కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యతనిచ్చారు. కేవలం మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, మూడు పంటలకూ నీళ్లందించారు. రైతుబంధు అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి రెండు పంటలకు ఎకరానికి రూ. పదివేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతు బీమా అమలు చేసి అన్నదాత ఏవిధంగా చనిపోయినా రూ. 5 లక్షలు ఇచ్చి రైతుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు. 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, ఉచిత ఎరువులు, పండిన ధాన్యం మొత్తం కొనుగోలుతో తెలంగాణ కిసాన్ సర్కార్‌లా మారిపోయింది. ఫలితంగా తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో దేశానికే అన్నపూర్ణగా తయారైంది. ఈ రైతు సంక్షేమ పథకాలు యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ అడుగుపెట్టగా, అక్కడి అన్నదాతలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణలాంటి పథకాలు తమకూ కావాలని పట్టుబడుతున్నారు.
రైతుబంధు ఇవ్వాల్సిందేనని మహారైతు పట్టు
అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ రైతుబంధు పథకం తమకూ కావాలని మహారాష్ట్ర రైతులు పట్టుబడుతున్నారు. తెలంగాణ సర్కారు తరహాలో ఏటా ఎకరానికి రూ. పదివేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను ఇక్కడకూడా అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వారు కదం తొక్కేందుకు కదిలివస్తున్నారు. మహారాష్ట్రలోని పర్భణీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈ నెల 22న వేలాది మంది రైతులు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనకు ప్రణాళిక రచించారు. తమను వెంటనే ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ మహారాష్ట్ర సర్కారుకు అల్టిమేటం జారీచేశారు. ఔరంగాబాద్ మాజీ కమిషనర్ సునీల్ కేంద్రేకర్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం నేతృత్వంలో నిరసనకు దిగేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో ఆదుకోకపోతే సమీప భవిష్యత్తులో లక్ష మంది రైతులు బలవన్మరణానికి పాల్పడతారని మహారాష్ట్ర సర్కారును హెచ్చరించారు.