mt_logo

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో కీల‌క ఘ‌ట్టం.. ఏకకాలంలో 35 పంపులతో ఎత్తిపోతలు

  • లక్ష్మీబరాజ్ టు రంగనాయకసాగర్ జ‌ల‌ప‌రుగులు
  • నిండుకుండలా అన్నపూర్ణ, రంగనాయక సాగర్

స‌ముద్రంలోకి వృథాగా పోతున్న ప్రాణ‌హిత నీటిని ఒడిసిప‌ట్టి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా ఉత్త‌ర తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని ఎస్సారెస్పీకి  జీవం పోసింది తెలంగాణ స‌ర్కారు. ఇందుకోసం ఏకంగా న‌ది నుంచే నీటిని ఎత్తిపోసే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. కాలం కాకున్నా సాగుకు ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు అధికారులు  కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీతోపాటు అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌లోకి తరలిస్తున్నారు. కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. కాగా, ప్రాజెక్టు చ‌రిత్ర‌లోనే మ‌రో కీల‌క ఘ‌ట్టానికి చేరుకొన్న‌ది. ప్రాజెక్టు ప్రారంభం త‌ర్వాత తొలిసారిగా ఏక‌కాలంలో 35 పంపుల‌ను ఆన్ చేసి కాళేశ్వ‌ర జ‌లాల‌ను త‌ర‌లిస్తున్నారు. ఒకేసారి 35 పంపులు న‌డుస్తుండ‌టంతో లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి గాయత్రి వరకు జలాలు ప‌రుగులు పెడుతున్నాయి.  లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి సరస్వతి, పార్వతి పంపహౌస్‌ బరాజ్‌లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి టన్నెల్స్‌ ద్వారా నందిమేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లకు అక్కడి నుంచి వరద కాలువలోకి జలాలను తరలిస్తున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా వరద కాలువ నుంచి ఎగువన రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట, ముప్కాల్‌ పంప్‌హౌస్‌ల ద్వారా ఎస్సారెస్పీలోకి అర టీఎంసీ జలాలను తరలిస్తున్నారు. మిగిలిన జలాలను వరద కాలువ ద్వారా రాజరాజేశ్వర జలాశయానికి, అక్కడి నుంచి అన్నపూర్ణకు, తద్వారా రంగనాయకసాగర్‌కు జలాల తరలింపు కొనసాగుతున్నది. 

రంగనాయకసాగర్‌, అన్న‌పూర్ణ‌కు జ‌ల‌క‌ళ‌..

కాళేశ్వరం జలాలను నిరంత‌రాయంగా త‌ర‌లిస్తుండ‌టంతో రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. జలాలను ఎత్తిపోసి అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపాలనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఇరిగేషన్‌ అధికారులు ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు.  అన్నపూర్ణ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 3.5టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3 టీఎంసీలకు చేరుకున్నది. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 3టీఎంసీలు కాగా, ప్రస్తుతం అది 2.8 టీఎంసీలకు చేరుకున్నది. ఆ రెండు రిజ‌ర్వాయ‌ర్లు కాళేశ్వ‌ర జ‌లాల‌తో నిండుకుండ‌ను త‌ల‌పిస్తున్నాయి.