హైటెక్స్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ నగరమైన ఒక రోజులో నిర్మాణం కాదు కానీ ప్రభుత్వాలు, పాలకులు సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఆయా నగరాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన పైన ప్రధాన దృష్టి సారించారు. ప్రభుత్వం చేపట్టిన ఆయా కార్యక్రమాల సత్ఫలితాలను ఇప్పుడు ప్రపంచం చూస్తున్నదన్నారు.
ఒకప్పుడు హైదరాబాద్ నగరం కరెంటు కోతలతో సతమతమయ్యేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పాటు అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ అందిస్తున్నది. హైదరాబాద్ విద్యుత్ అవసరాలే కాకుండా అవసరాలను కూడా సంపూర్ణంగా తీరుస్తున్న ప్రభుత్వం మాదని పేర్కొన్నారు. గతంలో ప్రతి వేసవికాలంలో ట్యాంకర్లు లేకుండా నీటి సరఫరా సాధ్యమయ్యేది కాదు. మంచినీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉండేది. ధర్నాలు రాష్ట్ర రోకోలు జరిగేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వలన కృష్ణా, గోదావరి నుంచి వందల కిలోమీటర్ల నుంచి నీటిని తీసుకొచ్చి హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నము అని అన్నారు.
35 ప్రాజెక్టులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పూర్తి
ప్రస్తుతం కోటి మంది ఉన్న హైదరాబాద్ నగర జనాభా మూడు కోట్లకు చేరినా, 2050 సంవత్సరం వరకు సాగునీటి భద్రత కలిగిన నగరంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన భారీ ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా నీటిని కేటాయించాము. హైదరాబాద్ నగరంలో వచ్చిన అద్భుతమైన మార్పుని సూపర్ స్టార్ రజనీకాంత్ తో మొదలుకొని అనేకమంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారని గుర్తు చేశారు. ప్రముఖులతో పాటు ప్రముఖ అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా హైదరాబాద్ అభివృద్ధిని ప్రత్యేకంగా తమ నివేదికలలో పేర్కొంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో లో మౌలిక వస్తువుల కల్పన వేగంగా కొనసాగుతుంది. 35 ప్రాజెక్టులను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పూర్తి చేశామని తెలిపారు.
ఓఆర్ఆర్ చుట్టూ 415 కిలోమీటర్ల మేర మెట్రో
హైదరాబాద్ పెరుగుతున్న వేగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మౌలిక వసతుల కల్పన పైన మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది, అందుకే హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ మరింతగా విస్తరించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రోతో పాటు ఓఆర్ఆర్ చుట్టూ 415 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకొని పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నాం.. నగరం బాగుండాలి అంటే శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉంది శాంతి భద్రతలు బాగున్నప్పుడే నగరానికి భారీగా పెట్టుబడులు వస్తాయి.
రియల్ ఎస్టేట్ రంగంపై 30 లక్షల మంది ఆధారపడ్డారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రతి ఏడాది మత ఘర్షణలు లేదా కర్ఫ్యూ వంటివి ఎప్పటికప్పుడు కొనసాగేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్క రోజు కూడా అలాంటి పరిస్థితి రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం విద్యుత్, తాగునీరు శాంతి భద్రతల వంటి కీలకమైన అంశాల పైన దృష్టి సారించి వాటిని బలోపేతం చేయడంలో విజయం సాధించామన్నారు. అందుకే హైదరాబాద్ నగరం భారీగా విస్తరించి ముందుకు పోతున్నదని తెలిపారు. రియల్ ఎస్టేట్ అంటే కేవలం అమ్మకం కొనుగోలు మాత్రమే కాదు. ఈ రంగంపై రాష్ట్రంలో 30 లక్షల మంది ఆధారపడి పనిచేస్తున్నారని తెలిపారు.
అభివృద్ధి సినిమా ముందుంది
చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న అభివృద్ధిని ప్రత్యేకంగా పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి పైన మీరు చూసింది ట్రైలర్ మాత్రమే ఇంకా అనేకమైన ప్రాజెక్టులతో, గొప్ప విజన్‌తో నగర అభివృద్ధి సినిమా ముందు ఉన్నదన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న రియల్ ఎస్టేట్ బిల్డర్లు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీపడుతూ ముందుకు పోవలసిన అవసరం ఉన్నది.
ముంబై తర్వాత అతిపెద్ద ఎత్తైన భవనాలు కలిగిన నగరం హైదరాబాద్
వినూత్నమైన ఆకృతులతో అద్భుతమైన భవనాలను నిర్మాణం చేయాలని రియల్ ఎస్టేట్ సంస్థలను కోరుతున్నానన్నారు. మీరు నిర్మించే భారీ భవనాలు హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా మిగులుతాయన్న విషయాన్ని తమ డిజైన్ల రూపకల్పన సమయంలో పరిగణలోకి తీసుకోవాలన్నారు. దేశంలో హైదరాబాద్ నగరం ముంబై తర్వాత అతిపెద్ద ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా నిలిచింది.
గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల మేరకు భవనాలు నిర్మించాలని సూచించారు. దేశంలోనే రెండవ అతి తక్కువ ఇండ్ల ధర కలిగిన నగరంగా హైదరాబాద్ ఉంది. ఇది భవిష్యత్తులోనూ కొనసాగాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజలు కొనగలిగే ధరల్లో ఇండ్లు అందుబాటులో ఉండాలి. కేవలం నగరంలో ఒకే వైపు కాకుండా అన్ని వైపుల కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తమ ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ప్రజల ఆశీస్సులు, దీవెనలతో నగర ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.