mt_logo

ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం

  • ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
  • జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి

 హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరల  పంపిణీ, యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు  క్రీడా పరికరాల కిట్లను అందచేసే కార్య క్రమాలను ముమ్మరంగా కొనసాగించాలని ఆదేశించారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం  

బతుకమ్మ చీరెల పంపిణీ, యువతకు స్పోర్ట్స్ కిట్ ల అందచేత, ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలు పై  సీఎస్ శాంతి కుమారి నేడు రాత్రి జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత కార్యదర్శులు, కమీషనర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ క్రింది ఆదేశాలను సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకు చేశారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహార పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక పాఠశాల ను జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతో ఎంపిక చేసి అల్పాహారం కార్యక్రమ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

85 లక్షల బతుకమ్మ చీరెల వివిధ జిల్లాలకు 

ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తారని, సీఎం  ప్రారంభోత్సవం అనంతరం అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. నగర ప్రాంతాల్లో ఈ అల్పాహారాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లొస్తానిక స్వయం సహాయక బృందాల సహకారంతో ఏర్పాటు చేయాలి. బతుకమ్మ పండగ పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీని చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే 85 లక్షల బతుకమ్మ చీరెలను వివిధ జిల్లాలకు పంపించడం జరిగింది. 

రాష్ట్రంలో 18 వేల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ

ఈ నెల 14 వ తేదీ వరకల్లా బతుకమ్మ చీరెల పంపిణీ ని పూర్తి చేయాలి. రాష్ట్రంలోని యువతలో క్రీడా నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకు గాను యువతకు క్రీడా పరికరాల కిట్లను పంపిణీ చేపట్టామన్నారు. రాష్ట్రంలో 18 వేల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ.  ప్రతీ కిట్ లో టీ- షర్ట్ తో పాటు నాలుగు క్రీడా పరికరాలుంటాయని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ స్పోర్ట్స్ కిట్ ల పంపిణీ మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రతీ రోజూ నివేదికలు సమర్పించాలి.ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, చేనేత, జౌళి శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, చేనేత శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన, స్పోర్ట్స్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.