mt_logo

350 కోట్ల సింటెక్స్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు వెల్‌స్పన్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తన సబ్సిడరీ సంస్థ అయిన సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు మంత్రి కె. తారక రామారావు, వెల్స్పన్ వరల్డ్ చైర్మన్ బీకే గోయాంక  సమక్షంలో  ఈ కార్యక్రమం జరిగింది. సింటెక్స్ సంస్థ 350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ తయారీ యూనిట్ వలన వెయ్యి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటునున్నాయి. సింటెక్స్ సంస్థ తన తయారీ యూనిట్ ద్వారా వాటర్ ట్యాంకులను, యూపీవీసీ పైపులు మరియు ఇతర  అనుబంధ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నది.

ఈరోజు సంస్థ చైర్మన్ బికె గోయెంకా, మంత్రి కేటీఆర్ సమక్షంలో సంస్థ తన తయారీ యూనిట్ కోసం శంకుస్థాపన కార్యక్రమాన్న చందన్‌వెల్లిలో నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలో సంస్థ  నూతన యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు, అద్భుతమైన మౌలిక వసతుల వల్లనే అనేక సంస్థలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమలు, సంస్థల విస్తరణ ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతును అందిస్తుందని, తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ఆయా సంస్థలు మరింత వృద్ధి సాధించాలని తాము కోరుకున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను విజయవంతంగా  కొనసాగిస్తున్నామని  వెల్‌స్పన్, వరల్డ్ చైర్మన్ బీకే గోయాంక తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల నిర్వహణ పట్ల పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఈరోజు సింటెక్స్ సంస్థ యూనిట్ ద్వారా పీవీసీ  పైపులు, వాటర్ ట్యాంకుల వంటి ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో తమ సంస్థ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేస్తున్న యూనిట్ ద్వారా తమ సంస్థ తరపున  మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.