిదండ్రుల ఉద్దేశం. ఒక్కసారి మాత్రం నేను మా నాన్న చేతిలో దెబ్బలు తిన్నాను. మా ఊరు అడవి మధ్యలో ఉందని చెప్పాను కదా, ఒకరోజు బంధువొకాయన వస్తే ఎందుకోగాని నేను ‘మా నాన్న ఇంట్లో లేడు’ అని చెప్పి పంపేశాను. మా నాన్న వచ్చాక నాకు దెబ్బలు పడ్డాయి. ‘అలా పంపేస్తే ఈ అడవిలో ఆయన ఎటు పోతాడు? మన ఇంటికి వచ్చినవాళ్లు సమయానికి తిండి లేక మాడిపోతే ఎట్లా’ అంటూ కేకలేసి ఆయనెక్కడున్నా వెతికి తీసుకురమ్మని పంపారు నన్ను. అడవిలో ఎక్కడని వెతకాలో అని బెంగపడుతుంటే దగ్గర్లోనే దొరికాడనుకోండి. ఆయన్ని తీసుకొచ్చి తగిన విధంగా మర్యాద చేశాకగానీ మా నాన్న శాంతించలేదు.

శనివారం కథలు

ఏకకాలంలో మూడు భిన్నమైన సంస్కృతుల మధ్యన పెరిగాను నేను. ఊటూరు సంప్రదాయబద్ధంగా ఉంటే, జోగాపురం ఆదివాసీ సంస్కృతితో ఉండేది. హైస్కూలు చదువులకని హనుమకొండకు వస్తే ఆ ఊరి తీరు మరోలా ఉండేది. అక్కడ సామాజిక, ఆర్థిక అసమానతలు అంత కొట్టొచ్చేట్టు కనిపించేవి కావు. స్కూలు చదువు, పుస్తకాలు, చుట్టుపక్కల మనుషులు అన్నీ జ్ఞానాన్ని బోధిస్తున్నట్టు, సమానత్వాన్ని చాటిచెబుతున్నట్టు ఉండేది. అక్కడ మాకు తారమ్మత్త అని ఒకామె ఉండేది. ఆవిడ శనివారం సాయంత్రం కథ చెబుతుందని ముందుగానే చుట్టుపక్కల ఇళ్లలో సమాచారం వచ్చేసేది.

రాత్రి ఏడయ్యేసరికి పిల్లాపెద్దా అంతా కలిసి ఓ ముప్ఫైమంది ఆమె చుట్టూ కూర్చునేవాళ్లం. మధ్యమధ్యలో నశ్యం పీలుస్తూ ఏకబిగిన మూడు గంటల పాటు జానపద లోకంలో విహరింపజేసేది. మా కజిన్ సుభాషిణి అని ఒకమ్మాయి నవలలు చదవడం మరొక వినోదం మాకు. ఆమె హావభావాలతో నవలలు చదువుతుంటే చుట్టూ కూర్చొని వినేవాళ్లకు ఏదో సినిమా చూస్తున్నట్టే ఉండేది. హనుమకొండలో కాళోజీ దగ్గర కూర్చుని ‘మీ భాష ఎంత బాగుందో’ అంటే ‘మామూలుగానైతే మీదీ అంతే బాగుండేది. కానీ తెలుగు సినిమాలు చూసి చదివి చెడిపోయార్రా మీరంతా’ అనేవాడాయన.

తెలంగాణ తేలిపోతే…

జోగాపురం చుట్టూ అడవి ఉండటం వల్ల చిన్నతనంలో ఖాళీ దొరికినప్పుడు చెట్ల మధ్య హాయిగా తిరిగేవాళ్లం. వాగు పెద్ద లోతుండేది కాదు. దానిలో ఈతలు కొట్టేవాళ్లం. రకరకాల పళ్లూ పువ్వులూ ఏరుకునేవాళ్లం. వర్షం పడిన తర్వాత అడవి అందం మాటల్లో చెప్పలేను. చెట్ల కొమ్మల్లోంచి సూర్యరశ్మి పడుతూ ఎన్ని రకాల వింత కాంతుల్ని సృష్టించేదో! ఎంత పచ్చదనం, ఎన్నెన్ని రంగులు… వాటిని అలానే చూసేవాళ్లం. ఇప్పుడు ఆధునికత పెరగడం వల్ల అడవి పల్చబడిపోతోంది. నేను ఏడాదిలో రెండుమూడుసార్లయినా జోగాపురం పోతుంటాను. మా తమ్ముడు రంగన్న ఊళ్లోనే ఉన్నాడు. పోశవ్వలు, ఇతరులు అక్కణ్నుంచి ఫోన్లు చేస్తూనే ఉంటారు. మా ఊరికి కొన్ని పనులు చెయ్యాలనుంది. ఈ తెలంగాణ తేలిపోతే వాటిని చేపడతాను.
ఫోటోలు : సురేశ్ రాజు, ఎండి.ముజాఫిర్

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *