mt_logo

కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు : మహారాష్ట్ర నాయకుల బృందం

  • సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నేడు తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచింది 
  • ఇంతటి గొప్ప ప్రాజెక్టును చూడలేదన్న మహారాష్ట్ర సీనియర్ నాయకుడు భాను దాస్ మార్కుటే

కాలం గాని కష్టకాలంలో తెలంగాణ రైతాంగానికి వ్యవసాయానికి ప్రాణాధారమైన ప్రాణహిత నది జలాలను ఎత్తిపోస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి దశదిశలా విస్తరిస్తున్నది.  ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ  సాగు నీటిని అందించి, రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనుకున్న సీఎం కేసీఆర్ కలను నిజం చేస్తూ..  నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నదీ జలాలు ఎగువకు పయనిస్తూ ఎస్సారెస్పీ చేరుకొని రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది. వర్షాభావ పరిస్థితుల్లోనూ  తెలంగాణ సాగుభూములకు నీటిని అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత సీఎం కేసీఆర్ గారి దార్శనికత నేడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నది. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేడు వందల కిలోమీటర్ల గోదావరి నది సజీవ ధారగా మారి, తడారిపోయిన తెలంగాణ సాగుభూములను తడుపుతూ పచ్చని పంటలను పండిస్తున్న తీరుతో పుడమి పులకిస్తున్నది. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకెక్కిన ఇంతటి గొప్ప ప్రాజెక్టును సందర్శించేందుకు దేశవ్యాప్తంగా నీటి రంగ నిపుణులు, పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు, మేధావులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే క్యూ కడుతున్నారు. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి ఆకర్షితులై  మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ పార్టీ  నాయకులతో  పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు.

సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నేడు తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచింది 

సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల వంశీధర్ రావు  ఆధ్వర్యంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఈ సందర్భంగా  కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు మ్యాప్ ల ఆధారంగా మహారాష్ట్ర నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను వివరించారు. నీటిని ఎత్తిపోస్తున్న తీరు, పంపుల సామర్థ్యం, వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలను వారికి వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ తెలంగాణ వ్యవసాయ భూములకు సాగునీటిని అందిస్తున్న తీరును మ్యాప్ ల ఆధారంగా స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యాచరణను, సీఎం కేసీఆర్ దార్శనికతను నాయకులు ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నేడు తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచిందని వారు కొనియాడారు. సాగునీటిరంగంతో పాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణ సాధిస్తున్న ప్రగతి నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తీరుతో ఇతర రాష్ట్రాలు తెలంగాణ బాటలో పయనిస్తున్నాయని వారన్నారు. 

మా జీవితంలోనే ఇంతటి గొప్ప ప్రాజెక్టను చూడలేదు 

తన జీవితంలోనే ఇంతటి గొప్ప ప్రాజెక్టను చూడలేదని మహారాష్ట్ర సీనియర్ నాయకుడు భాను దాస్ మార్కుటే అన్నారు. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాజెక్టును  చూడబోమని అన్నారు. 32 దేశాలను తిరిగిన తాను ఇలాంటి మానవ నిర్మిత అద్భుతాన్ని ఎక్కడా చూడలేదని అన్నారు.  సీఎం కేసీఆర్ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరని ప్రశంసించారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టును కళ్ళారా చూసిన తన జన్మ ధన్యమైందని భాను దాస్ మార్కుటే తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన వారిలో మహారాష్ట్ర  సీనియర్ నాయకుడు, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన భాను దాస్ మార్కుటే, అహ్మద్ నగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు అరుణ్ కదూ, ఎన్సీపీ  నేత బాలాసాహెబ్ విఖే పాటిల్ లతో పాటు  మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్నాసాహెబ్ మనే, ఘనశ్యాం  అన్నా షెలార్, ప్రహ్లాద్ రాథోడ్, శరద్ పవార్, బాల సాహెబ్, అరుణ్ కొడు, ఏకనాథ్ గోగాడే తదితరులున్నారు. వీరి వెంట ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు వంశీధర్ రావు, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు తదితరులున్నారు.