తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా టీ హబ్ లో పరిశ్రమల శాఖ నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది ఒక్క పెట్టుబడిని రాష్ట్రానికి తేవాలంటే ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. దేశ విదేశాల నుంచి రాష్ట్రాల వరకు పోటీపడి మరీ పెట్టుబడులను ఇక్కడికి రప్పించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటన చేస్తామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకి సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తపన మమ్మల్ని ఆ పర్యటనలో కష్టపడేటట్లు చేస్తుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం విదేశాల్లో పెద్ద ఎత్తున చేపట్టే నిరంతర సమావేశాలకు అక్కడి పారిశ్రామిక వర్గాలు, దౌత్య వర్గాల నుంచి అనేకసార్లు ప్రశంసలు లభించాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఉపాధి అవకాశాలు వచ్చేలా పనిచేసిన మా పరిశ్రమల శాఖ బృందంలోని ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు, మాతో పని చేస్తున్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులు ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తే అనేక రెట్ల జీతం ప్యాకేజీ వస్తుందని సూచించారు. అవన్నింటినీ కాదనుకొని తెలంగాణ కోసం పనిచేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.. మూడు లక్షల 17 వేలతో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం కలిగి ఉంది. రాష్ట్ర GDP 2014 లో ఉన్న 5 లక్షల కోట్ల నుంచి ఈరోజు 13.27 లక్షల కోట్లకు చేరింది, 2014 లో ఉన్న ఐటీ ఎగుమతులు 57 వేల కోట్ల నుంచి 2.40 లక్షల కోట్లకు చేరాయి.
తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్
ఒకవైపు పారిశ్రామిక ప్రగతితో పాటు ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వం మాదన్నారు. ఐటీ రంగం నుంచి మొదలుకొని వ్యవసాయ రంగం దాకా అన్ని రంగాల్లోనూ తెలంగాణ తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది, గ్రామీణ పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందరి ప్రగతికి పాటుపడుతున్నదని చెప్పారు.
2014లో జరిగిన సమావేశంలో ఇన్నోవేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పాము ఆ మాట మేరకు ఈరోజు దేశంలోనే అతిపెద్ద టీ హబ్, టీ వర్క్స్ ఏర్పాటు చేశాము, రాష్ట్రం తో పాటు ప్రపంచ దేశాలతో పోటీపడి పెట్టుబడులు రప్పించాలంటే భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు ప్రపంచంలోనే సింగిల్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మసిటీని ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.
ఫార్మా రంగ ప్రగతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం
దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్కును సుల్తాన్పూర్ లో ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూనిట్ తెలంగాణలో ఉన్నది, తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా మారింది వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచంలోనే సగంకు పైగా వ్యాక్సిన్లు, హైదరాబాద్లో తయారు అవుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి అద్భుతమైన స్పందన పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్నదన్నారు.
జినోం వ్యాలీ తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగ ప్రగతికి దోహదపడినట్లుగానే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఆటోమొబైల్ రంగంలో తెలంగాణ ప్రగతికి దోహదపడుతుందన్న నమ్మకం ఉన్నది. ఐటీ రంగంలో 3.23 లక్షల మంది ఉద్యోగుల నుంచి నేడు 9.5 లక్షలకు దాదాపు మూడు రెట్ల మీద పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరిగిన పారిశ్రామిక ప్రగతి వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, రియల్ ఎస్టేట్ వంటి ఇతర రంగాల బలోపేతానికి దోహదం చేసిందని అన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి పట్ల ఒక మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా, భారతీయుడిగా గర్విస్తానన్నారు. ప్రపంచానికి దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్న ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం పట్ల గర్వంగా ఉంది. భారతదేశంలోని చిన్న రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నిర్మించింది, విద్యా, వైద్యం, సాగునీరు, తాగునీరు, పర్యావరణం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది. వివిధ అంశాల వారీగా అనేక జాతీయ అవార్డులు, ప్రపంచ ప్రశంసలు లభిస్తున్నాయి
తెలంగాణ ప్రజలు 2014లో ఉన్న పరిస్థితులను ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని బేరీజు వేసుకోవాలి. ఆ రోజుల్లో ఉన్న తాగునీరు, సాగునీరు, విద్య, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని గుండె మీద చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.