సిద్దిపేట : గర్ల్స్ కళాశాలలో ఆధునీకరణ చేసిన కళాశాల భవనం, సింథటిక్ ట్రాక్, బాస్కెట్ బాల్ ప్లే గ్రౌండ్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. నేను ఊహించిన విధంగా, కలలు కన్న విధంగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసుకుని ప్రారంభించు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఒకప్పుడు సర్కారు స్కూల్ అంటే పెచ్చులు ఊడటం, పాడుబడిన గోడలు, ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉండేది. 5 కోట్లతో అభివృద్ధి పరుచుకున్నాం అన్నారు. అన్ని వసతులు ఉంటే.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అసాంఘిక శక్తులు స్కూల్ ప్రాంగణంలో అడుగుపెట్టకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలి.
10/10 తెచ్చుకుంటే ఆపిల్ ఐప్యాడ్ బహుమతి
ఒకప్పుడు చేరడానికి ముందుకు రాని వారు నేడు ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా చేరుతున్నారు. అద్భుతమైన ఫలితాలు సాధించేలా స్టాఫ్ కృషి చేయాలని సూచించారు. 10/10 తెచ్చుకుంటే ఒక్కో విద్యార్థికి 10 వేల బహుమానం ఇచ్చానని తెలిపారు. మీరు కూడా 10/10 తెచ్చుకుంటే ఆపిల్ ఐప్యాడ్ బహుమతిగా ఇస్తానన్నారు. తెలంగాణ రాకముందు 60 యేండ్లల్లో 400 కాలేజీలు ఉంటే ఇప్పుడు 1340 జూనియర్ కాలేజీలు చేసుకున్నామన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 30 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 34 కు పెంచుకున్నం. అభివృద్ధిలో, విద్యలో, ఆలయాల్లో అన్నింటిలో సిద్దిపేట అగ్రభాగాన నిలుస్తోందన్నారు.
185 హైస్కూల్ లకు స్పోర్ట్స్ కిట్స్
విద్యార్థులకు మెస్ చార్జీలను కూడా ప్రభుత్వం ఇటీవలే పెంచిందని గుర్తు చేశారు. ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూళ్లను మొదటి ప్రాధాన్యత గా నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి పరుచుకుందాం అన్నారు. విద్య మీద దృష్టి పెట్టండి.. ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 85 గ్రామ పంచాయతీల్లోని 185 హైస్కూల్ లకు స్పోర్ట్స్ కిట్స్ ను అందిస్తున్నామని పేర్కొన్నారు.