mt_logo

రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో మహిళా కమీషన్ చర్యలు తీసుకోవాలి: కేటీఆర్

మహిళా కమీషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమీషన్ ముందు హాజరయ్యాను. నేను యధాలాపంగా మాట్లాడిన మాట పట్ల విచారం వ్యక్తం చేశానని మహిళ కమీషన్ దృష్టికి తీసుకెళ్లాను అని కేటీఆర్ తెలిపారు.

చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా నేను మాట దొర్లటంపై క్షమాపణ అడిగాను. చట్టాన్ని గౌరవిస్తూ మేము కమీషన్ ముందుకు వస్తే.. మహిళా కాంగ్రెస్ నేతలు మా నాయకులపై దాడి చేశారు.. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు.

మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మేము వస్తే ఇలాంటి దాడి చేయటం సరికాదు. 8 నెలల్లో మహిళలపై జరిగిన సంఘటనలను వారికి ఇచ్చే ప్రయత్నం చేశాను. అన్ని వివరాలతో నేను వచ్చాను. మళ్లీ రావాలని కమీషన్ చెప్పటం జరిగింది.. వారిని గౌరవిస్తూ మళ్లీ వస్తాం అని పేర్కొన్నారు.

కానీ మా నాయకురాళ్లపై దాడి చేసిన ఘటన మంచిది కాదు. మా వాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళ కమీషన్ చర్యలు తీసుకోవాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కమీషన్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.