mt_logo

మీరు చచ్చేదాకా మంత్రులుగా ఉన్నా ప్రజలు మిమ్మల్ని గుర్తించరు: కోదండరాం

మహబూబ్ నగర్ జిల్లా కొస్గిలో ఉస్మానియా విద్యార్ధుల తెలంగాణ పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదందరాం  

‘‘మంత్రిగా ఉంటే ప్రజలకు సమాన న్యాయం జరగదని ఆనాడు న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేశారు. కానీ నేడు తెలంగాణలో ప్రజలకు అన్యాయం జరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం వేల మంది విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకున్నా తెలంగాణ మంత్రులు పదవులకు రాజీనామాలు చేయడం లేదు. మీరు చచ్చేదాకా మంత్రులుగా ఉన్నా ప్రజలు మిమ్మల్ని గుర్తించరు. అంబేద్కర్‌లో ఉన్న ఆపాటి త్యాగం కూడా మన తెలంగాణ మంత్రుల్లో లేదు’’ అని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం వ్యాఖ్యానించారు. ఆదివారం మండలంలోని తుంకిమెట్లలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆనాడు ప్రజల కోసం బతికాడు కాబట్టే నేడు ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారని అన్నారు.

చిన్న రాష్ట్రాలు ఉంటే అభివృద్ధి సాధ్యమని, అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్ అనాడే చెప్పారని గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాతనే ప్రజలందరికీ సమాన అవకాశాలు వచ్చాయని అన్నారు. వైఎస్ అవినీతిలో తెలంగాణ మంత్రులే కేసుల్లో ఇరుక్కున్నారని, కనీసం తెలంగాణ కోసం ప్రజల వెంట ఉంటే గౌరవమైనా దక్కేదని అన్నారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని అన్నారు. క్రిష్ణా నీటి ద్వారా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవకాశం ఉన్నా ఆనాటి వైఎస్ ప్రభుత్వం కానీ, నేటి కిరణ్ సర్కారు కానీ కనీసం సర్వేకు కూడా నిధులు మంజూరు చేయడం లేదని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఈ ప్రాంత భూములు సస్యశ్యామలమవు తాయని, వలసలు ఆగుతాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రూ.10 కోట్లు సర్వే కోసం అడిగితే ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయని కోదండరాం అన్నారు. వేల కోట్లు కొల్లగొట్టిన జగన్‌ను ఏమీ అనకుండా తెలంగాణ ఉద్యమ కారులపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రాలో తుఫాను వస్తే రైతులకు తెల్లారే నష్ట పరిహారం వస్తుందని, కానీ మన తెలంగాణలో కరువొస్తే ఏళ్లు గడిచినా పైసా ఇవ్వరని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం జరుగుతున్న అన్యాయాలను వివరించేందుకు సంసద్‌యాత్ర పేరుతో మరోసారి ఢిల్లీ వెళ్లి చెబుతామని, అక్కడ కూడా తేలకుంటే చలో అసెంబ్లీకి సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతారో లేక రాజకీయంగా సమాధి కావడానికి సిద్ధమవుతారో తెల్చుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చేదాకా ఉద్యమం ఆగదని. గట్టిగా నిలబడి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు తుంకిమెట్ల కాకారవాణి వాగును కోదండరాం పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాముఖ్యతను స్థానికులు ఆయనకు వివరించారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *