- దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాధపురం గ్రామం నిలిచింది
- 17న ఢిల్లీ లో ప్రదానం చేయనున్న ఉపరాష్ట్రపతి
హైదరాబాద్, ఢిల్లీ, జూన్ 15: తెలంగాణకు మరో జాతీయ మంచినీటి వనరుల విభాగంలో అవార్డు లభించింది. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాధపురం గ్రామం నిలిచింది. ఈ నెల 17న ఢిల్లీ లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ప్రదానం చేయనున్నారు. అవార్డు ప్రటకించిన కేంద్రానికి, ఈ అవార్డులు రావడానికి ప్రేరణ, కారణ భూతులైన సీఎం కేసీఆర్ గారికి మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే అవార్డు పొందిన జగన్నాథ పురం గ్రామ పంచాయతీ కి, పాలకవర్గం, సిబ్బంది, అధికారులకు మంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీలలో 41 మంది విజేతలను ప్రకటించింది. ఇందులో ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌కు, ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం జిల్లాకు, ఉత్తమ గ్రామ పంచాయతీగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాధపురం గ్రామ పంచాయతీకి దక్కాయి. ఈ నెల 17 ఢిల్లీలో గల విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్‌లో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులు అందచేస్తారు. అవార్డు విజేతలకు ప్రశంసా పత్రం మరియు ట్రోఫీతో పాటు నగదు బహుమతులు అందజేయబడతాయి.
జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుండి ఈ జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులను అందజేస్తున్నారు. ఇవి వరసగా 4 వ జాతీయ జల అవార్డులు. ‘జల్ సమృద్ధ్ భారత్’ లేదా ‘జల సంపన్న భారత్’ అనే ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డ్రైవ్‌లో భాగంగా, జాతీయ నీటి అవార్డులు వివిధ వ్యక్తులు మరియు సంస్థలు చేసిన మంచి పని మరియు ప్రయత్నాలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తాయి. ఇది నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు ఉత్తమ నీటి వినియోగ పద్ధతులను అవలంబించేలా వారిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంది.
ఈ కార్యక్రమం ప్రజలందరికీ మరియు సంస్థలకు బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి మరియు నీటి వనరుల సంరక్షణ మరియు నిర్వహణ కార్యకలాపాలలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. సీఎం కేసీఆర్ దార్శనికత వల్ల రూపొందించి, అమలు చేస్తున్న పల్లె ప్రగతి, ప్రగతి ఫలాలు దేశంలో ఈ విధంగా ప్రతి ఫలిస్తున్నాయి.