తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా 20వ సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సదస్సు థీమ్‌తోపాటు లోగోను ఆవిష్కరించారు. బయో ఏషియా- 2023 సదస్సు లోగోను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొవిడ్ అనంతరం ప్రపంచం సాధారణ స్థితికి చేరుకొంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ సదస్సును అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. పరిశోధకులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, విధాన నిర్ణేతలు ఆరోగ్య సంరక్షణపై చర్చించి నూతన పరిష్కార మార్గాలను అందిస్తారని పేర్కొన్నారు. “అడ్వాన్సింగ్ ఫర్ వన్-షేపింగ్ ది నెక్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్” అనే థీమ్‌తో నిర్వహించనున్న ఈ సదస్సు ద్వారా రానున్న తరాలకు సరసమైన ధరల్లో మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నారు. గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగంలో ప్రపంచంలోనే ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించింది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల తయారీలో కీలకపాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకొన్నది. మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థలు కుదుట పడుతున్న ప్రస్తుత సందర్భంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల ప్రముఖులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రతినిధులు మరోసారి ఒకే వేదికపైకి వచ్చి చర్చించనున్నారు. డాటా, అనలిటిక్స్, కృత్రిమమేధ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తదితర సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో బయోఏషియా సదస్సును నిర్వహిస్తున్నారు. నూతన ఆవిష్కరణలను, స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా ఈ వేదిక ఆరోగ్య సంరక్షణ రంగంలోని అధిపతులు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, రెగ్యులేటర్లు, పెట్టుబడిదారులను సదస్సు ప్రోత్సహిస్తుంది. కాగా గత ఏడాది కరోనా నేపథ్యంలో బయో ఏషియా-2022 సదస్సును వర్చువల్‌గా నిర్వహించగా.. 70 దేశాలకు చెందిన 37,500 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. పలువురు నోబెల్ బహుమతి విజేతలు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెక్స్ గోర్క్సి, నోవార్టీస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్, మెడ్‌ట్రోనిక్ చైర్మన్ జియోఫ్ మార్తా వంటి ప్రముఖులు పాల్గొనడం విశేషం.