mt_logo

ప్రభుత్వ వెబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి గత ప్రభుత్వ సమాచారాన్ని తొలగించటంపై కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని కావాలనే ఉద్దేశ పూర్వకంగా తొలగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారికి లేఖ రాశారు.

డిసెంబర్ 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందన్నారు. కొన్ని ముఖ్యమైన వెబ్ సైట్లను కూడా తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో ఇదంతా మెయింటెనెన్స్ సమస్య అని చెప్పే ప్రయత్నం చేశారన్నారు. కానీ కొన్ని నెలలుగా మరింత సమాచారం కనబడకుండా పోతోన్న సంఘటనలు చూస్తుంటే ఉద్దేశపూర్వంకగానే చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులే ఉన్నారనే సందేహం కూడా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన, అత్యంత ప్రాధాన్యమైన సమాచారాన్ని భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసేందుకు చేస్తున్న ఈ హేయమైన చర్యను ఆపాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్‌ను భద్రపర్చాల్సిన అవసరముందన్నారు. ఇలా కావాలనే తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యత భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీఎస్‌ను కోరారు.

రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన అన్ని ఆధారాలు, సమాచారం, డిజిటల్ కంటెంట్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని సీఎస్ కు గుర్తు చేశారు. కేసీఆర్ గారు సీఎంగా ఉన్న (జూన్ 2014 – డిసెంబర్ 2023) నాటి సమయంలోని వేలాది ఫోటోలు, వీడియోలతో పాటు ఎంతో సమాచారాన్ని తొలగించారన్నారు. తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలియజెప్పే సమచారాన్ని కావాలనే వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించిన వైబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను లేఖలో కేటీఆర్ జత చేశారు. పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా సమగ్రమైన సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందన్నారు.

ప్రజల ఆస్తితో ఈ సమాచారాన్నిసిద్దం చేశామని… ఇది ప్రజల ఆస్తి అని లేఖలో గుర్తు చేశారు. ఒక వ్యక్తికో, రాజకీయ పార్టీకో సంబంధించి సమాచారం కాదన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు, తర్వాత సంఘటనలకు సంబంధించి ఈ విలువైన సమాచారం శతాబ్దాల పాటు ఉండాల్సిన అవసరముందన్నారు.

కొందరి ఇష్టాయిష్టాల కోరకు ప్రజాఆస్తులను ధ్వంసం చేస్తే తెలంగాణ భవిష్యత్ తరాలు క్షమించవని.. వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కేటీఆర్ కోరారు.

2024 జనవరి తర్వాత తొలగించిన వైబ్ సైట్లు, పోర్టల్స్ వివరాలు

రాష్ట్ర చరిత్ర (https://www.telangana.gov.in/about/history/): ఈ పోర్టల్ లో తెలంగాణ పూర్వ కాలం నాటి నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు సంక్షిప్తంగా చరిత్ర సమాచారాన్ని పొందుపర్చటం జరిగింది. ఈ పేజీలోని సమాచారం తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా… ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు, పరిశోధకులు, పెట్టుబడిదారులకు ఎంతో ముఖ్యమైనది.

తెలంగాణ రిపోర్ట్స్ పేజీ (https://www.telangana.gov.in/reports/): ఇది 2014-2023 మధ్య తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అన్ని ముఖ్యమైన రిపోర్ట్స్ తో పాటు హోస్ట్ చేసిన వివరాలు ఇందులో ఉన్నాయి. విద్యార్థులు, పరిశోధకులు, పెట్టుబడిదారులకు ఇది ఎంతో విలువైన సమాచారం.

తెలంగాణ సీఎం వెబ్‌సైట్ (https://cm.telangana.gov.in/): జూన్ 2, 2014 నుండి డిసెంబర్ 3, 2023 వరకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ. కె. చంద్రశేఖర్ రావు గారికి సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్ నుంచి తీసేశారు. ఈ సమాచారాన్ని భద్రపర్చాల్సి ఉండగా…పూర్తిగా దీన్నితొలగించారు.

తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా హ్యాండిల్స్: జూన్ 2, 2014 నుండి డిసెంబర్ 3, 2023 వరకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పదవీకాలానికి సంబంధించిన వేలాది ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన సమాచారం సంబంధిత సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తీసేశారు. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. దీన్ని భద్రపర్చాల్సిన అవసరముంది.