mt_logo

పిల్లలను కోళ్లఫారంలో కోళ్లలాగా కుక్కుతున్నారు… కేబినెట్ సబ్ కమిటీలో మంత్రి కేటీఆర్ ఆవేదన

మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నూతన స్పోర్ట్స్ పాలసీపై మంత్రుల సబ్ కమిటీ సమావేశం టూరిజం ప్లాజాలో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సీఏస్ సోమేశ్ కుమార్ పాల్గొని, రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి తీసుకోవాల్సి‌న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… సమగ్రమైన కొత్త క్రీడల విధానం దేశంలో అత్యత్తమ క్రీడా విధానం అవుతుందన్నారు. 40 శాతం ప్రజలు మధ్యతరగతికి చెందినవారని, భౌతిక అక్షరాస్యత ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధించే విధంగా ఫాలసీ ఉండాలన్నారు. ప్రాథమిక పాఠశాలల నుండి… ప్రతి ఒక్కరికీ ఈ విధానం అందాలని, కేవలం పని, చదువు మీదే కాదు… ఆటలు, ఫిజికల్ ఫిట్ నెస్, ఫిజికల్ లిటరసీ తప్పనిసరి అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో చాలా స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ లేవని, పిల్లలను కోళ్ల ఫారాలలో కోళ్లలాగా కుక్కుతున్నారని, ఇలా చేస్తే డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు ఎలా అవుతారని ప్రశ్నించారు.? గ్రామ, పట్టణ, నగర స్థాయిలో ఆటల మీద అవగాహన, ఆసక్తి పెంచాలన్నారు. ఆటల పరికరాలు, గ్రౌండ్స్, స్టేడియాల నిర్మాణం తక్షణమే జరగాలన్నారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఆటల సదుపాయాలు, ఓపెన్ జిమ్స్, ఇతర అంశాలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఒడిశా రాష్ట్రం యొక్క ఆటల మౌలిక సదుపాయాలు బాగున్నాయని, అధికారులు అక్కడకు వెళ్ళి పరిశీలించాలని సూచించారు. విద్యార్థులు హాకీ, క్రికెట్ వంటి క్రీడల మీద దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారా అథ్లెటిక్స్ పై కూడా దృష్టి సారించాలన్నారు. క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… స్టేట్ ఒలింపిక్ కమిటీతో చాలా కమిటీలు రాష్ట్రంలో ఉన్నాయని కానీ వాటి పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలు అయ్యాయన్నారు. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదని, రాజకీయ నాయకులకు క్రీడల పదవులే ఉండవద్దని, నేను కూడా నా క్రీడల పదవులకు రాజీనామా చేస్తానన్నారు. క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేసేలా చూడాలని, జిల్లా యూనిట్ గా…కలెక్టర్లు ముఖ్య భూమికతో జరిగితే, పీఈటీలకు కూడా తగిన గుర్తింపు వస్తుందన్నారు.

ప్రైవేటు రంగంలో స్పోర్ట్స్ యూనివర్సిటీలను ప్రోత్సహిద్దామని, ఈ విధానం కొరియా దేశంలో విజయవంతమైందన్నారు. పంచాయతీ రాజ్ ప్రతి శాఖ నుంచి గ్రీన్ బడ్జెట్ లా, స్పోర్ట్స్ బడ్జెట్ పెడదామని సూచించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… గ్రామీణ ప్రాంతాల నుండి మంచి క్రీడాకారులు రావాలంటే, స్పోర్టింగ్ కిట్స్ గ్రామాల యూత్ కి ఇవ్వాలన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం బ్యాడ్మింటన్, టెన్నీస్, బాక్సింగ్, షూటింగ్, రోయింగ్ లాంటి క్రీడల రాజధాని గా దేశంలో నే పేరుగాంచిందని,. అలాగే మిగతా క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయాలన్నారు. వచ్చే సబ్ కమిటీ మీటింగ్ లో డ్రాఫ్ట్ పాలసీని పూర్తిగా రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కేబినెట్ సమావేశంలో పాలసీని ఆమోదం తీసుకోవాలని SATS అధికారులకు సబ్ కమిటీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *