సంగారెడ్డిలో అకాల వర్షాలతో, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. 4,300 ఎకరాల్లో పంట నష్టపోయిన 393 మంది రైతులకు పంట నష్టపరిహారం కింద 4 కోట్ల 5 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో మంత్రి హరీష్ రావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధిక వర్షాలు వస్తే ఎకరానికి ఇచ్చే 2 వేల రూపాయలు సాయం ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితిలో రైతులు వుండేవాళ్ళు. కానీ తెలంగాణ రైతు ప్రభుత్వం ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపోయిన ప్రతి రైతు ఖాతాలో వేస్తుందని గుర్తు చేశారు. రూ. 99 వేల వరకు పంట రుణాల మాఫీకి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుందన్నారు. మరో పక్షం రోజుల్లో రూ.లక్ష ఆపై ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల త్వరలో చేయబోతుంది.
రేవంత్ రెడ్డి 3 గంటలు రైతులకు చాలు అంటున్నాడు వారికి మీరే సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అంటే యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్ లో పెట్టిన ప్రభుత్వం. కేసీఆర్ రుణమాఫీ చేయడేమో అని ధర్నా చేద్దాం అనుకున్న కాంగ్రెస్ వాళ్లకు రైతులు దొరకడం లేదు. ధరణితో రైతులకే పూర్తి సర్వాధికారాలు తమ భూములపై వచ్చాయి. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ మళ్ళీ బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
సంగమేశ్వర ప్రాజెక్టుతో పంటపొలాలు సస్యశ్యామలం
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సంగమేశ్వర ప్రాజెక్టుతో వర్షాలు వచ్చినా రాకపోయినా సంగారెడ్డి జిల్లాలో పంటపొలాలు సస్యశ్యామలం. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలో గీతా రెడ్డి ఆధ్వర్యంలో కరెంట్ బాధలు వర్ణనాతీతమని చెప్పారు. మూడు గంటల కరెంటు ఇస్తామనే కాంగ్రెస్ కావాలో, బాయిలకాడ మీటర్లు పెడతామన్న బీజేపీ కావాలో మూడు పంటలు.. 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన కేసీఆర్ కావాలో మీరే చెప్పండని అడిగారు.