mt_logo

రైతుకు రైతు బీమా, ప్రతీ ఎకరాకు నీళ్లు అందించడమే తెలంగాణ మోడల్ : ఎమ్మెల్సీ కవిత

  • సీఎం కేసీఆర్ కృషి తో తెలంగాణలో వ్యవసాయమంటే పండగ
  • నకిలీ విత్తనాల బెడద లేదు… కరెంటు కష్టాలు లేవు
  • నదీ జలాలను 610 మీటర్ల పైకి ఎత్తి పోసి పొలాలకు నీళ్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్ 
  • ఐదేళ్లలో 65 లక్షల మంది రైతులకు రూ. 65 వేల కోట్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్. 
  • ప్రతీ రైతుకు రైతు బీమా, ప్రతీ ఎకరాకు నీళ్లు అందించడమే తెలంగాణ మోడల్
  • దేశమంతా తెలంగాణ అభివృద్ధిపై చర్చ
  • దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ విస్తరిస్తుంది
సదాశివనగర్, జూన్3 : సీఎం కేసీఆర్ కృష్టితో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. వ్యవసాయం అంటే దండగ అన్న దగ్గరి నుంచి వ్యవసాయం అంటే పండగ అన్న దగ్గరకు సీఎం కేసీఆర్  అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతుందని తెలిపారు. గతంలో రైతులంటే చిన్నచూపు ఉండేదని, కానీ ఇప్పుడు రైతులు గల్లా ఎగరేసుకునే పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. రైతులు అప్పులు లేకుండా ఎప్పటికీ చేతిలో డబ్బు ఉండేలా, ఎవరినీ చేయిచాచి అడగవద్దన్న లక్ష్యం కోసం సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ పట్ల రైతులు ఆధరణ ఎప్పటికీ  ఇలానే ఉండాలని కోరారు.తెలంగాణ  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సురేందర్ తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.
“తెలంగాణ మోడల్ అంటే ఏంటి అని ఇతర ప్రాంతం నుంచి వచ్చిన మిత్రులు అడిగారు. నదీ జలాలను 610 మీటర్ల పైకి ఎత్తి పోసి పొలాలకు నీళ్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్ అని చెప్పాను . ఐదేళ్లలో 65 లక్షల మంది రైతులకు రూ. 65 వేల కోట్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్. ప్రతీ రైతుకు రైతు బీమా, ప్రతీ ఎకరాకు నీళ్లు అందించడమే తెలంగాణ మోడల్ అని చెప్పారు. ఆదే తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరిస్తుంది” అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు సింహాలై కొట్లాడి రాష్ట్రం తెచ్చకున్నామని, మొత్తం దేశ రాజకీయ వ్యవస్థ మెడ వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని స్పష్టం చేశారు.
దేశంలో సైనికుల గురించి గొప్పగా మాట్లాడుకుంటామని, ఎండకు వానకు బెదరకుండా దేశానికి రక్షణగా సైనికులు కాపలా ఉంటారని, అదే తరహాలో రైతులు పోలంలో పనిచేస్తూ చెమటచుక్క చిందిస్తారు కాబట్టి ప్రతీ ఒక్కరు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నామని అన్నారు. అన్నదాతలకు శిరస్సు వంచి కవిత నమస్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూసి ఏడ్చామని, అనేక కష్టాలు చేశామని, అవన్నీ మరచిపోలేమని వివరించారు. అప్పట్లో రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, రైతుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. మందు బస్తాలు కావాలంటూ మూడు నాలుగు రోజుల పాటు ఎదురుచూపులు, పోలీసుల లాఠీచార్జిలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే అడితే నాథుడు లేకుండేనని, వందల కోట్లు లూటీ చేసి పారిపోతే వాళ్లను కాపాడే నాయకులే ఉన్నారు తప్పా రైతుల పక్షాన  ఆ నాయకులు నిలబడలేదని స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టి జైళ్లకు పంపించి రైతులను కాపాడుకుంటున్నామని తెలియజేశారు. అది కేవలం తెలంగాణలోనే జరుగుతుందన్నారు. రైతులంటే గౌరవంతో సీఎం కేసీఆర్ పట్టుదలతో పనిచేస్తున్నారని తెలిపారు. వరిసాగులో గతంలో 15 వ స్థానంలో ఉండే తెలంగాణ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుందని తెలిపారు. పంజాబ్ ను కూడా దాటేసి మొదటి స్థానానికి చేరుకుంటామన్న విశ్వాసం ఉందని అన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు
పంట పండించడానికి విత్తనాలు ఉంటే సరిపోదని, సాగునీరు, విద్యుత్తు, పంట కొనే వ్యవస్థ వంటి అనేక సౌకర్యాలు ఉండాలని, కాబట్టి ఈ ప్రతీ అంశం గురించి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని వివరించారు. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే మిషన్ కాకతీయలో భాగంగా 432 చెరువులను బాగు చేసుకున్నామని, దాంతో భూగర్భజలాలు 16 అడగుల పైకి పెరిగాయని గుర్తు చేశారు. 2014లో 3 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండితే ఇప్పుడు 5 లక్షల క్వింటాళ్లకు పెరిగిందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది సాధించడానికి ఎంతో శ్రమ చేశామని, ఆలోచన చేశామని, ఆలోచనలను ఆచరణలో పెట్టామని, అందుకే మార్పు వచ్చిందని అన్నారు. చెరువుల మరమ్మత్తుతో పాటు చెక్ డ్యామ్ లను పెద్ద సంఖ్యలో నిర్మించుకున్నామని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ. 60 కోట్ల వ్యయంతో 22 చెక్ డ్యాములను నిర్మించామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 22తో  ఈ ప్రాంతానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 850 కోట్లు మంజూరు చేసిందని, త్వరలో కాలువల పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఎల్లారెడ్ది నియోజకవర్గంలో తెలంగాణ రాక ముందు కేవలం 9 సబ్ స్టేషన్లు మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రూ. 181 కోట్లతో మరో 10  సబ్ స్టేషన్లు నిర్మించామని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్తు అందించడానికి సదాశివనగర్ మండలంలో రూ. 119 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 119 మంది రైతులు మరణిస్తే బీమా వచ్చిందన్నారు.
లాభదాయక పంటల వైపు రైతులు మళ్లాలి
రైతు  బంధు ఇవ్వగానే అయిపోయిందా అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారని, ఆ విషయం సీఎం కేసీఆర్ కు తెలుసు కాబట్టే ఉచిత విద్యుత్తుతో పాటు అనేక రైతు అనుకూల కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల కళ్లకు కనిపించేలా, చెవులకు వినిపించేలా మనం విషయాలను తెలియజేయాలని సూచించారు. రైతులు సంఘాలుగా ఏర్పడి బలంగా ఉండాలన్న ఉద్ధేశంతో రైతు బంధు సమితి  లను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2600 రైతు వేదికలను నిర్మించారని తెలిపారు. రైతులు అందరూ వరి, పత్తి వంటి పంటలకు మాత్రమే పరిమితం కాకుంటా మరింత లాభదాయకమైన పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి చేశారు. మన దేశం ఇప్పటికీ ఏటా దాదాపు లక్ష టన్నుల పామ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నదని, కాబట్టి పామ్ ఆయిల్ వంటి పంటలు సాగు చేసే దిశగా ఆలోచన చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖను పటిష్టం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని అన్నారు. రైతులకు ఏ ఇబ్బంది జరిగినా, పంట నష్టం జరిగినా, రైతు బీమా వంటివి అందకపోయినా ప్రభుత్వానికి వెంటనే తెలియజేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు కవిత సూచించారు.