mt_logo

ప‌దేండ్ల‌లోనే ఇంత మార్పా?.. తెలంగాణ ప్ర‌గ‌తిపై ప్ర‌ముఖ న‌టుడు ముర‌ళీమోహ‌న్ ఆశ్చ‌ర్యం

కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ సుప‌రిపాల‌న అందిస్తున్నారు. ఆయ‌న సంక‌ల్పం.. దార్శ‌నిక‌త‌తో తెలంగాణ నేడు అన్ని రంగాల్లోనూ దేశానికి ఆద‌ర్శంగా నిలిచింది. ప‌దేండ్ల‌లోనే ఎవ‌రికీ అంద‌ని ప్ర‌గ‌తి సాధించింది. మంత్రి కేటీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఐటీలోనూ మేటిగా నిలువ‌గా..తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా మారిపోయింది.  వివిధ దేశాలు.. ఆయా న‌గ‌రాల్లో తిరిగొచ్చిన ప్ర‌ముఖులంతా హైద‌రాబాద్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తెలంగాణ ప్ర‌గ‌తిని చూసి ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లో తిరుగుతుంటే తాము న్యూయార్క్‌లో ఉన్నామా? ఇండియాలో? ఉన్నామా? అనే అనుమానం క‌లుగుతున్న‌ద‌ని అంటున్నారు. ఇప్పుడు ఆ కోవ‌లోకి చేరిపోయారు ప్ర‌ముఖ న‌టుడు ముర‌ళీ మోహ‌న్‌. పదేండ్ల‌లోనే తెలంగాణలో వ‌చ్చిన మార్పును చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు. ‘ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ప్రతి రంగంలోనూ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప సంకల్పంతో బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారు’ అంటున్నారు మురళీమోహన్‌. తెలంగాణ అభివృద్ధిపై ఆయనేమంటున్నారో ఆయ‌న‌ మాటల్లోనే..

నా చిన్నతనంలో మా నాన్నగారు ఆదిలాబాద్‌ జిల్లాలో ఫారెస్ట్‌ కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. సెలవు రోజుల్లో నేను కూడా ఆదిలాబాద్‌ వెళ్లేవాణ్ని. అలా బాల్యం నుంచే నాకు తెలంగాణతో అనుబంధం ఏర్పడింది. ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజల చిరకాల కోరిక. ఉమ్మడి రాష్ట్రంలో కొందరు నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన, మధ్యలోనే కాడి వదిలేశారు. గమ్యం వరకూ తీసుకెళ్లలేక పోయారు. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు ఆయన ప్రత్యేక తెలంగాణ తీసుకొస్తాడనే నమ్మకం నాతోపాటు చాలామందికి ఉండేది కాదు. ‘ఈ బక్క ప్రాణం రాష్ట్రాన్ని ఏం సాధిస్తాడు?’ అని అనుమానించారు. కానీ కేసీఆర్‌ చక్కటి కార్యదక్షతతో, అద్భుతమైన ప్రణాళికతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆయన ప్లానింగ్‌ ఎలా ఉంటుందో నేను బాగా గమనిస్తూ ఉండేవాణ్ని. కేసీఆర్‌ పట్టుదల, అకుంఠిత దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది.

చంద్ర‌బాబు కాద‌న్న‌ది.. కేసీఆర్ చేసి చూపించారు!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి నేను ‘ఆంధ్రప్రదేశ్‌ డెల్టా ఏరియా.. పంటలు బాగా పండుతున్నాయి. మరి తెలంగాణలో నీళ్లు ఎందుకు రావు?’ అని అడిగాను. అప్పుడాయన ‘సముద్రమట్టం కంటే తెలంగాణ ఎత్తులో ఉంటుంది కాబట్టి గోదావరి, కృష్ణా నీళ్ళు తీసుకురావడం కష్ట’ మని చెప్పారు. ‘ఆంధ్రా భూభాగం నదికి సమాంతరంగా ఉండటం వల్ల నీళ్లు ఇవ్వడం సులభం’ అన్నారు. ‘తెలంగాణకు నీళ్లు తీసుకురావాలంటే అంచెలంచెలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో ఎత్తిపోసి రిజర్వాయర్స్‌ నింపాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది, కరెంట్‌ బిల్లు కూడా చాలా ఉంటుంద’ని లెక్కలు చెప్పారు. కానీ స్వరాష్ట్రం సాధించిన తరువాత, కేసీఆర్‌ తెలంగాణను డెల్టా ప్రాంతంలా చేయాలని సంకల్పించారు. ఎంత ఖర్చయినా వెనుకంజ వేయలేదు. ‘మా నీళ్లు మాకు కావాలి.. మా పంటలు మేం పండించుకోవాలి. మేం నలుగురికి పెట్టేలా ఉండాలి కానీ, దిగుమతి చేసుకునే స్థితిలో ఉండకూడదు’ అనే సంకల్పంతో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు అద్భుత రీతిలో రూపకల్పన చేశారు. కాబట్టే, ఈ రోజు తెలంగాణలో చెరువులు, కుంటలు నీళ్లతో కళకళలాడుతున్నాయి. రిజర్వాయర్స్‌ జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా పంటలు బాగా పండుతున్నాయి. ఇంతకుముందు తెలంగాణలో వరి తక్కువగా పండేది. కానీ నేడు వరి అత్యధికంగా పండే పంజాబ్‌తో పోటీపడుతున్నది. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఇంటికీ తాగునీరు అందుతున్నది. కరెంటు విషయంలో కూడా మిగతా రాష్ర్టాల కంటే ముందంజలో ఉన్నది.

ఐటీలో తెలంగాణ ప‌రుగులు..

ఐటీ రంగంలోనూ తెలంగాణ దూసుకుపోతున్నది. మంత్రి కేటీఆర్‌ అంకితభావంతో పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇండియాలోనే నెంబర్‌వన్‌ అవుతుందనే నమ్మకం ఉంది. తెలంగాణకు ఎన్నో బహుళజాతి సంస్థలు వస్తున్నాయి. కేటీఆర్‌ దావోస్‌, యూకే, యూఎస్‌ వెళ్లి మరీ తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్‌కు తరలి వస్తే అన్ని సదుపాయాలూ కల్పిస్తామంటూ పారిశ్రామిక వేత్తలను మెప్పిస్తున్నారు. పరిశ్రమల వల్ల ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా మూడు పువ్వులు-ఆరుకాయలుగా విరాజిల్లుతున్నది. పొరుగు రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఇంత రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ లేదు. కొత్త పరిశ్రమలతోపాటు అవుటర్‌ రింగ్‌రోడ్డు కూడా ఈ విజయానికి ముఖ్య కారణం. ఇక్కడి భూమి కూడా ఎంతో గట్టిది. అందుకే మాలాంటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ధైర్యంగా నాలుగైదు అండర్‌గ్రౌండ్‌ సెల్లార్లు కట్టుకుంటున్నారు.

న్యూయార్క్‌ను త‌లపించేలా హైద‌రాబాద్‌

హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు వేయడం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంది. చాలా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఎన్నో కొత్త ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వెలిశాయి. ఈరోజు హైదరాబాద్‌ను చూస్తుంటే న్యూయార్క్‌ నగరంలా కనిపిస్తున్నది. ఈ విషయంలో మనమంతా గర్వపడాలి. కేటీఆర్‌ లాంటి కొడుకు, కవిత లాంటి కూతురు, హరీశ్‌రావు లాంటి మేనల్లుడు ఉండటం నిజంగా కేసీఆర్‌ అదృష్టం. ఈ ముగ్గురూ అద్భుత ప్రతిభావంతులే. అన్ని భాషలు మాట్లాడతారు. అసెంబ్లీ మొదలుకొని పార్లమెంట్‌ వరకు ఎక్కడైనా తమ ప్రసంగాలతో ఆకట్టు కుంటారు. ఏ రాష్ట్రానికైనా కావలసింది ఇలాంటి సమర్థ నాయకత్వమే.