mt_logo

తెలంగాణ‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌.. కిటెక్స్ ప్రారంభోత్స‌వంతో న‌యాజోష్‌!

కాక‌తీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ (కేఎంపీటీ).. ఇది భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్.  వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట‌లోని ఈ పార్కుకు 2017 అక్టోబ‌ర్ 22న సీఎం కేసీఆర్‌  శంకుస్థాపన చేశారు. దీన్ని శాయంపేట్, సంగెం మండలం చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక తయారీ సౌకర్యాలు , సమీకృత సాధారణ మౌలిక సదుపాయాలతో టెక్స్‌టైల్, అపెరల్ పరిశ్రమ కోసం పారిశ్రామిక స్థలాన్ని అందిస్తుంది. దీన్ని ఇంటిగ్రేటెడ్ మోడల్‌లో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే గణేశా ఎకోస్పేర్‌ సంస్థ ఇక్క‌డ ఉత్పత్తి ప్రారంభించ‌గా.. తాజాగా దక్షిణ కొరియా దుస్తుల తయారీ దిగ్గజం యంగ్‌వన్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అలాగే, చిన్న పిల్లల దుస్తుల తయారీ ప్రపంచ దిగ్గజ సంస్థ కిటెక్స్‌ త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నది. షెడ్ల నిర్మాణంతోపాటు మిషన్ల ఏర్పాటు పూర్తికావడంతో కంపెనీలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. వచ్చే నెలలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించారు. కిటెక్స్‌, యంగ్‌వన్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తే ఇక అతి త్వరలోనే అగ్రరాజ్యం అమెరికాతో పాటు విదేశాలకు తెలంగాణ నుంచి బట్టలు ఎగుమతి కానున్నాయి. లక్ష మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

కిటెక్స్‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్‌

దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్‌గా కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రూపుదిద్దుకుంటున్న‌ద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సుమారు 1,350 ఎక‌రాల విస్తీర్ణంలో ఆ టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఆ పార్క్‌కు చెందిన కొన్ని ఫోటోల‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. రాబోయే కొన్ని నెల‌ల్లోనే కిటెక్స్ యూనిట్ల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తార‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. టెక్స్‌టైల్ ఉత్ప‌త్తి రంగంలో వ‌రంగ‌ల్ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ఆక్ర‌మించుకోనున్న‌ద‌ని వెల్ల‌డించారు.