బీజేపీ ఓటు వేస్తే బోర్ల కాడ మీటర్లు, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మూడు గంటల కరెంట్ అని మంత్రి హరీశ్ రావు తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే ఒక నమ్మకం. కాంగ్రెస్ అంటే నాటకం అని వెల్లడించారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారు కేసీఆర్. ఒక్క ఛాన్స్ అని కాంగ్రెస్ అంటున్నది. 11 సార్లు గెలిచి ఏం చేసిందని అడిగారు. కనీసం మంచి నీళ్ళ గోస కూడా తీర్చలేదన్నారు. సీఎం కేసీఆర్ ఇంటింటీకి నీళ్ళు ఇచ్చారని గుర్తు చేసారు. విష జ్వరం లేవు, అంటు రోగాలు లేవన్నారు.కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటే వార్త ఇప్పుడు పోతే వార్త. మహారాష్ట్ర బీజేపీ పాలన, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంట్ కోతలు ఎక్కువ అని తెలిపారు. కానీ తెలంగాణలో 24 గంటల నిరంతర కరెంటు, రేవంత్ రెడ్డి మూడు గంటలు చాలు అంటున్నారు. ఏది కావాలో ప్రజలు తెల్చుకోవాలన్నారు.
బీజేపీ బోరు కాడ మీటర్ పెట్టాలి అంటే, కేసీఆర్ గారు తన గొంతులో ప్రాణం ఉండగా పెట్టను అన్నారు. అందుకు కేంద్రం 35 వేల కోట్లు మనకు ఇవ్వకుండా ఆపింది. బీజేపీ ఓటు వేస్తే బోర్ల కాడ మీటర్లు, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మూడు గంటల కరెంట్ అని తేల్చి చెప్పారు. ఆడబిడ్డ పెళ్లి అంటే లక్ష రూపాయలు ఇస్తున్నది కేసీఆర్ అని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో అడబిడ్డలని అమ్ముకునే దుస్థితి.. నేడు ఆడ బిడ్డ ఇంటికి లక్ష్మి అయ్యిందని అన్నారు.
కాంగ్రెస్ తండాలు గ్రామ పంచాయతీ చేస్తానని మోసం చేసిందని గుర్తు చేసారు. బీఆర్ఎస్ సుసాధ్యం చేసింది, భుక్యా జాన్సన్ నాయక్ మంచి వ్యక్తి. బాగా చదువుకున్న వ్యక్తి, గత వ్యక్తి లాగా అవినీతి పరుడు కాదని సూచించారు. మా కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి. కేటీఆర్‌కు మంచి దోస్త్, యువకుడు, విద్యావంతుడు జాన్సన్ మీ ఎమ్మెల్యే అయితే ఖానాపూర్ దశ, దిశ మారుతుందని చెప్పారు. 32 రోజులు కష్టపడి గెలిపించండి. జాన్సన్ 5 ఏళ్లు మీకు సేవ చేస్తాడు. కోర్టుల్లో కేసులు వేసేవారు మనకు వద్దని తేల్చి చెప్పారు. 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. దానికి రైతు బంధు, రైతు బీమా ఇచ్చాడు. మిగిలిన వాటికి కూడా పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టో ను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సూచించారు.