mt_logo

కార్టూన్ c/o నల్లగొండ

By: మృత్యుంజయ్

కోహినూర్ వజ్రానికి చిరునామా గోల్కొండ అయినట్టే..
పొలిటికల్ కార్టూన్ ఆర్ట్‌కు కేరాఫ్ అడ్రస్.. నల్లగొండ!
ఇప్పుడు తెలుగు పత్రికల్లో ఉన్న ప్రతి పొలిటికల్ కార్టూనిస్టు
ఆ జిల్లాలో పుట్టిన వజ్రమే!
ఈ ఆర్ట్ నల్లగొండ హార్ట్‌లో ఊపిరి పోసుకోవడానికి…
ఈ వజ్రాలన్నీ అక్కడ సానదేలడానికి…
ఆ నేలలో ఏదో మహత్తు ఉండే ఉంటుంది!
ఆ సారాన్ని పట్టుకునే ప్రయత్నమే
ఈ మిక్స్ అండ్ మ్యాచ్…

దశాబ్దాలుగా ‘ఇదీ సంగతి’ పేరుతో ‘ఈనాడు’లో కార్టూన్లు గీస్తున్న శ్రీధర్ స్వస్థలం నల్లగొండ జిల్లా, జిబ్లక్ పల్లి! అలాగే ‘సాక్షి’లో శంకర్, ‘ఆంధ్రజ్యోతి’లో శేఖర్, ‘ఇండియాటుడే’లో నర్సిం, ‘నమస్తే తెలంగాణ’లో నేను (మృత్యుంజయ్) ‘వార్త’లో రవినాగ్, ‘టీవీ 9’లో అవినాష్… వీళ్లంతా నల్లగొండలో పుట్టిన కళారత్నాలే!

ఇక ఆర్టిస్టులు, క్యారికేచరిస్టులకు అయితే కొదవే లేదు. ‘ఈనాడు’లో శ్రీచంద్ర, భాస్కర్, ‘ఆంధ్రభూమి’లో నివాస్, శ్రీరాం, ‘ఆంధ్రజ్యోతి’లో కత్తుల వెంకట్, రాజు.. పత్రికల్లో పనిచేయని ఆర్టిస్టులు దత్తాత్రేయ, కూరెళ్ల శ్రీనివాస్, దేవరాయ, విజయ్, శ్రీనివాస్, గోనె లింగరాజు, పిట్టల రామచంద్రం, చిత్ర, సుదర్శన్, ఆంజనేయులు, ఏలె లక్ష్మణ్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జగమెరిగిన కళాకారుడు ఆయన. అచ్చట పూచిన చివురు కొమ్మయిన చేవ అన్నట్టు ఈ జిల్లాలో పుట్టిన పిల్లలు ఉగ్గుపాలతోటే కుంచె పట్టుకుంటున్నారు. రాజపేట ఎకలదేవి వెంక కావచ్చు… పాతకోట ‘నందు’ కావచ్చు. కొరటికల్ నుంచి కోదాడ దాకా ఏ కుగ్రామంలో చూసినా ఆర్టిస్టులే!

చెరిగిపోని సాక్ష్యం

కష్టాలు కదలికకు ప్రాణం పోస్తాయి. ఆ కదలికే కళగా రూపం దిద్దుకుంటుంది. ఆర్టిస్టులందరికీ నల్లగొండ జిల్లా జన్మస్థానం కావడం వెనక రహస్యం బహుశా ఇదేనేమో! చైనా విప్లవంకంటే ముందే రష్యా విప్లవంతో స్ఫూర్తిపొంది 1946లో భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం రావినారాయణరెడ్డి సారథ్యంలో రైతాంగ సాయుధ పోరాటానికి నల్లగొండ వేదిక అయింది. తర్వాత నక్సల్‌బరీ ఉద్యమానికీ ఊతమిచ్చింది. వినోభా బావే భూదానోద్యమంలో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ చరిత్రకు చెరిగిపోని సాక్ష్యంగా నిలిచింది నల్లగొండ! బౌద్ధమతం విస్తరణకు స్ఫూర్తిగా నిలిచిన నలంద విశ్వవిద్యాలయాన్ని పొదువుకుంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆవాసమైంది. కనీసం కాలేజీ చదువైనా లేని ఎవరిని కదిపినా రాజకీయం భోదిస్తారు. వాళ్లంతా కమ్యూనిజం చదువుకోక పోవచ్చు కానీ ఒంటబట్టిన ఆ సారాన్ని ఆచరణలో చూపిస్తారు. ఇంతటి రాజకీయ చైతన్యం ఉన్న ఈ జిల్లా.. కళలకు ప్రేరణగా నిలవడం సహజమే కదా!

అపర బ్రహ్మలు.. ఈ గడ్డవారసులు

అందుకే మాటలు పాటలయ్యాయి.. విప్లవగీతాలుగా వ్యాప్తి చెందాయి. ఆలోచనలు గీతలయ్యాయి… బొమ్మలుగా ప్రాణం పోసుకున్నాయి. పరిస్థితుల మీద అసహనం వ్యంగ్యం అయింది. అది అస్త్రంగా మారి కార్టూన్లు పుట్టాయి. నిస్సహాయత క్యారికేచర్లుగా రూపుదిద్దుకుంది. అట్లా ఈ గడ్డవారసులు వీటి బ్రహ్మలుగా అవతారమెత్తారు. జీవితాల్లో, ప్రపంచంలో, రాజకీయాల్లో జరిగే వెయ్యిన్నొక్క కోణాలను ఈ కార్టూనిస్టులు నిత్యం నేరో కార్నర్‌లో చూపెడుతున్నారు. తెలుగు పొలిటికల్ కార్టూనుకు ఒక రూపాన్ని, శైలిని క్రియేట్ చేసిన ఘనత ఈ కార్టునిస్టులదే!

సిరాలేని పాళి

ఎవరైనా తెలుగు రాజకీయ కార్టూన్ మీద పరిశోధనకు దిగి… 90వదశకం నుంచి ఇప్పటివరకు గనుక తెలుగు పత్రికలను తిరగేస్తే… సమస్తం నల్లగొండే! నల్లగొండలేని తెలుగు పొలిటికల్ కార్టూన్ సిరాలేని పాళి. ఒకరిద్దరు మినహా కార్టూనిస్టులుగా, ఆర్టిస్టులుగా స్థిరపడ్డవాళ్లంతా చేనేత, వడ్రంగి, యాదవ, కంసాలి, గౌడ ఆర్టిజాన్ కులస్థులే. కళలకు సంబంధించి కులవృత్తుల నేపథ్యం వల్ల ఆర్ట్ – వేదన, అణచివేత, స్ట్రగుల్‌తో వచ్చిన హ్యూమర్ వీళ్లకు జన్మతః అబ్బింది. వ్యంగ్యం, వెటకారం, వెక్కిరింత, వేళాకోళం.. అన్నీ వకారాలే.. వక్రగీతలే! కొంటెబొమ్మల కళాకారుల కొలువు.. హ్యూమర్ ఖిల్లా.. నల్లగొండ జిల్లా! నాణ్యమైన వస్తువుకు ఐఎస్‌ఐ, అగ్‌మార్క్ ముద్దర వున్నట్టే ప్రతిభావంతులైన కార్టూనిస్టులకు నల్లగొండ క్వాలిటీ ట్యాగ్ అయింది. వీళ్లలో తొంభైతొమ్మిదిశాతం లోయర్ మిడిల్‌క్లాస్ వాళ్లే.

నల్లగొండ నుంచి నల్లకుంటకు…

పొలిటికల్ కార్టూనిస్టులు డిగ్రీలు, పీజీలు చేసినా.. చాలామంది ఆర్టిస్టులు మాత్రం సైన్ బోర్డులతో కెరీర్ మొదలుపెట్టిన స్కూల్ డ్రాపవుట్లు. ఆ రూటు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ వీళ్లలో పుష్కలం. మిడిల్‌క్లాస్, అప్పర్ మిడిల్‌క్లాస్ వాళ్లు తమ పిల్లల్ని ముందుగానే డాక్టర్లో, ఇంజనీర్లో, కంప్యూటర్ విజార్డ్స్‌గానో ప్రోగ్రామ్ చేస్తారు. కాబట్టి ఆ పిల్లల్లో ఆర్ట్ అరకొరగా ఉన్నా అది చిన్నప్పుడే చచ్చిపోతుంది. పేదకుటుంబ నేపథ్యం వల్ల అంతంత మాత్రం చదువుతో సరిపెట్టి ఇంగ్లీష్ బొత్తిగారాని కమర్షియల్ ఆర్టిస్టులు పొట్ట, డ్రాయింగ్ మెటీరియల్ ఉన్న పెట్టె చేతపట్టుకొని నల్లగొండ నుంచి నల్లకుంటకు చేరిన వాళ్లున్నారు. అత్యంత సహజమైన ప్రతిభ వీళ్లది. హైదరాబాద్ నడిబొడ్డు..ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఆకాశాన్ని తాకేట్టుగా నిలబడ్డ దానవీరశూర కర్ణ, మంగమ్మగారి మనవడు, సింహాసనం సిన్మా కటౌట్లు గీసి నల్లగొండ ఖ్యాతిని కళాసింహాసనం మీద అధిష్టించిన కళాకారులు నాకు తెలుసు!

హైదరాబాద్ ఓ వరం..

విజయవాడ కేంద్రంగా ఉన్న తెలుగు పత్రికలన్నీ 1970 తర్వాత హైదరాబాద్‌కి తరలిరావడం నల్లగొండ కార్టూనిస్టులకు వరంగా మారింది. హైదరాబాద్‌కి నల్లగొండ జిల్లా కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉండడం… నల్లగొండ జిల్లా విద్యార్థులందరికి ఉస్మానియా యూనివర్శిటీ ఎడ్యుకేషన్ అడ్డాగా ఉండడం బాగా కలిసొచ్చింది. అంతా కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పాటు చేసిన ప్రయత్నమేమీ కాదిది. ఎవరికి వారే సొంతంగా బొమ్మలేయడం నేర్చుకున్నారు. కార్టూనిస్టులుగా స్థిరపడ్డారు. పొలిటికల్ కార్టూన్ అనే కుంచెతో తమ కళకు వన్నెలద్దుతున్నారు. తమ కార్టూన్లతో నేతలు విలవిల్లాడేట్టు చేస్తున్నారు. అధికారం.. ప్రతిపక్షం.. ఏ వర్గమైనా… ఎంత కొమ్ములు తిరిగిన నేతైనా కావచ్చు… డోంట్‌కేర్! ఎన్టీఆరే కాదు ఆయన అల్లుడైనా సరే.. వైఎస్సార్ కాదు ఆయన కొడుకైనా సరే… నల్లగొండ కార్టూనిస్టుల కొంటె గీతల్లో బందీలు కావల్సిందే! మనసు పొరల్లో మండే నిప్పురవ్వల సీరియస్ రేఖలకు హాస్యప్రియత్వం అద్ది ప్రింట్ చేస్తే పాఠకుడు పగలబడి నవ్వాల్సిందే… తీక్షణంగా ఆలోచించాల్సిందే! ఇది నల్లగొండ స్టయిల్ ఆఫ్ ఆర్ట్! బహుశా నల్ల మిరియాల దినుసులు ఇక్కడెక్కువ పండుతాయేమో.. అందుకే ఆ కారం వీళ్లలో చమత్కారంగా వంటబట్టినట్టుంది!

నల్లగొండ నుంచి ‘నాకీహీస్ట్’ దాకా..

బెల్జియంలోని ‘నాకీహీస్ట్’లో ప్రతియేటా ప్రపంచ కార్టూన్ పోటీలు జరుగుతాయి. ఆ పోటీల్లో గెలుపొందడం మాట అటుంచి కనీసం వాళ్ల క్యాటలాగ్‌లో కార్టూన్ ప్రచురితమవడం మూడు చెరువుల ఫ్లోరైడ్ నీళ్లు తాగినంత కష్టం! అలాంటిది మిర్యాలగూడకు చెందిన భూక్యా శ్రీనివాస్, బూరుగు గోపీ, ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ కార్టూన్లు ఆ క్యాటలాగ్‌లో అచ్చయ్యాయి. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం!

మసిబారిన గోడలే కాన్వాస్

నా విషయానికి వస్తే.. మాది భూదాన్ పోచంపల్లి. వినోభా బావే భూదానోద్యమ నేపథ్యం. అమ్మానాన్న చేనేత కళాకారులు కావడంవల్ల ఆర్ట్‌తోపాటు సామాజిక, రాజకీయ అంశాలపట్ల ఆసక్తి పెరిగి క్రమంగా రాజకీయ కార్టూనిస్టునయ్యాను. మా నాయిన చిలువేరు రామలింగం ఇక్కత్ (నేత) కళాకారుడు. చేనేతపై మహాత్మాగాంధీ మొదలు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ వరకు అందరి పోట్రైట్లను నేశాడు. మా నాయిన ఇక్కత్ కళను చూడడం కోసం ప్రపంచ దేశాల నుంచి వచ్చే టెక్స్‌టైల్ స్టూడెంట్స్‌తో మా ఇల్లు కిక్కిరిసి ఉండేది. అందరి చేతుల్లో స్కెచ్ బుక్కులు, పెన్సిళ్లు రంగులు చూసిన నాకు బొమ్మలంటే ఆసక్తి కలిగింది. దానికి తోడు మా ఇంటికొచ్చే ఈనాడు, ఉదయం పేపర్లలోని కార్టూన్లు నన్ను రాజకీయ కార్టూన్లు గీసేవైపు మళ్లించాయి. కట్టెల పొయ్యి మీద మా అమ్మ వంట చేస్తే మసిబారిన ఆ గోడలే నా కాన్వాసు. ఆ గోడల మీద చాక్ పీసులతో బొమ్మల ప్రాక్టీసు మొదలైంది అక్కడే. 2003 సంవత్సరంలో నేను ఆంధ్రభూమిలో ‘హైదరాబాదుడు’ అంటూ గీసిన కార్టూను అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ రాజశేఖరడ్డి అసెంబ్లీలో ‘అధ్యక్షా.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి!’అంటూ ఆ కార్టూన్ని ఎత్తిచూపాడు. అలాగే నా కార్టూన్లు ఇరాన్, ఇటలీ, చైనా, రొమేనియా, బ్రెజిల్ దేశాల్లో ప్రదర్శితమవడంతోపాటు నేను గీసిన ‘ఆయాన్‌రాండ్’ క్యారికేచర్‌ను అమెరికన్ నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ కొనుగోలు చేసి తమ సావనీర్‌లో అచ్చేసుకుంది. పదేళ్లు ఆంధ్రభూమిలో పొలిటికల్ కార్టూనిస్టుగా, మూడేళ్లు టీవీ5లో యానిమేషన్ డైరెక్టర్‌గా పనిచేశాక ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్ర సాధనలక్ష్యంతో ముందుకొచ్చిన ఉద్యమ పత్రిక ‘నమస్తే తెలంగాణ’లో కార్టూనిస్టుగా పనిచేయడం గర్వంగా ఉంది. నా కార్టూన్లు నైలూ నది దాటినా, నార్త్ కరోలినా చేరుకున్నా నా బొమ్మల ప్రాక్టీస్‌కు పునాది నల్లగొండజిల్లా మా ఊళ్లోని మా వంటగది మసిబారిన గోడలే!

మృత్యుంజయ్

కల్చర్ ఎక్కడిది.. ఉన్నదల్లా అగ్రికల్చరే

నల్లగొండలో ఆర్టిస్టులు తయారు కాలేదు. పుట్టారు. ఎక్కడైతే ఉద్యమాలు, పోరాట చరిత్ర, ఫోక్ కల్చర్ ఉంటుందో అక్కడ సృజనాత్మకత వెల్లి విరుస్తుంది. ఇది సివిలైజేషన్ కంటిన్యుటీ. దీనికి నల్లగొండ పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్! భాష వచ్చాక గ్రామర్ నేర్చుకున్నట్టే పుట్టుకతో వచ్చిన కళకు చదివి, చూసి నేర్చుకునే ప్రాథమిక మెళకువలు తోడైనప్పుడు పదును పెరుగుతుంది. ఫైనార్ట్స్ కాలేజీల్లాగే పొలిటికల్ కార్టూనింగ్‌కు ఎక్కడా కాలేజీలు లేవు. సొంతంగా చదివి, చూసి ఎవరికి వాళ్లే పొలిటికల్ కార్టూనిస్టులుగా తయారై స్థిరపడ్డారు. నల్లగొండ జానపద సంస్కృతి చూసి ముగ్ధుడై ఓ ఆంధ్ర మిత్రుడు నాతో అన్నమాటలు.. ‘మా దగ్గర కల్చర్ ఎక్కడిది గురూ.. ఉన్నదల్లా అగ్రికల్చరే!’

-ఏలె లక్ష్మణ్, ఆర్టిస్టు (కదిరేని గూడెం)

ఆ మట్టి గొప్పదనం

ఎమ్జర్జెన్సీ చీకటి రోజులకు ముందు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో నల్లగొండ ఒక ఉద్విగ్న వాతావరణాన్ని అణువణువున నింపుకొని ఉండేది. మండేసూర్యుడితో పాటు ఎంతోమంది ఉద్యమ సూర్యుళ్లు, అణగారిన బతుకుల్లో వెలుగు నింపే వైపు యువతను ఆకర్షిస్తున్న రోజులు. అలాంటి వాతావరణం అన్ని బడుల్లో, కాలేజీల్లో, ఊళ్ళల్లో, జిల్లాల్లో, మొత్తం రాష్ట్రంలో విద్యార్థుల్ని, మేధావుల్ని, ఉపాధ్యాయుల్ని, ఉద్యోగస్తుల్ని, కళాకారుల్ని, కూలీనాలీ చేసుకునే పేదల్ని తన తీసుకెళ్తున్న దశలో బతుకు రాజకీయాలు, ఆరోగ్యకరమైన సాహిత్యం, పోరాటాన్ని నేర్పే కళలు అబ్బకుండా ఎవరాపగలిగారు? పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ జిల్లా పిల్లలమైన మాకు పిజ్జా, బర్గర్లు, పల్సర్ల చదువులు కాక మాగ్జింగోర్కీ ‘అమ్మ’ దగ్గర నుంచి శ్రీశ్రీ, చలం, కొకు, ఆరుద్ర, విరసం కవులు, దిగంబర కవులు, ఇంకా ఆ తోవలో వచ్చిన అందర్నీ, తరగతి పుస్తకాలతో పాటూ చదువుకునే అవకాశం దొరికింది. చదువు, సాహిత్యమే కాక సత్యజిత్‌రే, శ్యాంబెనగల్, మృణాళ్‌సేన్, గౌతం ఘోష్, చార్లీ చాప్లిన్‌లాంటి గొప్ప మేధావి దర్శకుల సమాంతర సినిమాలూ చూడగలిగాం. ఈ వాతావరణమంతా ఇప్పుడే విద్యార్థికి దరిదాపుల్లో కూడా ఉండదు. ‘సుదర్శన్’సార్ దగ్గర బ్రష్షు పట్టడం నేర్చుకుని, మంచిని, చెడును కచ్చితంగా చూడగలిగే చూపునిచ్చిన రాజకీయావగాహనతో ‘పొలిటికల్ కార్టూన్’రంగంలో నిలదొక్కుకోగలిగాను. ఒక జాతీయ పత్రిక పాఠకుల్ని మెప్పించడం సులువు కాదు. నాతోపాటు, నా తర్వాత కూడా వచ్చిన చాలామంది, ఆర్టిస్టులు, కార్టూనిస్టులు, జర్నలిస్టులకు ఆ మట్టి, ఆ గాలీ, ఆ నీళ్ళు, అక్కడి చరిత్ర, ఆ సార్ల వారసత్వం, కష్టపడి, మెప్పించి సాధించుకునేతత్వం వద్దన్నా స్పష్టతను, శాస్త్రీయతను, నాణ్యతతోపాటు ప్రశ్నించే ‘దమ్ము’ను నేర్పుతాయంటే అబద్ధం కాదు. ఒక పొలిటికల్ కామెం కార్టూనిస్టు కావడానికి ఇలాంటి నేపథ్యం ఉండాలని రూలేం లేదు. కానీ ఉందని, ఉండడం వల్ల అందులో ఉన్న క్వాలిటీ, క్లారిటీ గుర్తించబడిందని చెప్పడమే.

– నర్సిం, ఇండియాటుడే కార్టూనిస్టు (పెద్దవూర)


ఆసక్తే ఆర్టిస్టుగా మలిచింది

మా నాయిన చొల్లేటి రామాచారి. వడ్రంగి. చుట్టుపక్కల పది గ్రామాలకు ఆయనే వైద్యుడు. కళాకారులను పోగుచేసి యక్షగానాలు చేయించేవాడు. వాటికి కావాల్సిన ఆహార్యాన్ని, కిరీటాలను, గదలను ఆయనే తయారు చేసేవాడు. ఇంట్లో రోజూ పద్యాలు పారుతుండేవి. దానికితోడు చందమామ కథల పుస్తకంలోని బొమ్మలూ ముచ్చట గొలిపేవి. అట్లా సాహిత్యం, డ్రాయింగ్ పట్ల పెరిగిన ఆసక్తి, ఇష్టం నన్ను ఆర్టిస్టుగా మలిచింది. సైన్ బోర్డులు, లోగోలు, బుక్ కవర్ డిజైన్లు, బ్యానర్లు రాస్తుంటే చూసినవాళ్లు ప్రోత్సహించారు. అదీగాక వడ్రంగి వృత్తి కూడా నేను ఆర్టిస్టుగా నిలదొక్కుకునేలా చేసింది. పత్రికల్లో పనిచేయాలనే తపన నన్ను హైదరాబాద్‌కి రప్పించింది. ఈ 18ఏళ్ల నా కెరీర్‌లో సొంతలైన్ కోసం ఆర్టిస్టుగా ఎన్నో తంటాలు పడ్డాను. పడుతున్నాను కూడా. ఆర్టిస్టుగా నన్నీ స్థాయికి తీసుకొచ్చిన నా నల్లగొండను మరవలేను.

– నివాస్, ఆంధ్రభూమి ఆర్టిస్ట్ (అప్పాజిపేట)

శంకరభాష్యం

మాది నాగిడ్డిపల్లి. నాన్న వృత్తిరీత్యా కరెంట్ లైన్‌మన్. రోజూ మా ఊర్లో ఏదో ఒక మూల సభ జరుగుతుండేది. ఏ గోడమీదనో నక్సలైట్ ఉద్యమ పోస్టర్ కనిపించేది. చౌరస్తాలో ధర్నానో, నిరసననో తారసపడేది. అలా తెలంగాణ సాయుధ పోరాటం గురించి విన్న. చిత్త ప్రసాద్, మోహన్ పోస్టర్లు, సునీల్ జానా ఫోటోలు చూసినా రోమాలు నిక్కబొడుచుకునేవి. అలాంటి చైతన్యం నుంచే బొమ్మలేయాలన్న తపన పుట్టింది. చిన్నప్పట్నుంచే బొమ్మలు వేస్తున్నా. టెన్త్‌క్లాస్ నుంచి మాత్రం కార్టూన్లు వేయాలనే కోరిక కలిగింది. ఈనాడు, ఉదయం కార్టూన్లు నన్ను కార్టూన్ రంగంవైపు నడిపించాయి. నేను, మా ఫ్రెండ్స్ నల్లగొండ నుంచి ‘నీలగిరి’, ‘క్రోక్విలర్స్’ అనే పేరుతో పత్రికల్లో కార్టూన్లు వేసేవాళ్లం. డిగ్రీ తర్వాత ఆర్‌పీ రోడ్‌లో సైన్ బోర్డ్ షాప్ పెట్టాం. తర్వాత సెయింట్ ఆల్ఫాన్సెస్ స్కూల్‌లోవూడాయింగ్ టీచర్‌గా చేరాను. పిల్లలందరికీ వాళ్ల డ్రాయింగ్ బుక్స్‌లో వాళ్ల కారికేచర్స్ వేసేవాడిని. చివరికి ‘అటు పోకురా.. శంకర్‌గాడు క్యారికేచర్ వేస్తాడు’ అని ఫ్రెండ్స్ అందరూ భయపడేటట్లు చేశా. తర్వాత నేను నల్లగొండ దోస్తులకు క్షమాభిక్ష ప్రసాదించి రాజకీయనాయకులు, ప్రముఖులపై పడ్డా. నేను గీసిన క్యారికేచర్లు చూసిన మోహన్‌గారు ‘చిరునవ్వు’ అనే పత్రికలో ‘శంకరభాష్యం’ పేరుతో ఒక పేజీ కేటాయించారు. తర్వాత వార్తాలో కార్టూనిస్ట్‌గా చేరాను. అక్కడినుంచి ఆంధ్రజ్యోతికి వెళ్లాను. అల్లమన్న, మురళన్న ప్రోత్సాహంతో కార్టూన్లు, క్యారికేచర్లు వేస్తూ ఐదేళ్లు పనిచేశానక్కడ. తర్వాత సాక్షీలో చేరాను. నేను ఏ క్యారికేచర్ గీసినా నా భార్య లక్ష్మికి చూపించి ఆమె గుర్తుపడితేనే వాటిమీద వర్క్ చేసేవాడిని. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులొచ్చినా.. అవార్డుల వెనుక పరీక్షించిచూస్తే మన నల్లగొండ కామన్ మ్యాన్ క్యారికేచరే కనిపిస్తుంది. ఇంతమంది కార్టూనిస్టులు నల్లగొండ నుంచే ఎలా వచ్చారని ప్రశ్నిస్తే ఒకసారి నల్లగొండలో పుట్టి చూస్తే తెలుస్తుంది అని చెప్పడం తప్ప నా దగ్గర మరో సమాధానం లేదు. ఇది కొంచెం అతిగా అనిపించినా అదే నా సమాధానం!

– శంకర్, సాక్షి కార్టూనిస్టు

కళాకారులను కన్నది

పనితో పాటే పాట పుట్టినట్టు.. కొన్ని కళలు కొందరికి పుట్టుకతోనే వస్తాయి. అట్లా నల్లగొండ కొందరు కళాకారులను కన్నది. సంక్షోభాలు, ఆకలి, పేదరికం.. అన్నిటినీ మించి చుట్టూ ఉన్న జీవితం వారిని కదిలించింది. కళవైపు నడిపించింది. ఇక్కడ మొదలైన ఎన్నో ఉద్యమాలను చూస్తూ సామాజిక స్పృహను తలకెత్తుకుంది నల్లగొండ. పక్కనే కృష్ణానది పారుతున్నా జిల్లాలో ఉన్న 52 మండలాల్లో కొన్ని మాత్రమే పచ్చగా ఉండి, మిగిలిన 40 మండలాల్లో ఎర్రదుమ్ము ఎందుకు లేస్తుందో చెప్పింది. ఫ్లోరైడ్ సమస్యతో పసి వయసులోనే ముసలివాళ్లు ఎలా అవుతున్నారో చూపెట్టింది. స్పందిచడం నేర్పింది. ఆ స్పందనే సృజనగా మారింది. అందుకే సామాజిక స్పృహ ఉన్న ఇక్కడి ఆర్టిస్టులందరూ కార్టూనిస్టులయ్యారు!

– అవినాష్, టీవీ9 యానిమేషన్ డైరెక్టర్ అండ్ కార్టూనిస్ట్ (గరిడేపల్లి)

నల్లగొండకు నమస్తే..

రాష్ట్రంలోని ప్రధాన దినపత్రికల కార్టూనిస్టులు నల్లగొండ జిల్లాకు చెందినవాళ్లు కావడం విశేషమే. వీరితోపాటు ప్రధాన దినపత్రికలైన ఆంధ్రజ్యోతి, సాక్షి సంపాదకులు కూడా ఈ జిల్లావారే! ‘ఈనాడు’ కార్టూన్లకు పెట్టింది పేరు. తెలుగు రాజకీయ కార్టూన్ కూడా దాంతోనే పాపులర్ అయింది. ఈ కార్టూనిస్టు నల్లగొండ జిల్లాకు చెందినవాడే కావడంతో చాలామంది ఔత్సాహికులను ముందుకు నడిపింది. కార్టూనిస్టుల సామాజిక నేపథ్యం కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడంలో పనిచేసింది. దాదాపు అందరూ ఉత్పత్తి కులాల నుంచి వచ్చినవారే. చేతినైపుణ్యం ఉన్న కుటుంబ నేపథ్యం కలవారే. సామాజిక ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉండే వీరికి ప్రశ్నించే తత్వం అదనంగా తోడైంది.

ఇక నా విషయానికి వస్తే మాది సూర్యాపేట. అడవిదేవులపల్లి, దేవరకొండ వంటి ప్రాంతాల్లో చదువుకున్నాను. సాహిత్యంపై ఆసక్తి కలగడానికి మా ఊరి లైబ్రరీ ఎంతో తోడ్పడింది. చదివిన సాహిత్యం పత్రికారంగం, కార్టూన్‌రంగం వైపు మళ్లడానికి ప్రేరణ ఇచ్చాయి. మా నాన్న కంభాలపల్లి వెంకయ్యగారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. జైలు జీవితం గడిపిన వాడు. ఆ స్ఫూర్తితో దేశం ఎదుర్కొంటున్న మత, కుల, గ్లోబలైజేషన్ ప్రాంతీయ వివక్షత వంటి సమస్యలపై వేలకొద్ది కార్టూన్లు వేయగలిగాను. తెలంగాణ సమస్యపై ‘గిది తెలంగాణ’ , సంస్కరణలపై ‘బ్యాంకు బాబు’ వంటి పుస్తకాలు అలా వచ్చినవే. ఆంధ్రజ్యోతిలో చేరిన తర్వాత 2011లో అమెరికా ప్రభుత్వం ఇంటర్నేషనల్ కార్టూనిస్టుల టూర్‌కి నన్ను ఆహ్వానించింది. దాదాపు నెలరోజుల పాటు వాషింగ్టన్, న్యూయార్క్, ఒహాయ్, లాస్ ఏంజిల్స్, ఫ్లోరిడాల్లో తిరిగి పలువురు కార్టూనిస్టులను కలిశా. కార్టూన్ రంగంలో మరింత కృషి చేయడానికి ప్రేరణగా నిలిచింది ఆ పర్యటన. ఇలా అనునిత్యం పత్రికల ద్వారా పాఠకులకు కలిసే అవకాశం ఇస్తున్న కార్టూన్ రంగానికి మమ్మల్ని సంసిద్ధుల్ని చేసి సమాజానికి ఏదో మంచి చేయగలుగుతున్నామన్న సంతృప్తి మా కార్టూనిస్టులకు ఇచ్చిన సృజనాత్మక కొండ… నల్లగొండకు నమస్తే!

-శేఖర్, ఆంధ్రజ్యోతి కార్టూనిస్టు

కళలకూ పుట్టినిల్లు

నల్లగొండ జిల్లా సహజంగానే చైతన్యవంతమైన రాజకీయలకు పుట్టినిల్లు. సాయుధరైతాంగ గెరిల్లా పోరాటం దీనికి నిదర్శనం. సమస్యలకు నిలయమైన ఈ జిల్లాలో ప్రజల బాధలు, గాథలు, పాలకుల దృష్టికి తీసుకెళ్ళడానికి కళాకారులు పాటలు, పద్యాలు, బుర్ర కథలు, బొమ్మలు తదితర మాధ్యమాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో జిల్లా నుంచి వ్యంగ్య చిత్రాలు గీసే చిత్రకారులు, కార్టూనిస్టులు ఉద్భవించారు.

– రవినాగ్, వార్త కార్టూనిస్టు(చిట్యాల

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *