కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని, ఇతర అభివృద్ధి పనులను మంత్రులు హరీశ్ రావు, మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఒక్క సర్కారు దవాఖాన తీసుకురాలేదు. మా ప్రభుత్వం 3 ఆసుపత్రులు కొడంగల్ నియోజక వర్గానికి మంజూరు చేసిందని తెలిపారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు నేను సర్కారు దవాఖానకు పోతా అంటున్నారు. కొడంగల్‌లో 46 తండాలు గ్రామ పంచాయతీలు చేశాం. నారాయణ్‌పేట్‌లో 180 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. ఇక్కడి ప్రజల మంచి నీటి కష్టాలు తీర్చింది కేసీఆరే అని స్పష్టం చేసారు.
కడుపులో ఉన్నది బయట పెట్టిండు
నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఇంటింటికీ నల్లా వచ్చింది. రేవంత్ రెడ్డి ఉంటే పదేళ్లు అయినా మంచి నీళ్ళు రాకపోతుండే. సీఎం పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించారు. కృష్ణా నీళ్ళు నార్లాపూర్ వచ్చాయి. ఏడాది లోపల మీ పొలం వాకిళ్ళకు నీళ్ళు వస్తాయి. మీ కాళ్ళు కడిగి రుణం తెర్చుకుంటాం అన్నారు. మాటలు కావాలంటే రేవంత్ రెడ్డి దిక్కు, అభివృద్ధి కావాలంటే నరేందర్ రెడ్డి దిక్కు ఉండాలి. మొత్తం లక్షా 50 వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, 24 గంటల కరెంట్ దండగ అని రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి అన్నడు మూడు గంటల కరెంటు చాలు అని కడుపులో ఉన్నది బయట పెట్టిండని అన్నారు.
12 లక్షల పెళ్లిళ్లకు 11 వేల కోట్లు ఇంచింది కేసీఆర్
మూడు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలి. ఇక్కడ పని చేయలేదని ఓడ గొడితే, మల్కాజ్‌గిరి పోయిండు అక్కడ ఏం పని చేయలేదు. మీ పక్కనే కర్ణాటక ఉంది. అక్కడ కల్యాణ లక్ష్మి ఉందా? అని అడిగారు. 12 లక్షల పెళ్లిళ్లకు 11 వేల కోట్లు ఇంచింది కేసీఆర్ అని తెలిపారు. కర్ణాటకలో మూడు రోజులకు ఒకరోజు నీళ్ళు, అక్కడ పింఛన్లు 600, ఇక్కడ 2000 అని తెలిపారు. 4 వేలు ఇచ్చే మొహం అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. లేదా మీరు అధికారంలో ఉన్న రాష్ట్రములో ఇచ్చి చూడాలన్నారు.
రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీఆర్ఎస్సే
ఓట్ల కోసం లేనిపోని మాటలు చెబుతున్నారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేస్తాడా.. బిజెపి లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ అని తెలుస్తున్నది. గెలిచేది, వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. వెనుకబడ్డ ప్రాంతానికి కృష్ణా జలాలు తెచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు కూడా విచారణ జరగాలని స్పష్టం చేసింది. విచారణ అయ్యేది ఖాయం, జైలుకు వెళ్లేది ఖాయం అన్నారు.
మహిళల కోసం సీఎం గారు అనేక కార్యక్రమాలు చేశారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్, గృహలక్ష్మి ఇలా చేశారు. త్వరలో మేనిఫెస్టో వస్తుంది. మహిళలను మరింత బలోపేతం చేసే విధంగా ఉంటుంది. మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు మేనిఫెస్టోలో ఉంటాయి. త్వరలో శుభవార్త వింటారని పేర్కొన్నారు.