- నిజామాబాద్ ఐటీ హబ్ కు హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైన 29 రోజుల్లోనే నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటు
- నిజామాబాద్ యువత ఉపాధి కల్పన కోసం కట్టుబడి ఉన్నాం – ఎమ్మెల్సీ కవిత
ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుచుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3,000 మంది పనిచేస్తున్నారు.
నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేయడంపై ఈనెల మొదటి వారంలో ఆ సంస్థ ప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలుసుకుని చర్చలు జరిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత ఇచ్చిన హామీ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ ను ఇటీవల సందర్శించారు. అనంతరం కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదించగా కాలిఫోర్నియాలోని వారి ప్రధాన కార్యాలయం అనుమతులు ఇచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమైన కేవలం 29 రోజుల్లోనే సంస్థ ఏర్పాటు కావడం విశేషం.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ లాజిక్ నిజామాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని స్పష్టం చేశారు. ఐటీ అభివృద్ధి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు. ఇప్పటికే అనేక మందికి ఉద్యోగాలు లభించాయని, రెండు జాబ్ మేళాలు నిర్వహించామని వివరించారు. గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుతో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండానే యువతకు స్థానికంగానే ఉద్యోగ కల్పనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఐటీ హబ్ ఆలోచన చేశారని చెప్పారు. నిజామాబాద్ ఐటీ హబ్ ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని, భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ కంపెనీలు ఏర్పాటు అవుతాయని చెప్పారు.