హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభించిన ఎస్టీపీలను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ నేతల బృందం సందర్శించింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరాన్ని పూర్తి మురుగునీటి రహిత నగరంగా మార్చే ప్రయత్నం చేశాం అని తెలిపారు.
కేసీఆర్ దృఢ సంకల్పం, ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ ఎస్టీపీని మా పార్టీ బృందం సందర్శించింది. ఎస్టీపీల సందర్శనల్లో ఇది మొదటి అడుగు మాత్రమే.. మిగిలిన ఎస్టీపీలను కూడా సందర్శిస్తాం అని పేర్కొన్నారు.
100% మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని మ ప్రభుత్వ లక్ష్యంగా ఉండే.. ఈ శుద్ధి చేసిన పూర్తి స్వచ్ఛమైన నీరు మూసీ నదిలోకి పోతుంది. హైదరాబాద్ నగరంలోని 94 శాతం స్వచ్ఛమైన నీరు మూసికి వెళ్తున్నప్పుడు మూసి నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగారు.
100% మురుగునీటి శుద్ధి జరిగిన తర్వాత మూసి ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రులు, ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు, రూ. 70,000 కోట్లు, రూ. 1,50,000 కోట్లు అంటూ పూటకు ఒక మాట మాట్లాడుతున్నారు. అందుకే ఈ మూసీ నది ప్రక్షాళనపైన అనేక అవినీతి తాలూకు అనుమానాలు వస్తున్నాయి అని అన్నారు.
గత ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలో వడ్డించిన విస్తరిలాగా హైదరాబాద్‌ను అందించింది. హైదరాబాద్ నగరంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేం అని ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతున్నారు. అదే నిజమైతే మూసీ నది నుంచి తొలగించే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎట్లా ఇస్తామన్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు.
మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం భారీగా భూమిని సేకరించి సిద్ధంగా ఉంచితే అది రద్దు అంటూ పూటకో మాట మాట్లాడుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మురికి నీటి శుద్ధిని పూర్తి చేసిన తర్వాత అదే అంశం పేరుతో మరో నాటకానికి తెరలేపారు. గతంలో మా ప్రభుత్వం చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని సూచించారు.
ఈ పబ్లిసిటీ స్టంట్లు మానేసి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను డబుల్ చేయండి, తులం బంగారం ఇవ్వండి, మహిళలకు రూ. 2,500 ఇవ్వండి రైతులకు రైతు భరోసా ఇవ్వండి. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు మంచిగా గుర్తిస్తూనే ఉంటారు. అయితే గతంలో మేము ప్రారంభించిన ఈ ఎస్టీపీల నిర్మాణంలో వేగం తగ్గింది అని అన్నారు.
అన్ని సిద్ధంగా ఉన్నా ప్రాజెక్టుని వేగం తగ్గించే ప్రయత్నం చేస్తుంది.. రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయమనే తీరు నడుస్తుంది. ముఖ్యమంత్రి అన్నలకు ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం నడుస్తుంది అని దుయ్యబట్టారు.
హైదరాబాద్ నగరంలో ఎక్కడ పేదల ఇల్లు కూలకొట్టినా.. హైదరాబాద్ నగరంలో మేం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వండి. మొన్న హైడ్రా వాళ్ళు ఇల్లు కూలకొట్టినప్పుడు చిన్న పాప వేదశ్రీ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక కార్యచరణ ప్రకటిస్తాం అని కేటీఆర్ తెలిపారు.