సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) చేస్తున్న అధ్యయనాలు ప్రభుత్వానికి వెన్నెముకగా పనిచేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బేగంపేట్ లోని సెస్‌లో విద్యార్థునుల వసతి గృహాన్ని మంత్రి హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికప్పుడు విలువైన సూచనలు చేస్తున్నదని పేర్కొన్నారు. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలు, పథకాలు రూపకల్పనలో, అమలు చేయడంలో సామాజిక అధ్యయనాలు ఎంతో అవసరమని అన్నారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందన్నారు.
సీఎం కేసీఆర్ గారు ఒక పథకం అమలు చేసే ముందు ప్రజా కోణంలో ఆలోచిస్తారని, అందుకే అవి విజయవంతం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. కళ్యాణ లక్ష్మి బాల్య వివాహాలను తగ్గించిందని, పార్లమెంట్ చట్టాలు చేయలేని పనిని పథకం చేసిందని కొనియాడారు..కేసీఆర్ కిట్ వల్ల వంద శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. నాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30 శాతం ఉంటే, నేడు ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 76 శాతం జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ వల్ల సురక్షిత తాగునీరు అందుతున్నదని, తద్వారా సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
త్రాగునీటికి నాడు ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని, నేడు త్రాగు నీటి సమస్య ప్రజలకు లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ లో నీటి కోసం ఎంతో ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు అలాంటివి లేవని చెప్పారు. సీఎం కేసీఆర్ గారి ఆలోచన వల్ల గుణాత్మక మార్పు సాధ్యమైందని అన్నారు. .ప్రభుత్వ పాలసీలు సామాజిక పరిస్థితుల ఆధారంగా రూప కల్పన చేయాల్సి ఉంటుందని అప్పుడే అవి అనుకున్న ఫలితాలు అందిస్తాయని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సెస్ ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదన్నారు. రూ. 5 కోట్ల వ్యయంతో హాస్టల్ భవనం అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు. కార్పొరేట్ స్థాయిలో, ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో నిర్మించామన్నారు. గతేడాది ఫిబ్రవరిలో శంకుస్ధాపన చేసుకొని, ఏడాదిలో పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో సేస్ కు మంచి పేరు ఉందని, జాతీయ స్థాయిలో ఇక్కడి పీహెచ్డీ కోర్సుకు డిమాండ్ ఉందని తెలియజేశారు. అందుకే వివిధ రాష్ట్రాల నుండి అడ్మిషన్లు పొందుతున్నారని చెప్పారు. సెస్ సేవలను మరింత వినియోగించుకుంటామని అన్నారు. సెస్ హాస్టల్ లో 19 గదులు ఉన్నాయని, 40 మంది వరకు ఉండవచ్చని అన్నారు.