mt_logo

నేడు అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌: తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా IT & Industries మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి 15 రోజుల పాటు.. ఈ పర్యటన కొనసాగుతుందని సమాచారం. అమెరికాలోని ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతోప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను వివరించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులపై… కొన్ని కీలక ఒప్పందాలు  కూడా జరగనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఇతర అధికారులు కూడా కేటీఆర్‌ వెంట అమెరికా వెళ్లనున్నారు.

మంత్రి కేటీఆర్ లండన్​ పర్యటనతో రాష్ట్రానికి పలు పెట్టుబడులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్​లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసే ఆ కేంద్రంతో 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో డాన్జ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది. బ్రిటన్​ ఆధారిత ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ రూ.200 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చింది. రసాయన పరిశ్రమ క్రోడా ఇంటర్నేషనల్‌తోనూ అక్కడ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జీనోమ్ వ్యాలీలో గ్లోబల్ టెక్నికల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. లండన్‌లో జరిగిన ఐడియాస్‌ ఫర్‌ ఇండియా సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర విధానాలు, అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు.