హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఎస్టీపీల సందర్శన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలు చేస్తుంది అంటూ మండిపడ్డారు. బలిసినోడికి ఒక న్యాయం, పేదోళ్లకు మరొక న్యాయం అంటే ఊరుకునేది లేదు. దమ్ముంటే పర్మిషన్లు ఇచ్చినోళ్లు, బిల్డర్లపై చర్యలు తీసుకో అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
ఆక్రమణలు, తప్పుడు పర్మిషన్లు ఇచ్చిందే కాంగ్రెసోళ్లు.. మీ మంత్రులు, మీ అన్న ఇళ్లు కూల్చేసి నిజాయితీ నిరూపించుకో. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ న్యాయపరంగా అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు.
బ్లాక్‌లిస్ట్ అయిన పాకిస్థాన్ కంపెనీకి మూసీ కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూసీపై మీ అవినీతి ఆలోచనలను ప్రజలు, మేము గమనిస్తున్నాం. ప్రభుత్వానికి మానవీయ కోణం ఉండాలి అని హితవు పలికారు.
హైదరాబాద్ ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు. వారి సమస్యలపై మాట్లాడే బాధ్యత మాపై ఉంది. వేదశ్రీ అనే ఏడేళ్ల పాప పుస్తకాలు తీసుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా వాళ్ల ఇళ్లు కూల్చేశారు. కస్తూరి అనే మహిళ చెప్పుల దుకాణం నడుపుకుంటే ఆమె దుకాణాన్ని తొలగించారు. ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి సామాను తీసుకోవటానికి కూడా సమయం ఇవ్వలేదు. పేదోళ్ల ఇళ్లు కూల్చేస్తున్న సంఘటనలు హృదయ విదారకంగా ఉంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహారిస్తోంది. ఫుట్‌పాత్‌ల మీద ఉండే వాళ్లు కష్టపడి పనిచేసుకొని బతికే పేదోళ్లే. వాళ్లను తొలగించాలంటే వెండింగ్ జోన్ పెట్టాలే.. మేము అలా చేశాం. ప్రభుత్వానికి మానవీయ దృక్పథం ఉండాలే. బలిసిన వాళ్లకు ఏమీ కాదు.. పేదవాళ్లకే కష్టం అని అన్నారు.
మూడు రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్లను కూలగొడుతున్నారు. ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏమీ చేస్తోందో.. ఎడమ చేతికి తెలియటం లేదు. ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడా? సర్కస్ నడుపుతున్నాడా? అని దుయ్యబట్టారు.
బఫర్ జోన్‌లో ఉంటే పర్మిషన్ ఇచ్చిన వాడిపై చర్యలు తీసుకోవాలే.. బాధితులకు బాధకు ఎవడు బాధ్యత వహిస్తారు. కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఇళ్లు కూల్చేస్తే నష్టం ఎవరు భరిస్తారు. హైడ్రా బాధితులందరికీ మా లీగల్ సెల్ అండగా ఉంటుంది. తెలంగాణ భవన్‌కు వచ్చి గానీ మీ ఎమ్మెల్యేలను గానీ సంప్రదించండి అని కేటీఆర్ సూచించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రిది ఒక మాట. ఇప్పుడు ఒక మాట. మేము ఒక్క ఇళ్లు కట్టలేదని అన్నారు. ఇప్పుడు అదే ప్రభుత్వం మేము కట్టిన ఇళ్లను మూసీ బాధితులకు ఇస్తామని చెబుతోంది. మీరు ఇళ్లు తాళాలు ఇచ్చిన తర్వాతే.. వాళ్లను తొలగించాలి అని అన్నారు.
మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసుడు. మీ ప్రభుత్వమే కూలగొట్టే చిల్లర పనులు చేయకండి. ఒక లక్ష ఇళ్లు మేము ఇచ్చాం. నీకు చిత్తశుద్ది ఉంటే పేద వారి కోసం మరిన్ని ఇళ్లు నిర్మించు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
హెచ్ఎండీఏ భూములు దాదాపు వెయ్యి ఎకరాలు అమ్ముతారని తెలిసింది. ఆ పైసాలు హైదరాబాద్‌లోని పేదలకే ఖర్చు చేయాలి. మీరు హైడ్రా పేరిట డ్రామాలు చేస్తామంటే మేము ఊరుకోం. బాధితులకు అండగా ఉంటాం. మీ దౌర్జన్యాలు, దాష్టీకాలు ఇలాగే కొనసాగితే మీ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం అని హెచ్చరించారు.
ఆక్రమణలు, వాటికి పర్మిషన్లు ఇచ్చిందంటే అది మీ కాంగ్రెస్ హయాంలోనే.. గత 70 ఏళ్లుగా ఆక్రమణలు జరిగాయి. ఆక్రమణలను మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించం. కానీ అభాగ్యులకు, పేదలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలి. జీహెచ్ఎంసీ, హైడ్రా ఆఫీస్, మీ అన్న ఇళ్లు కూడా నాలాలు, బఫర్ జోన్‌లోనే ఉన్నాయి. మీ మంత్రుల ఫామ్ హౌస్‌లు కూడా బఫర్ జోన్‌లో ఉన్నాయి. వాటిని ముందు కూలగొట్టి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో అని రేవంత్‌కు సవాల్ విసిరారు.
ఇది మొదటి సందర్శన మాత్రమే. తర్వలోనే అన్ని నియోజకవర్గాలకు వెళ్తాం. మూసీ విషయంలో కూడా మీ మాటలు గమనిస్తున్నాం. ఒకసారి రూ. 50 వేల కోట్లు, మరొకసారి రూ. 75 వేల కోట్లు, మరొకసారి రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్నారు. అసలు ఎస్టీపీలు అన్ని మేమే కట్టినా తర్వాత ఇంకా మూసీ ప్రక్షాళనకు అంత డబ్బు ఎందుకు? ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్ అయ్యిందా? అని కేటీఆర్ అడిగారు.
మూసీ బాగోతం ప్రజలు, మేము గమనిస్తున్నాం. నీ అవినీతి ఆలోచనలు చూస్తున్నాం. సరైన సమయంలో అన్ని బయట పెడతాం. బ్లాక్‌లిస్ట్ అయిన పాకిస్తాన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. ముఖ్యమంత్రి అన్నకు ఒక న్యాయం, పేదోళ్లకు మరొక న్యాయం అంటే మాత్రం ఊరుకోం. చట్టం బలిసినోళ్లకు ఒక విధంగా పేదోళ్లకు మరొక విధంగా ఉండే డ్రామాను ఎండగడతాం అని తెలిపారు.
చట్టపరంగా నిర్వాసితులకు అన్నిప్రయోజనాలను కల్పించండి. కోర్టు హాలిడే రోజు కావాలని ఉదయమే కూలగొడుతున్నారు. అభాగ్యులకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. కోర్టులను, న్యాయమూర్తులను కూడా అపహ్యాసం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. న్యాయాన్ని అపహాస్యం చేస్తున్న విధానాన్ని సుమోటోగా తీసుకోవాలని కూడా చీఫ్ జస్టిస్ గారిని కలిసి కోరుతాం అని స్పష్టం చేశారు.
బిల్డర్లు, ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలె. అభాగ్యులను ఇబ్బంది పెట్టవద్దు. ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించవద్దు. పేదవాళ్లకు అండగా ఉండాలే. సందర్భం వస్తే కాంగ్రెస్ నాయకులు పొంగులేటి, పట్నం, వివేక్, కేవీపీల ఫామ్ హౌస్‌ల వీడియోలు కూడా బయటపెడతాం. మా ప్రభుత్వ హయాంలో చెరువులను ఎలా కాపాడామో కూడా వివరంగా మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తాం అని అన్నారు.
రియల్ ఎస్టేట్ 42 శాతం పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన కార్మికులకు నష్టం జరుగుతోంది. ఒక్క కూకట్‌పల్లి నియోజకవర్గంలో నాలుగు ఎస్టీపీలు నిర్మించాం. వాటిలో పూర్తైన రెండింటిని సందర్శించాం.హైదరాబాద్ నగర ప్రజలు మాకు ఎన్నికల్లో సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చారు. వారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఫతేనగర్ లో రూ. 175 కోట్లతో ప్లాంట్ నిర్మాణం పూర్తైంది. ఖాజాకుంట్ల, ముళ్ల కత్వాల్ సహా మొత్తం నాలుగు ఎస్టీపీలను నిర్మించాం. ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు రూ. 350 కోట్లు ఖర్చుపెట్టాం అని గుర్తు చేశారు.
మురికి నీళ్ల కారణంగా ప్రజలు ఇబ్బంది పడవద్దని ఈ నిర్ణయం తీసుకున్నాం. దక్షిణాసియాలోనే వందశాతం మురుగు నీటి శుద్ది నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతోంది. దాదాపు రూ. 4 వేల కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐదు చోట్ల ఎస్టీపీలు ప్రారంభించాం. సీఎం గారు కూడా మేము కట్టిన ఎస్టీపీలు ప్రారంభించారు అని తెలిపారు.
హైదరాబాద్‌ను మురికి నీటి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ గారు సంకల్పం తీసుకొని ఆ విధంగా పనులు చేపట్టారు. మేము వచ్చే నాటికి 725 ఎల్ఎండీలు ఉంటే దానికి మరో 13 వందల ఎల్ఎండీల కోసం 31 ఎస్టీపీలను నిర్మించాం. ఇందులో విద్యుత్ కూడా తక్కువగా ఉపయోగించేలా ఎస్బీఆర్ అనే టెక్నాలజీని వినియోగించాం అని పేర్కొన్నారు.
కేసీఆర్ ముందుచూపు, బీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థత కారణంగానే ఇది సాధ్యమైంది. ఇందులో కేంద్రం పాత్ర గుండు సున్నా. కేంద్రానిది ఒక్క పైసా కూడా లేదు అని తెలిపారు.
హైదరాబాద్‌లో మత విద్వేషాలు లేకుండా విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు కేసీఆర్ గారు ఎన్నో చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఏ పండుగల ఊరేగింపులకు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. ఎన్నో ఈవెంట్లను ప్రజలకు ఇబ్బంది రాకుండా నిర్వహించాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటే కనీసం నిర్వహించలేని అసమర్థత ఈ ప్రభుత్వానిది. ట్రాఫిక్ నిర్వహణ ఇప్పడు ఎంతో దారుణంగా మారిందో చూస్తుంటే బాధేస్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పత్రికలే ఈ నగరానికి ఏమైందంటూ కథనాలు రాశాయి.. 28 రోజుల్లో 30 మర్డర్లు అంటూ హైదరాబాద్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని వార్తలు రాశాయి అని విమర్శించారు.
ఫతేనగర్ బ్రిడ్జి విస్తరణకు అప్పట్లోనే రూ. 100 కోట్లు కేటాయించాం. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ నగరం, ప్రజలపై ప్రేమ లేదు. సమస్యలు తీర్చే తీరిక లేదు. కూకట్‌పల్లిలో కూడా బ్రిడ్డి కోసం నిధులు కేటాయించాం. కానీ దానికి సంబంధించి కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదు. గత పది నెలల్లో ఒక్క కొత్త కార్యక్రమం లేదు. నగరంలో కొత్త కార్యక్రమానికి కొబ్బరికాయ కూడా కొట్టలేదు అని కేటీఆర్ దుయ్యబట్టారు.