mt_logo

రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహేశ్వరం పరిధిలోని తుక్కుగూడలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ కూరగాయలతో పాటు మాంసం విక్రయాలకు సంబంధించి మార్కెట్‌లో సదుపాయాలు కల్పించనున్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణానికి 4 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయగా, 108 గదులతో వేర్వేరుగా వెజ్, నాన్‌ వెజ్ బ్లాక్‌లను నిర్మించనున్నారు. అలాగే తుక్కుగూడకు మంచినీటి పైప్‌లైన్‌ నిర్మాణానికి, జల్​పల్లిలో రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్ పక్కనే ఉన్న జల్​పల్లికి గతంలో మంచినీటి కొరత ఉండేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ బాధ లేదనడం సంతోషకరమన్నారు. ఇక్కడ మంచినీటి సరఫరా కోసం 72 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ స్థలం లేనందున వక్ఫ్ బోర్డు జాగా నుండి మునిసిపల్ ఆఫీస్, మిగితా వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రైనేజి, రోడ్ల కోసం నిధులు అడిగారని, త్వరలో వాటిని మంజూరు చేస్తామన్నారు. మామిడిపల్లి వద్ద నూతన రోడ్డుకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పట్టణంలో కనీస అవసరాలు తీరాలనే ఉద్దేశ్యంతో వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠదామాలు, లైట్స్, రోడ్స్ ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న కార్పొరేషన్లు, మునిసిపల్ లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరగా, వాటిని మంజూరు చేశామన్నారు. మన ఊరు మన బడి పేరుతో సర్కారు బడుల్లో మౌలికసదుపాయాలు ఏర్పరుస్తున్నామని వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో గల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఓ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *