సమైక్య పాలనలో నిధులు, నీళ్లు, నియామకాల్లో అన్యాయంతో అరిగోస పడ్డ తెలంగాణను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఓ దారిలో పెట్టారు. తన చాణక్యంతో ఆర్థిక వనరులను సృష్టిస్తూ రాష్ట్రంతోపాటు అన్ని వర్గాలను అభివృద్ధిబాట పట్టించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లకు ప్రతినెలా ఠంచన్‌గా పింఛన్ అందజేస్తూ.. వారు ఒకరిపై ఆధారపడకుండా సంక్షేమ పాలన అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ విజన్‌తో వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ.. ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ నిత్య పరిశ్రమతో రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. అయితే, ఇది కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతున్నది. నిరుపేదలు, అభాగ్యులను ఆదుకొనేందుకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న ఆసరా పింఛన్లను మద్యం అమ్మాకాలతో ముడిపెడుతూ దిగజారుడు రాజకీయం చేస్తున్నది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు హస్తం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో మద్యం అమ్మకాలను ఆసరా పింఛన్లతో ముడిపెడుతూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలోని పింఛన్‌దారులందరూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మధుయాష్కీ మాటల్లో నిజమెంత?
రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అసత్య ఆరోపణలు చేశారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో మద్యం అమ్మకాల ద్వారా రూ. 2లక్షల కోట్ల ఆదాయం వస్తే.. తెలంగాణ సర్కారు పింఛన్ల కోసం రూ. 68 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. మిగతా సొమ్మును దాచిపెడుతున్నదని అబద్ధాలు వల్లెవేశారు. తెలంగాణ సర్కారును బదనాం చేసే కుట్రకు తెరలేపారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ది, దేశ, విదేశ కంపెనీలనుంచి పెట్టుబడులు తీసుకురావడం, రాష్ట్ర పన్నుల వసూళ్ల రూపంలో రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నారు. వాటినుంచే ఆసరా పింఛన్లకు ఏటా రూ. 12వేల కోట్లు.. రైతుబంధు కింద అన్నదాతల అకౌంట్లలో రూ. 15 వేల కోట్లు వేస్తున్నారు. ఇవేగాక గొర్రెల పంపిణీ, ఉచిత చేపపిల్లలు, దళితబంధు, చేతి, కులవృత్తిదారులకు లక్ష సాయంలాంటి అనేక పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు. అయితే, ఇవన్నీ కాంగ్రెస్ నేత మధుయాష్కీకి కనిపించకపోవడం శోచనీయమని తెలంగాణ మేధావులు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ వివిధ మార్గాల్లో సంపద సృష్టించి.. పేదలకు పంచుతుంటే కాంగ్రెస్ పార్టీనాయకులు ఓర్వలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కేవలం మద్యం అమ్మాకాలతోనే తెలంగాణ సర్కారు నడుస్తుందనే కోణంలో దిగజారుడు వ్యాఖ్యలు చేసి మధుయాష్కీ తన పార్టీ కుటిలబుద్ధిని బయటపెట్టారని అందరూ మండిపడుతున్నారు. రాష్ట్రంపై ప్రేమలేని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని హస్తం పార్టీ నేతలకు ఓటెందుకు వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.