mt_logo

మోదీ సర్కార్ అలసత్వం… నత్తనడకన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్

కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రధాని మోదీ దేశంలో అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుకు పనిచేస్తున్న తమ కన్సల్టెంట్‌ కంపెనీలకు పన్ను మినహాయింపు కొనసాగించాలని జపాన్‌ డిమాండ్‌ చేసింది. లేదంటే జపనీస్‌ గ్రాంట్స్‌ కింద ఆమోదం పొందిన అన్ని ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేస్తూ… భారత్‌లో జపాన్‌ రాయబారి సుజుకి సంతోషి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఈ పరిణామంతో ప్రాజెక్టుపై తీవ్ర సందిగ్ధత నెలకొన్నది.

కేంద్రం ముందు చూపు లేమితనం :

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు నిర్మాణంలో జపాన్‌ భాగస్వామిగా ఉన్నది. ప్రాజెక్టు రూపకల్పన, సాంకేతికసాయం కోసం జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ.. జపాన్‌ ఇంటర్నేషనల్‌ కన్సల్టెంట్స్‌, జేఈ అనే సంస్థలను నియమించింది. ఆయా కన్సల్టెంట్‌ సంస్థలు మన దేశంలో పొందే ఆదాయం, అదనపు ఖర్చులపై పన్ను మినహాయింపు కొనసాగించాలని జపాన్‌ కోరుతున్నది. 2022 బడ్జెట్‌ ముందు వరకు కన్సల్టెంట్‌ సంస్థలు పన్ను మినహాయింపులు ఉండేవి. అయితే కేంద్ర ప్రభుత్వ అత్యుత్సాహంతో 2022 ఆమోదించిన బడ్జెట్‌లో వీటిని తొలగించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కన్సల్టెంట్‌ సంస్థలు కూడా పన్ను కట్టాల్సిందేనని పేర్కొన్నది. ఫైనాన్స్‌ బిల్లులో ప్రస్తావించిన ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 10లోని 8, 8ఏ,8బీ క్లాజులపై జపాన్‌ ప్రత్యేకంగా ఆందోళన వ్యక్తం చేసింది. దీని ఫలితం బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై పడగా… ప్రాజెక్ట్ పనులు మొదలు కాకముందే నిలిచి పోనున్నాయి.

ప్రారంభం ఎప్పుడో :

తొలిసారిగా అధికారంలోకి వచ్చిన వెంటనే బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును మోదీ సర్కారు ప్రకటించింది. 2022లో సర్వీసులు ప్రారంభిస్తామన్న ప్రభుత్వం కార్యకలాపాల ప్రారంభానికి పెట్టుకున్న డెడ్‌లైన్‌ను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసింది. 2026లో బుల్లెట్‌ రైలు ప్రారంభిస్తామని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. పబ్లిక్‌ ఆపరేషనల్‌ తేదీని 2027 ఏడాదికి మారుస్తున్నట్టు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ సతీష్‌ అగ్నిహోత్రి పేర్కొన్నారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఆలస్యానికి భూసేకరణ సమస్యతో పాటు కేంద్రం అలసత్వం కూడా కారణం.

ప్రధాని ఆరంభ శూరత్వం :

చిత్తశుద్ధి, చేయాలన్న తపన ఉంటే ఎంతటి భారీ ప్రాజెక్టునైనా యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయవచ్చు. అయితే, మోదీ సర్కారు ఆరంభ శూరత్వానికే పరిమితమవుతున్నది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సకాలంలో పూర్తిచేయని భారీ ప్రాజెక్టుల సంఖ్య కోకొల్లలు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుతో పాటు గుజరాత్‌ హైబ్రిడ్‌ రిన్యూబుల్‌ ఎనర్జీ పార్క్‌, ధోలెరా సోలార్‌ పార్క్‌, బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, గోరఖ్‌పూర్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌, ముంబై-నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌వే, రాయ్‌పూర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌వే, ట్రాన్స్‌ హర్యానా ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ-మీరట్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌, నార్త్‌-ఈస్ట్‌ రైల్వే కనెక్టివిటీ, చీనాబ్‌ బ్రిడ్జి, అంజిఖాడ్‌ బ్రిడ్జి, కోస్టల్‌ రోడ్‌, గిఫ్ట్‌ సిటీ, న్యూఢిల్లీ డబ్ల్యూటీసీ వంటి భారీ ప్రాజెక్టులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *