mt_logo

చెత్త‌నుంచి కాసులు.. వ్య‌ర్థానికి తెలంగాణ మున్సిపల్‌ శాఖ కొత్త‌ర్థం

  • డీఆర్సీలతో లబ్ధి పొందుతున్న మహిళలు
  • మున్సిపాలిటీలకు ఆదాయ వనరు

ఏటా రూ.8.16 కోట్ల ఆదాయం

చెత్తే క‌దా అని త‌క్కువ‌గా తీసిపారేయ‌లేదు. ఆ వ్య‌ర్థాల‌కు కొత్త‌ర్థం చెప్పి మున్సిపాలిటీల‌కు ఆదాయ వ‌న‌రుగా మార్చేసింది తెలంగాణ మున్సిప‌ల్ శాఖ‌. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి కూడా ఏటా కోట్లలో ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నది. రాష్ట్ర‌వ్యాప్తంగా డ్రై రిసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్లు (డీఆర్‌సీసీ) ఏర్పాటు చేసి మున్సిపాలిటీలు, మహిళా స్వయం సహాయక సంఘాల‌కు లాభాలు తెచ్చిపెడుతున్న‌ది. తెలంగాణ మున్సిప‌ల్ శాఖ స‌రికొత్త ఆలోచ‌న‌ల‌తో రాష్ట్ర‌వాప్తంగా ప‌లు మున్సిపాలిటీలు, మ‌హిళా సంఘాల‌కు  గత సంవత్సర కాలంలో రూ.8.16 కోట్ల ఆదాయం స‌మకూరింది.  

చెత్త నుంచి వర్మి కంపోస్ట్‌ తయారీ

రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ప్రతిరోజూ 4,316 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 2,240 టన్నుల పొడి చెత్త, 2,076 టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 750 టన్నుల పొడి చెత్తను, 1,140 టన్నుల తడి చెత్తను ప్రాసెస్‌ చేస్తున్నారు. తడి చెత్తను ప్రాసెస్‌ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 229 కంపోస్ట్‌ షెడ్లు ఉన్నాయి. వీటి ద్వారా తడి చెత్త నుంచి వర్మి కంపోస్ట్‌ను తయారుచేస్తున్నారు. దీనిని హరితహారంలో నాటిన మొక్కలకు వినియోగిస్తున్నారు. మిగిలినది రైతులకు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించడం ద్వారా ఏడాది కాలంలో రూ.8.76 కోట్ల ఆదాయాన్ని సమపార్జించారు.

స్థానిక సంస్థలకు దండిగా ఆదాయం

తెలంగాణలో నాలుగు బయో మిథనాల్‌ ప్లాంట్లను 18.50 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటుచేశారు. జీహెచ్‌ఎంసీలో 5, గ్రేటర్‌ వరంగల్‌లో 2.5, సిద్దిపేటలో 10, సిరిసిల్లలో ఒక టన్ను సామర్థ్యంతో బయో మిథ‌నాల్‌ ప్లాంట్లను నెలకొల్పారు. సిద్దిపేటలో ఆర్గానిక్‌ వ్యర్థాల నుంచి బయో సీఎన్‌జీ తయారుచేస్తున్నారు. తద్వారా స్థానిక సంస్థలకు రూ.35 లక్షల ఆదాయం వస్తున్నది. నార్సింగి, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో హెరిటేజ్‌, విజేత, రిలయన్స్‌ తదితర సూపర్‌ మార్కెట్‌లలో కంపోస్ట్‌ను విక్రయిస్తున్నారు. ఈ రెండు స్థానిక సంస్థలకు రూ.2.24 లక్షల ఆదాయం వస్తున్నది. చెత్తను శాస్త్రీయంగా ప్రాసెసింగ్‌ చేయడం, వర్మి కంపోస్ట్‌ తయారు చేయడం ద్వారా 141 స్థానిక సంస్థలు రూ.9.13 కోట్లు సముపార్జించాయి.

డీఆర్‌సీసీ సెంటర్ల విజయాలు

రాష్ట్రంలో 206 డ్రై రిసోర్స్‌ సెంటర్లు 750 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటిలో 87 సెంటర్లను (42%) మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా మహిళా సంఘాల సభ్యులు రూ.6.26 కోట్లు ఆర్జించారు. మరో 119 డీఆర్‌సీసీలను పట్టణ స్థానిక సంస్థలు నిర్వహిస్తున్నాయి. వీటిద్వారా కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో రూ.36 లక్షలు, పీర్జాదిగూడలో రూ.18.84 లక్షల ఆదాయాన్ని సంపాదించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రాస్టిక్‌ గ్రాన్యూల్స్‌ నుంచి పీవీసీ మ్యానుఫాక్చరింగ్‌, ప్లాస్టిక్‌ టైల్స్‌ తయారు చేయడం ద్వారా రూ.4.80 లక్షలు సంపాదించారు.