mt_logo

మానుకోట మహాధర్నా చూస్తే ప్రభుత్వం మీద ఎంత కోపం, వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది: కేటీఆర్

లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైంది. మళ్లీ అదే మనుకోట ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంతకు బుద్ధిచెప్పేందుకు సిద్ధమైంది అని పేర్కొన్నారు.

అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. అక్కడ ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారు. వారి భూములను తీసుకుంటామని చెబుతే మా ఆడబిడ్డలు 9 నెలల పాటు ధర్నా చేసి నిరసన తెలిపారు. 9 నెలలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం లేదు అని దుయ్యబట్టారు.

కానీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం 28 పైసలు కూడా తేలేదు. సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలు తిరగబడుతున్నారు. మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి, ఉరికించి కొట్టేవారు అని అన్నారు.

ఎందుకంటే ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోడీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారు. రైతుల పవర్ అంటే ఆ విధంగా ఉంటుంది. అలాంటి పవర్ ఉన్న రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. సన్నకారు, బక్కచిక్కిన రైతులతో పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వస్తుంది అని విమర్శించారు.

మా గిరిజన రైతుల కోసం కదులుతూ మానుకోటలో ధర్నా చేస్తామంటే.. లగచర్లలో జరిగిన సంఘటనకు మనుకోటలో ధర్నా ఎందుకు అని డీజీపీ గారు ప్రశ్నించారు.కొడంగల్ రైతుల కోసం ఒక్క మానుకోటలోనే కాదు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడక్కడ దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుకటి వేళ్లతో పెకిలించే దాకా వదిలిపెట్టం అని కేటీఆర్ హెచ్చరించారు.

ఎవని కోసం ఫార్మా విలేజ్.. తన అల్లుడి కోసం పేదవాళ్ల భూములను గుంజుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి తన సొంత అల్లుడు, అదానీ, అన్నగాడు, తమ్ముని కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తలేడు. మరో 10 రోజులైతే రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది అవుతుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 420 హామీలు ఇచ్చారా? ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఇక్కడున్న డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలి అని అన్నారు.

కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు టైమ్‌కి వస్తుండేనా, రైతు బీమా వచ్చిందా, 24 గంటలు కరెంట్ వస్తుండెనా? రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొంట్టిండు. ఫించన్ పెంచలేదు. బోనస్ బోగస్ అయ్యింది. ఆడ బిడ్డలకు మహాలక్ష్మి స్కీం వచ్చిందా? మహారాష్ట్రకు పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు. వీడు పచ్చి లంగా, తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేశాడని చైతన్యం ప్రదర్శించి తన్ని తన్ని తరిమేశారు అని ధ్వజమెత్తారు.

నేను ఇక్కడి వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతమని అంటున్నారు. నేను డీజీపీ, ఎస్సీ గారిని అడుగుతున్నా రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కేసులు మా మీద మాత్రమే పెడుతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు ఉండవా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతమంటే, పెట్రోల్ పోస్తామంటే భయపడతామా? మేము కేసీఆర్ తయారు చేసిన దళం. భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు.

మానుకోట రాళ్ల మహత్యం ఏందో తెలంగాణను అడ్డుకున్న వాళ్లందరికీ తెలుసు. మనుకోటలో 14 ఏళ్ల క్రితమే నిప్పు పుట్టి ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవ్వాళ మీరు పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం. వెయ్యి మంది అనుకుంటే 25 వేల మంది వచ్చారు. అంటే ప్రభుత్వం మీద ఎంత కోపం, వ్యతిరేకత ఉందో ఈ మానుకోట మహాధర్నా చూస్తే అర్థమవుతోంది అని వ్యాఖ్యానించారు.

తప్పు జరిగింది. పొరపాటు జరిగింది. ఏం బాధలేదు. 4 ఏళ్ల పాటు ప్రజలకు ఎక్కడ అన్యాయమైన కొట్లాడదాం. లగచర్లలో 30 మంది రైతులను జైల్లో పెడితే మా బంజారా ఆడబిడ్డలు భయపడలేదు. జ్యోతి అనే గర్భిణి సోదరి ఢిల్లీకి వద్దమ్మ అంటే కూడా రేవంత్ రెడ్డి భరతం పడతా అంటూ ఢిల్లీకి వరకు వచ్చింది.అక్కడ ఎన్‌హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమీషన్, మహిళ కమీషన్ సభ్యులకు వాళ్ల బాధలు చెబుతుంటే కమిషన్ సభ్యుల కళ్లలో నీళ్లు వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలకు గిరిజన బిడ్డల కష్టాలు కనిపించటం లేదు. ఏమాత్రం బాధ అనిపించటం లేదు అని ఆక్షేపించారు.

లగచర్లలో జరిగినట్లే రేపు మన అందరికీ రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు. ఒక దగ్గర అన్యాయం జరిగితే రాష్ట్రమంతా కదం తొక్కాలి. తెలంగాణలో ఏ గిరిజన బిడ్డ కు అన్యాయైన రాష్ట్రమంతా గిరిజన బిడ్డలు కదం తొక్కాలని కోరుతున్నా. గతంలో మీరే కదా కేసీఆర్‌ను డిమాండ్ చేస్తే ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను పది శాతం చేశారు. తండాలను గ్రామపంచాయితీలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఐతే కొన్ని మాయ మాటల కారణంగా మోసపోయాం అని అన్నారు.

కానీ రేవంత్ రెడ్డి మాత్రం గిరిజన భూములు గుంజుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఒక్క మనుకోటలోనే కాదు ఊరురా ఉరికిచ్చి కొట్టే బాధ్యత మీదే. మానుకోట మహాధర్నా మొదటి అడుగు మాత్రమే. మన లగచర్ల గిరిజన మహిళలకు న్యాయం జరిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడా గడుతాం అని కేటీఆర్ తెలిపారు.

మానుకోటలో మీరు కదం తొక్కి మాకు ఇచ్చిన శక్తిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు…బంజారా రాష్ట్ర సమితి కూడా. మీకు ఎప్పుడు కష్టమొచ్చినా మేము అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు.